GUNTUR POLICE ARRESTED BANDITS GANG WHO RAPED WOMAN IN GUNTUR DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN GNT
Guntur Rape Case: ఒంటరిగా వెళ్తున్న జంటలే వారి టార్గెట్.. కరుడుగట్టిన ముఠా అరెస్ట్.. దర్యాప్తులో సంచలన నిజాలు..
గుంటూరు రేప్ కేసులో నిందితుల అరెస్ట్
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) గుంటూరు జిల్లా (Guntur District) మేడికొండూరు మండలం పాలడుగు గ్రామంలో గతేడాది జరిగిన అత్యాచారం ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
వాళ్లు కరుడుగట్టిన రేపిస్టులు. రాత్రుళ్లు ఒంటరిగా వెళ్తున్న జంటలే వారి టార్గెట్. రోడ్డుపై అటకాయించడం భర్తపై దాడి చేసి భార్యపై అత్యాచారం చేయడం వారి నేరప్రవృత్తి. అలాగే ఒంటరిగా వెళ్తున్నవారి నుంచి అందినకాడికి దోచుకవడం వారి పని. దండుపాళ్యం బ్యాచ్ కంటే దారుణమైన ఈ గ్యాంగ్ పోలీసులకే సవాల్ విసిరింది. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) గుంటూరు జిల్లా (Guntur District) మేడికొండూరు మండలం పాలడుగు గ్రామంలో గతేడాది జరిగిన అత్యాచారం ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. భార్యభర్తలు బైక్ పై వెళ్తుండగా అటకాయించిన దుండగులు భర్తపై దాడి చేసి భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతకుముందు యడ్లపాడు మండలంలోని రెండుచోట్ల దారిదోపిడీలు జరిగాయి. ఈ మూడు ఘటనల్లో ఒకే ముఠా పాత్ర ఉందని భావించిన పోలీసులు నాలుగు నెలలుగా ముమ్మర దర్యాప్తు సాగించారు.
నాలుగు నెలలపాటు 30 మంది పోలీసులు విచారణ జరిపి మొత్తం ఆరుగురు నిందితులను కర్నూలు జిల్లా నంద్యాలలో అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. నిందితులు మొత్తం 18 కేసుల్లో ఉన్నట్లు విచారణలో అంగీకరించారు. నిందితుల నుంచి రూ.1.73లక్షల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు, కత్తులు స్వాధీనం చేసుకున్నారు.
ముందుగా రెక్కీ.. ఆ తర్వాత దాడులు
కర్నూలు జిల్లాకు చెందిన ఈ కరుడుగట్టిన ముఠా.. ముందుగా నేరం చేయాల్సిన ప్రాంతాన్ని ఎంచుకుంటారు. ఆ తర్వాత రెక్కీ చేస్తారు. జనసంచారం లేని సమయాన్ని ఎంచుకొని కాపుగాసి ఒంటరిగా వస్తున్న జంటలపై దాడి చేస్తారు. వారి దగ్గర నగదు, బంగారం దోచుకుంటారు. అడవాళ్లు ఉంటే వారిపై అత్యాచారానికి పాల్పడతారు. ఖాళీ సమయాల్లో మిర్చి పొలాల్లో కుటుంబ సభ్యులతో కలిసి కూలీ పనులకు వెళ్తుంటారు. వీరిపై గుంటూరు రూరల్ పరిధిలో ఆరు కేసులు, అర్బన్ పరిధిలో పద్దెనిమిది కేసుల్లో ఉన్నారు.
ఈ ముఠా మెయిన్ రోడ్డుపై అసలు ప్రయాణించరు. సీసీ కెమెరాలు, జనానికి దొరక్కుండా ఉండేందుకు గ్రామాల మధ్య ఉండే చిన్నచిన్న రోడ్లలోనే ప్రయాణిస్తారు. తాజా కేసులో కూడా నిందితులు సీసీ కెమెరాలకు చిక్కలేదు. ఎక్కువగా ట్రైన్లలోని జనరల్ బోగీల్లో ప్రయాణిస్తూ ఆయా ప్రాంతాలకు వెళ్తుంటారు. వలస కూలీల్లా నమ్మించి పనులు చేస్తూనే దోపిడీలకు పాల్పడుతుంటారు. కేసు దర్యాప్తులో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులను ఎస్పీ విశాల్ గున్నీ అభినందించారు. ప్రజలు ఇలాంటి బందిపోటు ముఠాల పట్ల అప్రమత్తంగా ఉండాలని.. రాత్రిళ్లు ప్రయాణించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.