Anna Raghu, Guntur, News18Telugu
తెలుగు రాష్ట్రాల్లో క్రిస్ట్ మస్ (Christmas), న్యూయర్ (New Year) సందడి నెలకొంది. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు రావడంతో చాలా మంది ఫ్యామిలీ ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నారు. ఐతే మిడిల్ క్లాస్ బడ్జెట్ పరిధి దాటకుంటా హాలిడేకి వెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), తెలంగాణ (Telangana) రాష్ట్రాల్లో ఎన్నో టూరిజం స్పాట్ లు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది సూర్యలంక బీచ్. గుంటూరు జిల్లా బాపట్ల సమీపంలో ఉన్న సూర్యలంక బీచ్ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకే గాక విదేశీ సందర్శకులకు కూడా విహార కేంద్రంగా మారింది. సూర్య లంక బీచ్ వద్ద బస చేసేందుకు వీలుగా ప్రభుత్వ వసతి గృహము మరియు కాటేజీలు ఉన్నాయి. బాపట్ల తీరంలోని సూర్యలంక అత్యంత అరుదైన బంగారపు వర్ణపు ఇసుక (గోల్డెన్ శాండ్)తో అంతర్జాతీయ బీచ్‌ల సరసన నిలుస్తోంది.
ఈ బీచ్ అర్ధ చంద్రాకారంలో వంపు తిరిగి ఉండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం తక్కువ. అలల ఉధృతి లేకుండా (సైలెంట్ సీ) పర్యాటకులు స్నానాలు చేసేందుకు ప్రశాంత వాతావరణాన్ని కల్పిస్తోంది. బీచ్ వెంబడి నీళ్లలో ఎక్కడా రాళ్లు లేని ఈ బీచ్ ప్రతిష్టాత్మక ‘బ్లూ ఫ్లాగ్’ సర్టిఫికేషన్ సాధించే దిశగా అడుగులేస్తోంది. సూర్యలంక బీచ్ బాపట్ల సమీపంలో 9 కి. మీ ల దూరంలో ఉంది. సముద్రతీరంలో ఉన్న ఈ పల్లె ఒక ఓడరేవు మరియు ఇక్కడ చేపల ఎగుమతి జోరుగా సాగుతుంది. బ్రిటీష్ పాలనలో ఈ ఊరు ఒక వెలుగు వెలిగిందని చెప్పవచ్చు. ఇండోనేషియాలోని సుమత్రా, జావా ద్వీపాలకు నేరుగా ఇక్కడి నుంచే సరకు రవాణా చేసేవారట.శీతాకాలంలో తీరం వెంబడి డాల్ఫిన్‌లు చేసే సందడిని ఎంజాయ్ చేయవచ్చు.
ఎలా చేరుకోవాలి..?
హైదరాబాద్, విశాఖపట్నం వంటి దూరప్రాంతాల నుంచి సూర్యలంక చేరుకోవడానికి చాలా మార్గాలున్నాయి. విమానం ద్వారా విజయవాడ ఎయిర్ పోర్టుకు అక్కడి నుంచి బస్సులు, క్యాబ్స్ ద్వారా బాపట్ల చేరుకోవచ్చు. అలాగే హైదరాబాద్ నుంచి గుంటూరు, విజయవాడకు నిత్యం ట్రైన్ కనెక్టివిటీ ఉంటుంది. విజయవాడ నుంచి అయితే తెనాలి మీదుగా లేదా గుంటూరు మీదుగా ప్రయాణించి సూర్యలంక చేరుకోవచ్చు. గుంటూరు నుంచి 43 కిలోమీటర్లు, విజయవాడ నుంచి 71 కిలోమీటర్ల దూరంలో సూర్యలంక బీచ్ ఉంది. విజయవాడ నుంచి తెనాలి లేదా గుంటూరు మీదుగా ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంది. అలాగే హైదరాబాద్ నుంచి గుంటూరు వచ్చిన వారు బాపట్ల మీదుగా నేరుగా సూర్యలంక చేరుకోవచ్చు.
అందుబాటులో రిసార్టులు..!
సూర్యలంక బీచ్ లో బస చేయటానికి రిసార్టులు కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎపీ టూరిజం గెస్ట్ హౌస్ లు మరియు హరిత బీచ్ రిసార్ట్, ది హిట్స్ రిసార్ట్, సీబీరీజ్ బీచ్ రిసార్ట్,రివైర బీచ్ రిసార్ట్, బుద్ధ బీచ్ రిసార్ట్ లతో పాటు మరికొన్ని సంస్థలు రిసార్ట్స్ ను నిర్వహిస్తున్నాయి. రూ.1,500 నుంచి రూ.10వేల లోపు అద్దెలతో రిసార్టులు అద్దెకు తీసుకోవచ్చు.
చుట్టుపక్కల ప్రదేశాలు..!
సూర్యలంక బీచ్ టూర్ కు వచ్చిన వారు గుంటూరు జిల్లాలోని కొండవీడు ఫోర్ట్, అమరావతిలో అమరలింగేశ్వరస్వామి ఆలయం, ధ్యానబుద్ధ విగ్రహం, మంగళగిరిలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయంతో పాటు విజయవాడలో కనకదుర్గమ్మ ఆలయం, భవానీ ద్వీపాన్ని సందర్శించవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Guntur, Tourism