గత కొన్ని రోజులుగా గుంటూరు జిల్లాల్లో ఉన్న దేవాలయాల్లో హుండీలు చోరీకి గురవుతున్నాయి. ఈ కేసు విషయంలో స్థానిక పోలీసులు నిందితులను పట్టుకోవడం సవాల్‌గా మారింది. నిందితులు దేవాలయాల్లో హుండీలనే వాళ్లు టార్గెట్ చేసినట్టు పోలీసులు అనుమానించారు. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు నిఘా వేసి పోలీసులు దొంగలను పట్టుకున్నారు.
గుంటూరు నగరానికి చెందిన ముగ్గురు ముఠా సభ్యులను సౌత్ డివిజన్ పోలీసులు అరెస్టు చేశారు. గత కొంతకాలంగా నగరం చుట్టు పక్కల గుళ్లలో హుండిల అపహరణ కేసులు ఎక్కువయ్యాయి. దీనిపై ఎస్పీ ఆరిఫ్ హాఫీజ్ దృష్టి సారించారు. ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ముఠాను పట్టుకోవాలని ఆదేశించారు.
ఎస్పీ ఆదేశాలతో నల్లపాడు పోలీసులు రంగంలోకి దిగారు. సిసి కెమెరా విజువల్స్ (CC camera visuals) పరిశీలించారు. ఆటోలో వస్తున్న ముఠానే దొంగతనాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. దీంతో పోలీసులు పక్కాగా ప్లాన్ చేసి ముఠా సభ్యులను పట్టుకున్నారు.
దేవుడి సొమ్మే వాళ్ల టార్గెట్..!
పగటి సమయంలో ఆటోలో ప్రయాణిస్తూ రెక్కి చేస్తుంటారు. గుంటూరు (Guntur) నగర సమీపంలోని గ్రామాలు, కాలనీల్లోని దేవాలయాల (Temples) చుట్టూ తిరుగుతారు. పగలు మనతో పాటే మన పక్కనే భక్తుల్లా తిరుగుతూ దేవుడి గుడిలో ప్రదక్షిణ చేస్తూ రెక్కీ నిర్వహిస్తారు. తర్వాత వాళ్లకు అనువైన ఆలయాన్ని టార్గెట్‌గా పిక్స్ చేస్తారు. అందరూ నిద్ర పోయాక డ్యూటీ ఎక్కుతారు. వాళ్లు టార్గెట్ చేసిన ఆలయంలోకి గుట్టుచప్పుడు కాకుండా దూరి హుండీలను ఎత్తుకెళ్తారు.
ముగ్గురు నిందితుల్లో ఒకరు మైనర్..
అల్లరిచిల్లరగా తిరుగుతూ చెడు వ్యసనాలను బానిసలైన ముగ్గురు కుర్రాళ్లు దొంగతనాలకు అలవాటు పడ్డారు. ఈజీ మనీ కోసం దేవుడి సొమ్మునే కాజేయాలనుకున్నారు. ఆ క్రమంలో ఆలయాల్లో రాత్రుళ్లు సెక్యూరిటీ ఉండదనే విషయాన్ని గమనించి… దేవుడి హుండీలను టార్గెట్ చేస్తూ అపహరించుకు పోతున్నట్లు డిఎస్పీ జెస్సీ ప్రశాంతి (DSP Jessy Prashanthi) చెప్పారు
కుదిరితే హుండీలో డబ్బు..లేకపోతే ఏకంగా హుండీనే..!
కుదిరితే ఆలయంలోనే హుండి ఓపెన్ చేస్తారని… కుదరకపోతే హుండీనే ఎత్తుకెళ్తారని తెలిపారు. ఆటోలో కొద్ది దూరం తీసుకెళ్ళిన తర్వాత హుండీని పగులగొట్టి డబ్బులు తీసుకుంటున్నట్లు ఆమె చెప్పారు. పోలీసులు వారిపై ప్రత్యేక నిఘా పెట్టి అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి పద్దెనిమిది వేల రూపాయల నగదు, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితుల్లో ఒకరు మైనర్ ఉన్నట్లు డీఎస్పీ ప్రశాంతి తెలిపారు.
Published by:V. Parameshawara Chary
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.