మూఢనమ్మకాలు మనిషిని ఎంతపనైనా చేయిస్తాయి. జ్వరం తగ్గాలన్నా.. ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోవాలన్నా కష్టానికి బదులు షార్ట్ కట్స్ వెతికేవాళ్లే ఉంటారు. ముఖ్యంగా మన దేశంలో ఇలాంటి నమ్మకాలకు కొదవే లేదు. అలాంటి వారిని ఈజీగా ట్రాప్ చేసి లక్షలు, కోట్లు దోచేస్తుంటారు కొందరు కేటుగాళ్లు. అలా టోకరా వేయబోతూ పోలీసులకు అడ్డంగా చిక్కింది ఓ ముఠా. నక్క తోక తొక్కితే లక్ కలిసొస్తుందన్న సామెత మాదిరిగానే.. రెండు తలల పాము ఇంట్లో ఉంటే అదృష్ట లక్ష్మి ఇంట్లోనే తిష్టవేస్తుందనే ప్రచారం చాన్నాళ్లుగా ఉంది. వివరాల్లోకి వెళ్తే... గుంటూరు జిల్లాలో రెండు తలల పాము ఉంటే అదృష్టం కలిసొస్తుంటూ వాటిని విక్రయించే గ్యాంగ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరుదైన రెడ్ శాండ్ బో జాతికి చెందిన 3 రెండు తలల పాముల్ని పట్టుకున్న ముఠా.. వాటిని మార్కెట్లో భారీ ధరకు విక్రయించేందుకు యత్నించింది.
కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన కొండయ్య, సుగాలి, గుంటూరు జిల్లా మాచవరానికి చెందిన జిలానీ, గుండ్లపల్లికి చెందిన షేక్ నాగూర్ వలీ అత్యంత అరుదైన 3 రెండు తలల పాములను పట్టుకొచ్చారు. ఈ పాములు ఇంట్లో ఉంటే అదృష్టం కలిసొస్తుందంటూ లక్షల్లో బేరం పెట్టారు. వాటిని అమ్మేందుకు యత్నిస్తుండగా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. పాములను ముఠా ఆన్ లైన్లో అమ్మకానికి పెట్టగా.. ఫోన్లో సంప్రదించిన పోలీసులు వారిని చుట్టగుంట వద్దకు రావాలని పిలిచారు. వారు అక్కడికి చేరుకోవడంతో అదుపులోకి తీసుకున్నారు. ఈ పాములను దాదాపు రూ.50 లక్షలకు బేరం పెట్టినట్లు తెలుస్తోంది.
ఈ ముఠా వ్యవహారంపై స్పందించిన జిల్లా అటవీ శాఖ అధికారి రామచంద్రరావు.. ఇలాంటి పాములను పట్టుకోవడం నేరమని.. ఈ పాములు విషరహితమైనవి.. ఎలుకలను తింటూ జీవిస్తాయని తెలిపారు. ఈ పాముల విక్రయం, రవాణా అటవీశాఖ చట్టాల రీత్యా నేరమని... ఏడేళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశముందని హెచ్చరించారు. ఇవి రెండు తలల పాములు అనేది కేవలం అపోహమాత్రమేనని.. నిజానికి వీటి తల, తోక ఒకేలా ఉండటం వల్ల రెండు తలల పాముగా వ్యవహరిస్తారని రామచంద్రరావు స్పష్టం చేశారు.
ఇలాంటి పాములు విక్రయించే ముఠాలు గతంలోనే చాలాసార్లు పోలీసులకు పట్టుబడ్డాయి. ఈ పాములను స్మగ్లర్లు రూ.లక్షల్లో బేరంపెడుతుంటారు. వీటిని విదేశాల్లో ఔషధాల తయారీకి ఉపయోగిస్తారన్న ప్రచారం ఉంది. విదేశాల్లో ఏమోగానీ వీటిని పట్టుకోవడం మాత్రం భారత్ లో నిషేధం. ఇలాంటి వారికి వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కఠిన శిక్ష పడుతుంది. సో ఇలాంటి పాముల పట్ల మూఢనమ్మకాలను నమ్మరాదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Guntur, Snakes