GUNTUR SUPER TALENT THE ART OF SCRAP BY TENALI ARTIST RAVICHANDRA IN GUNTURU DISTRICT NGS GSU NJ
Guntur: ఇనుములో ఒక హృదయం మొలిచినే..? ట్రెండ్ సెట్ చేస్తున్న తెనాలి కుర్రాడు
ఇనుముకు ప్రాణం పోస్తున్నకళాకారుడు
Guntur: కాదేదీ కళకు అనర్హం అన్నాడో మహాకవి. ఆ మాటనే స్ఫూర్తిగా తీసుకుని తెనాలి కుర్రాడు.. అద్భుతాలు చేస్తున్నాడు. తన సృజనాత్మకశక్తికి కాస్త పదును పెడుతున్నాడు. తుప్పు పట్టిన ఇనుపముక్కలకు ప్రాణం పోస్తున్నాడు. చూసిన ఎవరైనా వావ్ అనాల్సిందే.
Guntur: కాదేదీ కళకు అనర్హం అన్నాడో మహాకవి. ఆ మాటనే స్ఫూర్తిగా తీసుకుని తెనాలి కుర్రాడు.. తన సృజనాత్మక శక్తికి కాస్త పదును పెట్టాడు. తుప్పు పట్టిన ఇనుప ముక్కలకు ప్రాణం పోశాడు. అద్భుతమైన కళాకండాలను తీర్చిదిద్దాడు. తాత ముత్తాతల నుంచి వారసత్వంగా వచ్చిన శిల్పకళలో తనదైన ముద్ర వేసుకుని జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడు ఆంధ్రాప్యారిస్ యువ శిల్పి కాటూరి రవిచంద్ర. అతడు ఉండే ప్రాంతం శిల్పకళకు నిలయంలాంటిది. గత కొన్నేళ్లగా వారసత్వంగా వస్తున్న శిల్పకళకు ప్రాణం పోసి బతికిస్తున్నారు కాటూరు వెంకటేశ్వరరావు, అతని కుమారుడు రవిచంద్ర. స్వయంకృషితో ఎదిగిన వెంకటేశ్వరరావు.. తన కుమారుడికి విద్యతో కూడిన శిల్పకళాకారుడిగా తీర్చిదిద్దారు.
కాటూరి వెంకటేశ్వరరావు వంశపారంపర్యంగా వచ్చిన శిల్పకళతో ఇప్పటికే వివిధ దేవతామూర్తులు, రాజకీయ నాయకులు, శాస్త్రవేత్తల కాంస్య, పంచలోహ ఫైబర్, గ్లాస్ విగ్రహాలను రూపొందించి పేరు గావించారు. తండ్రిలానే రవిచంద్ర కూడా శిల్పకళలో ఆరితేరారు. తాత ముత్తాతల నుంచి వస్తున్న శిల్పకళలో రవిచంద్రది ఆరోతరం. చిన్ననాటి నుంచి తండ్రిని గమనిస్తున్న వచ్చిన రవిచంద్రకు సహజంగానే కళాభిమానం అలవడింది.
మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్‌లో గోల్డ్ మెడల్ ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్ లాంటి కమర్షియల్ చదవుల వైపు కాకుండా… తన తండ్రి వారసత్వాన్ని కొనసాగించాలని హైదరాబాద్ జేఎన్టీయూ (Hyderabad JNTU) లో ఫైన్ ఆర్ట్స్ (Fine Arts) లో డిగ్రీ చేశాడు. సరికొత్త టెక్నిక్స్ కోసమని కోల్‌కతా విశ్వవిద్యాలయం (Kolkata University) లో మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్‌లో గోల్డ్ మెడల్ (Gold Medal in Master of Fine Arts) సాధించాడు. అంతేకాదు ఆ రాష్ట్ర గవర్నర్‌తో పురస్కారాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత తండ్రి నిర్వహిస్తున్న కాటూరి ఆర్ట్ గ్యాలరీలో అడుగుపెట్టాడు. తండ్రికి తగ్గ తనయుడిగా…ఇంకా చెప్పాలంటే తండ్రిని మించిన తనయుడిగా కీర్తిగడించాడు.
శిల్పకళలో తనదైన ముద్ర
ప్రముఖుల కాంస్య, ఫైబర్, సిమెంట్ విగ్రహాలను రూపొందిస్తూ రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందారు రవిచంద్ర. శిల్పకళలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతో సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. తూకానికి తప్ప ఎందుకు పనికి రాని ఇనుప స్క్రాప్‌ను అందమైన శిల్పాలుగా రూపొందించారు.
