(Sumanth Jangam, News 18, Guntur)
కాలానుగుణంగా రైతులు కూడా ట్రెండ్ మార్చారు. మట్టి మనిషి.. కోటీశ్వరుడు టైటిల్ వేటలో పడ్డారు. ఎర్ర చెందనం సాగులో దూసుకుపోతూ… చెట్టు నుంచి కోట్లు కొల్లగొట్టేందుకు రూట్లు వేస్తున్నారు.
పుష్ప...! సినిమా మనందరికీ ఎర్రచందనం.. దాని విలువ ఏంటో… అంతర్జాతీయ మార్కెట్లో దాని గిరాకీ ఎంత ఉందో మనకళ్లకు కట్టినట్లు చూపించింది. ప్రపంచంలోనే అరుదైన, విలువైన ఎర్రచెందనం, మన శేషాచల అడవుల్లో పెరుగుతుంది. అడివి జాతి వృక్షం కావటం వలన .. దాదాపు ఎలాంటి వాతావరణంలో నైనా చాలా ఈజీగా పెరుగుతుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు కనుమలలో ఈ మొక్క సహజముగా పెరిగి అత్యధిక నాణ్యత కలిగి ఉంటుంది. మన రాష్ట్రంలోనే కాదు తెలంగాణాతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ ఎర్రచందనాన్ని రైతుపొలాలలో పెంచుతున్నారు. ఎర్రచందనము నీరు నిలువని ఎర్ర నేలల్లో మంచిగా పెరుగుతుంది. ఈ సాగుకు సగటున 800 మి.మీ. నుండి 1000 మి.మీ. వర్షపాతము అవసరం. దీని పంట కాలం కనీసం 15 నుండి 20 ఏళ్ల మధ్య ఉంటుంది.
అయితే ఈ పంటను సాధారణ రైతులు వేసుకోవచ్చా..?
నిరభ్యంతరంగా రైతులు ఈ ఎర్రచందనాన్ని సాగు చేసుకోవచ్చు. కానీ దానికి రెవిన్యూ, ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ అధికారుల పర్మిషన్ తప్పనిసరి. అయితే రైతులు సాగు చేసే ఎర్రచందనం అంత క్వాలిటీ ఉంటుందా లేదా అన్నదే ప్రశ్న.
ఎర్రచేందనం సాగు పట్ల ప్రభుత్వం మరియు నవ్య సాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి ప్రైవేటు సంస్థలు.. రైతులకు సాగు విధానం పై అవగాహన కల్పిస్తున్నారు. ప్లాంటేషన్ దగ్గర నుండి మార్కెటింగ్ వరకు రైతులను గైడెన్స్ ఇస్తున్నారు. సరైన జాగ్రత్తలతో సాగు చేస్తే 15 నుండి 20 ఏళ్లు ఉన్న చెట్టు ధర.. దాని వైశాల్యం గ్రేడింగ్‌ను బట్టి ఒక్కో చెట్టు కోటి రూపాయలు వరకు పలికే అవకాశం ఉంది.. అని నవ్య సాయి ప్రాజెక్ట్స్ ప్రతినిధి శివ రామ కృష రాజు తెలిపారు.
గుంటూరు జిల్లా రైతులు ఎర్రచందనం సాగువైపు మొగ్గుచూపుతున్నారు. తంగిరాల గ్రామం నుజండ్ల మండలం వినుకొండ శ్రీశైలం హైవే పక్కన దాదాపు 410 ఎకరాల్లో ఎర్రచందనం సాగు చేస్తున్నారు.
ఎర్రచందనం సాగు చేయు విధానం…!
పరిపక్వత చెందిన ఎర్రచందనము విత్తనాలను మార్చి, ఏప్రిల్ లేదా మే నెలలలో నర్సరీ మడులలో విత్తుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత నారుమడులను ఎండు గడ్డితో పలుచగా కప్పుకోవాలి. తర్వాత 10-15 రోజుల్లో విత్తనాలు మొలకెత్తుతాయి. 10మీ. X 1మీ. నారుమడిని 10 నుంచి 12 కిలోల విత్తనము అవసరమవుతాయి.
