GUNTUR POLITICAL WAR AGAINST 10TH INTER EXAMS TDP LEADER NARA LOKESH WROTE A LETTER TO ANDHRA PRADESH GOVERNOR NGS
Andhra Pradesh: పది, ఇంటర్ పరీక్షల రద్దుకు 2 లక్షల మంది మద్దతు.. నేరుగా గవర్నర్ కు లేఖ
ఏపీలో పది, ఇంటర్ పరీక్షల రద్దుపై పోరాటం
ఏపీలో పది, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాల్సిందేనా? సుమారు 2 లక్షల మంది విద్యార్థుల తల్లి దండ్రులు ఏపీలో పరీక్షలు రద్దు చేయాలని చేస్తున్న డిమాండ్ కు మద్దతు తెలిపినట్టు తెలుస్తోంది. ఆన్ లైన్ ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొనలేని చాలామంది పరీక్షల రద్దుకే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం.
ఏపీలో పది, ఇంటర్ పరీక్షల నిర్వహణపై సస్పెన్ష్ వీడడం లేదు. సీఎం జగన్ మొన్న దీనిపై క్లారిటీ ఇచ్చారు. విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఫ్యూచర్ లో ఏ కాంపిటేటివ్ పరీక్షకు హాజరుకావాలన్నా? ఉద్యోగాల ఎంపికకైనా పది, ఇంటర్ మార్కులే ప్రామాణికమన్నారు. అందుకే పరీక్షలను రద్దు చేయడం లేదని వివరణ ఇచ్చారు. అయితే ప్రస్తుతం పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. ఏపీ వ్యాప్తంగా కేసులు రెట్టింపు అవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. వీటికి తోడు ఏపీలో కంటైన్ మెంట్ జోన్ లు కూడా పెరుగుతున్నాయి. అధికారికంగా ప్రకటించకున్నా చాలా చోట్ల కంటైన్మెంట్ జోన్.. ఎవరికీ ప్రవేశం లేదనే బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఇక తిరుపతిలో అయితే అధికారికంగా కంటైన్ మెంట్ జోన్ గా ప్రకటించారు. చాలా జిల్లాల్లో అదే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా పట్టణాల్లో కేసులు రెట్టింపు అవుతున్నాయి. ఇలాంటి సమయంలో పరీక్షల నిర్వహణ కత్తిమీద సామే అవుతుంది. అందులోనూ మే చివరి నాటికి కేసుల సంఖ్య రెట్టింపు అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు దేశ వ్యాప్తంగా మే రెండు తరువాత లాక్ డౌన్ ఉండే అవకాశం ఉందంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
ఫ్యూచర్ సంగతి ఎలా ఉన్నా.. ప్రస్తుతం అసలు అధికారులు పరీక్షలు నిర్వహించేందుకు సమాయత్తంగా ఉన్నారా అన్నది ప్రశ్నార్థకమే. చాలా వరకు ప్రభుత్వ కార్యాలయాల్లో కరోనా భయపెడుతోంది. భారీగా కేసులు నమోదు అవుతున్నాయి. దాదాపు చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం కోసం డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే దీనిపై ప్రభుత్వానికి కొందరు అధికారులు స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించడం అంతా ఈజీ కాదని సూచించినట్టు సమాచారం.
ఇక విద్యార్థుల తల్లిదండ్రులు, ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు కూడా పరీక్షలు రాసేందుకు సిద్ధంగా లేనట్టు తెలుస్తోంది. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రులు అభిప్రాయం సేకరిస్తున్నారు టీడీపీ యువ నేతలు. ఆన్ లైన్ ద్వారా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అభిప్రాయాలను సేకరిస్తే.. దాదాపు 80 శాతానికి పైగా అందరూ పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. తమ పిల్లల ఆరోగ్యంతో ఆటలాడడం కరెక్టు కాదంటూ ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
మరోవైపు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ దీనిపై అలుపెరుగుని పోరాటం చేస్తున్నారు. ఇప్పటికే ఆయన సీఎం జగన్ దీనిపై లేఖ రాశారు. విద్యార్థుల క్షేమం ప్రభుత్వానికి పట్టదా అంటూ లోకేష్ నిలదీస్తున్నారు. ఇటీవల దీనిపై సీఎం జగన్ కు లేఖ కూడా రాశారు. అయితే ఈ లేఖ రాయడంతోనే జగన్ తన నిర్ణయం మార్చుకోవడం లేదని.. లేదంటే పరీక్షల రద్దుకే మొగ్గు చూపేవారు అంటూ ఓ ప్రచారం జరుగుతోంది. అయినా లోకేష్ తన పట్టు విడవడం లేదు. రాష్ట్రంలో పది, ఇంటర్ పరీక్షలు రద్దుకు జోక్యం చేసుకోవాలని కోరతూ రాష్ట్ర గవర్నర్కు నారా లోకేష్ లేఖ రాశారు. ప్రభుత్వం నిర్వహించే ఇంటర్, పదో తరగతి పరీక్షలకు 16.3లక్షల మంది హాజరు కావాల్సి ఉంటుందని తెలిపారు. కరోనా రెండో దశ తీవ్రతలో పరీక్షల నిర్వహణ విద్యార్థులకు ప్రాణసంకటంగా మారుతుందన్నారు. దేశంలోని దాదాపు 20 రాష్ట్రాలు 10, 12వ తరగతి విద్యార్థులకు పరీక్షలు వాయిదా వేయటం లేదా రద్దు చేశాయని... ఇందుకు విరుద్ధంగా ఏపీలో పరీక్షలు నిర్వహించాలనుకోవటం కరోనా వైరస్ను మరింత వ్యాప్తి చేయటమే అని లేఖలో తెలిపారు. ఏ ఒక్క విద్యార్థి కరోనా బారిన పడి చనిపోయినా అది క్షమించరాని నేరమే అవుతుందని లోకేష్ చెప్పారు. పరీక్షల నిర్వహణపై తెలుగుదేశం పార్టీ చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ వివరాలను గవర్నర్ ముందు ఉంచారు. 2 లక్షలకు పైగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఈ కరోనా కల్లోల సమయంలో పరీక్షల నిర్వహణ వద్దంటూ తమ ఉద్యమానికి మద్దతు ప్రకటించారని ఆయన లేఖలో పేర్కొన్నారు. తమకున్న విశేష అధికారాలతో పరీక్షల నిర్వహణపై జోక్యం చేసుకోవాలని గవర్నర్ ను కోరారు. ఆన్లైన్ ద్వారా వచ్చిన అభిప్రాయాలతో కూడిన 1778 పేజీలను లేఖకు జత చేస్తున్నట్లు లోకేష్ తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.