ఆమె భర్త ఉపాధి కోసం దూరప్రాంతం వెళ్లాడు. భర్త ఆరు నెలలకు ఒకసారి వస్తుండటంతో మరో వ్యక్తికి దగ్గరైంది. ఆ బంధమే ఆమె ప్రాణాలమీదకు తెచ్చింది. ప్రియుడితో పాటు అతడి స్నేహితుడు కూడా కోరిక తీర్చమని బలవంతం చేయడంతో నిరాకరించింది. దీంతో ఆ యువకుడు మృగంలా మారి ఆమె ప్రాణాలు తీశాడు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని గుంటూరు జిల్లా (Guntur District) దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో మహిళ అనుమానాస్పద కేసు ఊహించని మలుపు తిరిగింది. ఈ ఘటనలో అత్యాచారం జరగలేదని... అక్రమ సంబంధమే హత్యకు కారణమని పోలీసులు తెలిపారు. మృతురాలికి ఓ యువకుడితో ఉన్న వివాహేతర సంబంధం కారణంగా హత్య జరిగినట్లు తెలిపారు. మహిళకు గతంలో వెంకటసాయి సతీష్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది.
హత్య జరిగిన రోజు మధ్యాహ్నం సతీష్, తన స్నేహితుడు శివసత్య సాయిరామ్ ను తీసుకొని ఆమె ఇంటికి వెళ్లాడు. తొలుత సతీష్ ఇంట్లోకి వెళ్లి బయటకురాగా.. ఆ తర్వాత లోపలికి వెళ్లి సాయిరామ్ తన కోరిక తీర్చాలని మహిళను వేధించాడు. ఐతే అందుకు ఆమె నిరాకరించింది. తనను వేధించిన విషయం అందరికీ చెబుతానని బెదిరించింది. దీంతో ఆమె చీరను మెడకు బిగించి హత్య చేశాడు. ఈ ఘటనలో సామూహిక అత్యాచారం జరిగిందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు.
ఘటనలో మృతురాలు తిరుపతమ్మ తుమ్మపూడిలో పోలాలకు నీళ్లుపెట్టే పైపులను అద్దెకిస్తూ జీవనం సాగిస్తోంది. ఆమె భర్త ఎలక్ట్రికల్ పనుల కోసం తిరుపతి వెళ్లాడు. ఇతర ప్రాంతానికి వెళ్లిన ప్రతిసారి ఆరు నెలల తర్వాత వస్తుంటాడు. ఈ క్రమంలో తిరుపతమ్మకు అదే గ్రామానికి చెందిన సతీష్ తో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో సతీష్ ఫ్రెండ్ కూడా వచ్చి కోరిక తీర్చమని వేధించడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగి హత్యకు దారితీసింది. పోలీసులు 24గంటల్లోనే నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకొని రిమాండ్ కు తరలించారు.
ఇదిలా ఉంటే ఈ ఘటన రాజకీయ రంగుపులుముకుంది. బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు రువ్వడం కలకలం రేపింది. చట్టాలంటే గౌరవం, భయం లేని పరిస్థితులు ఏపీలో ఉన్నాయని లోకేష్ మండిపడ్డారు. జగన్ వెయ్యి రోజుల పాలనలో 800మందికి పైగా మహిళలపై దాడులు జరిగాయని ఆరోపించారు. గన్ కంటే ముందు వస్తానన్న జగన్ ఎక్కడా ? అని లోకేష్ ప్రశ్నించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.