తుప్పు పట్టిన ఇనుముకు ప్రాణం పోసిన రవిచంద్ర గుంటూరు మాయాబజార్ నుంచి వాహనాల విడిభాగాలను కొనుగోలు చేస్తూ, వాటితో ఒక్కో విగ్రహాన్ని చేస్తూ వచ్చాడు. జీవవైవిద్యంపై రవీంద్రభారతీలో జరిగిన ప్రదర్శనలో రవిచంద్ర తయారుచేసిన శిల్పాలకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఆ విధంగా బెంగళూరులో జరిగిన ఇనుప వ్యర్థాలకు మరో రూపం అనే కాన్సెప్ట్ ప్రదర్శనలో.. కాటూరి రవిచంద్ర, తన తండ్రితో కలిసి 30 రకాల శిల్పాలను ఏర్పాటుచేశారు. దేశ విదేశీయులు ఎక్కువగా సందర్శించే ఈ ఆర్ట్ గ్యాలరీలో రవిచంద్ర ఏర్పాటు చేసిన శిల్పకళకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
ఇనుప వస్తువులతో అద్భుత శిల్పాలు
ఇనుప తీగలతో చేసిన జోడెద్దులు-రైతు, రాట్నం వడుకుతున్న గాంధీ, గుర్రం శిల్పాలు, లింకు చైనుతో ఏనుగు, ఆటోమొబైల్ స్క్రాప్‌తో ఒంటె, సింహం, పులి, ఇనుప బోల్టులు, వాషర్లతో కాఫీ తాగుతున్న వ్యక్తి, స్త్రీ మూర్తి.. రోబో, బైకు పెట్రోలు ట్యాంక్‌తో బాతు, నెమలి వంటి జంతువులను తయారుచేశారు. అంతేకాదు 18 అడుగుల వీణ, 16 అడుగుల గిటార్, 15 అడుగుల షటిల్ బ్యాట్‌ను ఆవిష్కరించారు.
దేశంలోని ప్రధాన నగరాల్లో ప్రదర్శనలు. ఆ తర్వాత వరుసగా ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో నిర్వహించిన ప్రదర్శనలకు కళా విమర్శకుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. ప్రజల నుంచి వచ్చిన స్పందనతో రవిచంద్రలో ఇంకాస్త పట్టుదల మొదలైంది. ఈ తరహా శిల్పకళకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావాలనే కృషి చేయడం మొదలుపెట్టారు.
మోదీ విగ్రహ తయారీతో మరింత గుర్తింపు
ఆటోమొబైల్ ఐరన్ స్క్రాప్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ విగ్రహాన్ని తీర్చిదిద్దారు. సూర్య శిల్ప శాల నిర్వాహకులు కాటూరి వెంకటేశ్వరావు, ఆయన కుమారుడు రవిచంద్ర 14 అడుగుల ఎత్తు, రెండు టన్నుల ప్రధాని మోదీ విగ్రహాన్ని తయారు చేశారు. బెంగళూరుకు చెందిన ఒక సంస్థ కోసం ఐరన్ స్క్రాప్‌తో ప్రధాని మోదీ పోలికలతో విగ్రహాన్ని తయారు చేయడం….వీళ్లకు మరింత పేరు తీసుకొచ్చింది.
ఆంధ్రాప్యారిస్ యువశిల్పి రవిచంద్ర శిల్పకళానైపుణ్యం దేశవిదేశాల్లోనూ ప్రశంసలు అందుకుంటోంది. రవిచంద్ర తీర్చిదిద్దిన కళాకృతులు మన దేశంలోనే కాదు…సింగపూర్, మలేషియా దేశాల్లోని కళాప్రియుల మనసును దోచుకున్నాయి. శిల్పకళాకారుడు రవిచంద్ర మాటల్లో… 2011లో ఈ తరహా శిల్పకళను ప్రారంభించాను. ఐదారేళ్లలోనే సింగపూర్, మలేషియాలో ప్రదర్శనలు ఇచ్చాను. ఫేస్ బుక్‌లో ఫాలో అవుతున్న సింగపూర్‌లోని జ్ఞాని ఆర్ట్ గ్యాలరీ నిర్వాహకులు…నా విగ్రహాలను చూసి నన్ను సంప్రదించారు. తెనాలి వచ్చి నేను చేసిన కళాకృతులు చూసి నచ్చడంతో వివిధ దేశాల్లో ప్రదర్శనలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ తర్వాత ఒక అడుగు నుంచి 8 అడుగుల ఎత్తు వరకు నేను చేసిన 30 శిల్పాలను సింగపూర్ ఆర్ట్ గ్యాలరీ సేకరించింది.
రవిచంద్ర ఖాతాలో ఎన్నో అవార్డులు, రివార్డులు 2010లో పశ్చిమబెంగాల్ గవర్నర్స్ అవార్డు, మిరాకిల్ వరల్డ్ రికార్డు లభించింది. 2013లో దేశవ్యాప్తంగా సెలక్ట్ చేసిన 40 మంది శిల్పులలో రవిచంద్రకు స్థానం. ఆ తర్వాత 2014లో కర్ణాటక కళాపరిషత్ జాతీయస్థాయి మేళలో రవిచంద్ర కళాకృతులకు స్థానం లభించింది. ఇలా ఎన్నో రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనేక అవార్డులు అందుకున్నారు. అంతర్జాతీయ శిల్పిగా గుర్తింపు తెచ్చుకోవాలన్నదే తన ఆశయమంటున్నాడు రవిచంద్ర.
ఈ యువశిల్పి రవిచంద్ర తయారుచేసిన శిల్పకళాకృతులు చూడాలనుకుంటే మీరు సూర్య శిల్పశాలకు వెళ్లాల్సిందే. ఉదయం 8.30 నుంచి రాత్రి 7.30 నిమిషాల వరకు తెరిచే ఉంటుంది.
ఎలా వెళ్లాలి?
గుంటూరు బస్టాండ్ నుంచి తెనాలికి నేరుగా బస్సులు ఉంటాయి. అక్కడ నుంచి లోకల్ ఆటోలో టెలిఫోన్ ఎక్స్చేంజ్ రోడ్‌కు వెళ్తే..అక్కడే మనకు ఈ సూర్య శిల్పకళ ఆర్ట్ గ్యాలరీ కనిపిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.