పోలీసులంటే నేరస్థులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరిస్తారు. ఎలాంటి క్లూ దొరక్కపోయినా కామన్ సెన్స్ వాడి కేటుగాళ్లను కటకటాల్లోకి నెడతారు. హత్య జరిగినా, దోపిడీ జరిగినా, ఇంకేమైనా నేరాలు జరిగినా బుర్రకు పదునుపెట్టి కేసులను దర్యాప్తు చేస్తారు. డ్యూటీలో తెలివితేటలు చూపించి బాధితులకు న్యాయం చేయడం పోలీసుల విధి. కానీ ఓ పోలీస్ తన బుర్రను జనాలకు టోకరా వేయడానికి ఉపయోగించాడు. ఏ కేసు దర్యాప్తులో నేర్చుకున్నాడో ఏమో.. తన స్కెచ్ పక్కాగా అమలు చేస్తూ మోసాలు చేయడం ప్రారంభించాడు. అంతేకాదు తన అడ్రస్ గా ఏకంగా ఎస్పీ ఆఫీసుగా రాసేస్తున్నాడు. అదేంటని అడిగిన వారిని చంపేస్తానని బెదిరిస్తున్నాడు. వివరాల్లోకి వెళ్తే... ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని గుంటూరు (Guntur) నగరానికి చెందిన ఓ పాన్ బ్రోకర్ దుకాణానికి రెండు నెలల క్రితం ఓ వ్యక్తి వచ్చాడు.
తనకు అర్జెంటుగా డబ్బులు అవసరమున్నాయని.. తన తల్లికి ట్రీట్ మెంట్ చేయించాల్సి ఉందని సదరు వ్యాపారికి చెప్పాడు. తన దగ్గరున్న సాయిబాబా ఉంగరాన్ని తాకట్టుపెట్టుకొని రూ.50వేలు ఇవ్వాలని కోరాడు. తనను పోలీస్ గా పరిచయం చేసుకున్నాడు. వచ్చింది పోలీస్ కావడం, దానిపై హాల్ మార్క్ ఉండటంతో ఉంగరాన్ని పరీక్షించకుండానే సదరు వ్యాపారి రూ.50వేలు చేతిలో పెట్టాడు. రసీదుపై అడ్రస్ రాయడానికి వివరాలు అడగ్గా ఎస్పీ ఆఫీసే తన అడ్రస్ అని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత డబ్బులు తీసుకొని వెళ్లిపోయాడు.
ఇటీవల మళ్లీ అదే వ్యక్తి ఓ నవరత్నాల ఉంగరం తీసుకొచ్చి డబ్బులు కావాలని కోరాడు. ఆ ఉంగరాన్ని పరిశీలించి ఇస్తానని చెప్పడంతో ఉంగరాన్ని లాక్కొని కోపంగా వెళ్లిపోయాడు. ఐతే అతడి వైఖరిపై అనుమానం వచ్చిన వడ్డీ వ్యాపారి.. పాత ఉంగరాన్ని పరిశీలించగా అది నకిలీదిగా తేలింది. వెండి ఉంగరంపై బంగారుపూత పూసి మోసం చేసినట్లు గ్రహించాడు. వెంటనే ఉంగరం తాకట్టుపెట్టిన వ్యక్తికి ఫోన్ చేసి నిలదీయగా.. తాను పోలీసునని.. ఎక్కవ చేస్తే చంపేస్తానని బెదిరించాడు. ఏం చేసుకుంటావో చేసుకో అంటూ దుర్భాషలాడాడు. ఐతే అతగాడి బెదిరింపులకు లొంగని వడ్డీ వ్యాపారి.. పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు.
మోసగించిన వ్యక్తి.. గుంటూరులోని ఓ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసు అయి ఉండి ప్రజల ఆస్తులను కాపాడాల్సిందిపోయి ఇలాంటి క్రిమినల్ బ్రెయిన్ తో మోసం చేయడంపై సొంత శాఖకు చెందిన వారే మండిపడుతున్నారు. సదరు పోలీస్ పై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. విషయం బయటకు రాకుండా సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించినట్లు సమాచారం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP Police, Crime news, Guntur