పుత్రుడు అంటే పున్నామనరకం నుంచి తప్పించేవాడు. ఆ పెద్దాయన కూడా అదే భావించాడు. కన్నకొడుకును పెంచి పెద్దచేయడమే కాకుండా.. పెళ్లికూడా జరిపించాడు. కానీ కొడుకు దారితప్పాడు. భార్య ఉండగా వేరే మహిళతో సంబంధం పెట్టుకున్నాడు. కొడుకు కాపురం నాశనమవుతుందని భావించిన తండ్రి.. సంబంధం పెట్టుకున్న మహిళకు నచ్చజెప్పి పంపేశాడు. ఐతే తన సుఖానికి అడ్డొస్తావా అంటూ వృద్ధుడు అని చూడకుండా కన్నతండ్రిని దారుణంగా హత్యచేశాడు. తండ్రి మృతదేహాన్ని అనాథశవంలా స్మశానంలో అప్పజెప్పి చేతులుదులుపుకున్నాడు. కానీ చేసిన పాపం ఊరికే ఉండదుకదా.. కసాయి కొడుకు చేసిన దారుణాన్ని బట్టబయలు చేసింది. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ గుంటూరు నగరంలోని ఏటీ అగ్రహారానికి చెందిన పిల్లలమల్లి శివానందరామం అలియాస్ ఆనందరావు పౌరహిత్యం చేస్తూ జీవనం సాగిస్తుండేవారు. ఈయనకు వంశీ మోహన్, కిషోర్ అనే ఇద్దరు కుమారులున్నారు. భార్య పదేళ్ల క్రితం మృతి చెందగా.. చిన్నకుమారుడు కిషోర్ అనారోగ్యంతో కొంతకాలం క్రితం మృతి చెందాడు. పెద్దకుమారుడు వంశీ మోహన్ పెళ్లి చేసుకొని వేరుగా ఉంటున్నారు. కుమారుడితో మనస్పర్థలు రావడంతో ఆనందరావు ఒంటరిగా ఉంటున్నారు.
మరోవైపు వంశీ మోహన్ వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. తన కొడుకు కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడని ఆవేదన చెందిన ఆనందరావు ఆ మహిళ వద్దకు వెళ్లాడు. తన కుమారుడ్ని వదిలేయాలని కాపురాన్ని పాడు చేయవద్దని.. ఇది మంచిపద్దతి కాదని ఆమెకు నచ్చజెప్పాడు. దీంతో సదరు మహిళ వంశీ మోహన్ ను దూరం పెట్టింది. ఆమె తనకు దూరమవడానికి తండ్రేకారణమని తెలుసుకున్న వంశీ మోహన్.. మంగళవారం ఆనందరావుతో గొడవపడ్డాడు. ఆయన్ను దారణంగా కొట్టి హతమార్చాడు.
అదేరోజు రాత్రి తండ్రి మృతదేహాన్ని ఎవరికీ తెలియకుండా ఆటోలో శ్మశానవాటికకు తీసుకెళ్లాడు. తన తండ్రి అనారోగ్యంతో మృతి చెందారని.. తమది ఇద్దె ఇల్లు కావడంతో ఇక్కడికి తీసుకొచ్చానని తెలిపాడు. రాత్రిపూట అంత్యక్రియలు చేయడం కుదరదని కాటికాపరి చెప్పడంతో మీరే సాయం చేయాలంటూ వేడుకొని మృతదేహాన్ని అక్కడే ఉంచి వెళ్లాడు. ఐతే కాటికాపరి అనాథ శవాలను ఖననం చేయడానికి సాయపడే రుద్ర ఛారిటబుల్ ట్రస్టు నిర్వాహకులు సుభానీకి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పారు. వెంటనే సుభానీ ఫ్రీజర్‌తో పాటు తన వద్ద ఉన్న అంబులెన్స్‌ను పంపించి అందులో ఉంచితే ఉదయం వచ్చి పరిశీలిస్తామన్నారు.
బుధవారం ఉదయం సుభానీ, సంస్థ సభ్యులతో కలిసి శ్మశాన వాటికకు వెళ్లారు. ఆ తర్వాత కాటికాపరి వంశీ మోహన్ కు ఫోన్ చేయగా ఎవ్వరూ తీయలేదు. దీంతో అనుమానం వచ్చిన సుభాని మృతదేహాన్ని పరిశీలించారు. శరీరంపై గాయాలుండటంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారమిచ్చారు. ఇనుపరాడ్డుతో దాడిచేయడం వల్లే ఆనందరావు మృతి చెందారని పోలీసులు తెలిపారు. వంశీమోహన్ పై కేసు నమోదు చేసి అతడ్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.