Anna Raghu, Guntur, News18
ఏ పార్టీ అయినా అధికారంలో లేకపోతే అంతర్గత కుమ్ములాటలు తప్పవు. అసలే ఓటమిపాలైన అవమానం భారం ఓవైపు.. పార్టీలో నేతల పేచీలు మరోవైపు. పార్టీ నేతలపై ప్రభుత్వం పెట్టే కేసులు బోనస్ గా వస్తాయి. ఓ వైపు అధికార పార్టీతో పోరాడుతూనే.. మరోవైపు సొంతపార్టీ కేడర్ ను కాపాడుకోవడం కత్తిమీద సామువంటిది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ (Telugu Desham Party)లో ఇదే పరిస్థితి నెలకొంది. 2019 ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు తప్పడం లేదు. దీనికి తోడు సీనియర్ నేతల అలకలు, అసంతృప్తులతో పార్టీ బలోపేతం సంగతి అటుంచితే.. ఉన్నవారిని కాపాడుకోవడం తలనొప్పిగా మారుతోంది. మొన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి (Gorantla Buchhaiah Chowdary) అంశం కలకలం రేపితే.. నిన్న జేసీ కామెంట్స్ అగ్గిరాజేశాయి.. ఇప్పుడు కోడెల కుటుంబంపై తమ్ముళ్ల తిరుగుబాటు చంద్రబాబు (Nara Chandra Babu Naidu)కు ఊపిరాడకుండా చేస్తున్నాయి.
గుంటూరు జిల్లా (Guntur District) సత్తెనపల్లి నియోజకవర్గం టీడీపీలో తమ్ముళ్ల మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమంటోంది. కోడెల కుటుంబంపై పార్టీ కార్యకర్తలు తిరుగుబావుటా ఎగురవేస్తున్నారు. జిల్లాలో పార్టీని కాపాడండి.! త్వరగా జోక్యం చేసుకోండి.! టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆ పార్టీ నేతలు చేసిన విజ్ఞప్తి ఇది.! కొంతకాలంగా పల్నాడు పాలిటిక్స్ రంజుగా మారాయి. టీడీపీలో వర్గ విబేధాలు భగ్గుమన్నాయి. మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ రెండో వర్ధంతి సందర్భంగా స్వగ్రామం నకరికల్లు మండలం కండ్లకుంటలో ఆయన విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమం కాస్తా ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది.
కోడెల శివప్రసాద్ తనయుడు కోడెల శివరాంపై సొంత పార్టీ నేతలే సంచలన ఆరోపణలు చేశారు. తన దగ్గర నుంచి శివరాం 32 లక్షలు తీసుకున్నారని టీడీపీ నేత పమిడి బాలకృష్ణ మండిపడ్డారు. ఆ డబ్బులు తిరిగి ఇప్పించాలని డిమాండ్ చేశారు.కోడల శివప్రసాద్ మరణం తర్వాత యాక్టివ్ పాలిటిక్స్‌కు దూరమయ్యారు శివరాం. ఇటీవలే సత్తెనపల్లిలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సత్తెనపల్లికి ఇంతవరకు ఇంఛార్జ్ ను నియమించలేదు. దీంతో ఎవరికి వారే పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
కోడెల రెండో వర్ధంతి నాటికి స్వగ్రామంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని గ్రామ ప్రజలు, కమిటీ భావించింది. గురువారం ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెనాయుడు చేతుల మీదుగా విగ్రహాన్ని ఆవిష్కరించాలని నిర్ణయించారు. అయితే కండ్లకుంటకే చెందిన మాజీ సర్పంచ్ రామయ్య, అతని తనయుడు బాలకృష్ణ కోడెల శివరాంపై తీవ్ర ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది.కోడెల శివరాం వల్లే జిల్లాలో టీడీపీ భ్రష్టుపట్టిపోయిందని ఆరోపిస్తున్నారు టీడీపీ నేతలు. పార్టీ కార్యక్రమాలకు ఆయన్ను దూరంగా పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ వీడియోలు, పోస్టింగ్‌లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరి ఈ ఫిర్యాదులపై హైకమాండ్ ఏలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. తమ్ముళ్ల ఫిర్యాదుపై చంద్రబాబు స్పందిస్తారా..? కోడెల శివరామ్ ను పిలిచి మాట్లాడాతారా.? అనేది చర్చనీయాంశమైంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP Politics, Chandrababu Naidu, Guntur, TDP