భూమిని ఇరువైపుల లోతుగా దున్నాలి. 4మీ. X 4మీ. దూరంలో 45 సెం.మీ X 45 సెం.మీ.X45 సెం.మీ. గుంతలు తవ్వుకోవాల్సి ఉంటుంది. గుంతల్లో లిండేన్ పౌడరును చల్లడం వలన చెదల తాకిడిని అరికట్టవచ్చు. వెర్మికంపోస్టుతో కవర్ ఫిల్లింగ్ చేసిన మొక్క తొలిదశ ఆరోగ్యంగా ఉంటుంది.
ఎరువుల విషయానికి వస్తే.. ఒక చెట్టుకు సంవత్సరానికి 10 నుండి 15 కిలోల పశువుల పేడ 150:100:100 గ్రా. (N: P: K) ఐదేళ్లు వేసుకోవాలి. అది కూడా రెండు విడతలుగా వేసుకోవాలి. తొలివిడత జూన్, జులైలలో… రెండో విడత విడత అక్టోబర్, నవంబర్‌లలో వేసుకోవాలి.
ఎర్రచెందనం చెట్లు నాటిన వెంటనే నీరుపోయాలి. చెట్టు నాటుకున్న తరువాత 10-15 రోజులకొకసారి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నీరు అందించాలి. ఎరువులు వేసే ముందు చెట్టుచుట్టూ కలుపు తీసుకోవాలి. తరుచుగా చెట్టు చుట్టూ మట్టిని తవ్వుతూ పాదులు చేయాలి.15-20 ఏళ్ల తరువాత ఒక చెట్టు నుండి దాదాపు 250 కిలోల కలప వస్తుంది.
పంట చేతికొచ్చిన సమయంలో అధికారులకు సమాచారం ఇవ్వాలి. వాళ్లే వచ్చి కలపను చూసి గ్రేడ్‌ను బట్టి ధర నిర్ణయించి కొనుగోలు చేస్తారు. ఒక్కోసారి చెట్టు దుంగ బలంగా..మంచి ఏపుగా పెరిగితే…ఒక చెట్టు ధరే కొన్ని లక్షలు పలుకుతుంది. అంతేకాని మనం విడిగా అమ్ముకోడానికి అనుమతి ఉండదు.
అసలు ఎందుకని ప్రపంచ మార్కెట్‌లో ఈ ఎర్రచెందనం కలపకు అంత గిరాకీ ఉంటుంది..! చైనా, జపాన్‌తో పాటు రష్యా వాళ్లు కూడా ఎర్రచందనాన్ని మన దేశం నుంచి దిగుమతి చేసుకుంటారు. అక్కడ వాళ్లు వాడే వంటపాత్రలు కూడా ఈచెక్కతో చేసినవే ఉంటాయట. అంతేకాదు సంగీతవాయిద్య పరికరాలను ఈచెక్కతో తయారుచేయించి బహుమతులుగా ఇస్తుంటారు.
అందులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. కాస్మెటిక్స్, ఫేస్ క్రీమ్స్ , వయాగ్రా లాంటి వాటిలో ఈ ఎర్రచందనాన్ని విరివిగా వాడుతారు. అల్సర్‌లను తగ్గించే గుణం, కిడ్నీ సమస్యలు, రక్తాన్ని శుద్ధి చేయడం వంటి ఎన్నో రోగాలను తగ్గించే లక్షణాలు ఈ ఎర్ర చందనంలో ఉంటాయి.
ఎర్రచందనానికి అంత డిమాండ్ ఉండటం వల్లే ఈ మధ్యకాలంలో రైతులు ఈ సాగు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. మరికొందరు ఆ అనుమతులకు ఎక్కడ తిరుగుతాంలే అని...18ఏళ్ల పాటు పొలాన్ని అలా వదిలేయాలా అంటూ.. రెగ్యులర్ పంటలు పండించుకుంటున్నారు. ఇంకొందరు రైతులు కాస్త ముందడుగు వేసి ఈ ఎర్రచందనం సాగు చేస్తున్నారు.
మీరు ఎవ్వరైనా ఎర్రచందనం వేయాలనుకుంటే...ఈ క్రింది నెంబర్ ను సంప్రదిస్తే చాలు.. అన్ని వివరాలు వాళ్లు చెబుతారు. +91 9248366999
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Agriculuture, Andhrapradesh, Guntur, Local News