ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై (AP CM YS Jagan Mohan Reddy) టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) మండిపడ్డారు. అస్తవ్యస్తమైన నిర్ణయాలు, విధ్వంసంతోకూడి అరాచక పాలన, రివర్స్ అడ్మినిస్ట్రేషన్, మాట తప్పుడు, మడమతిప్పుడుతో జగన్ ఆధునికకాలం తుగ్లక్ 3.0 వెర్షన్ గా పేరుగాంచారని ఎద్దేవా చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించిన లోకేష్.., ఆకాశంలో ఉన్న జగన్ గారు భూమ్మీదకి దిగివచ్చినప్పుడే ప్రజలకు కష్టాలు తెలుస్తాయన్నారు. రెండున్నరేళ్లలో తాడేపల్లి కొంప నుండి బయటకు అడుగు పెట్టలేదని ఎందుకని ప్రశ్నించారు. సొంత జిల్లా ప్రజలు కష్టాల్లో ఉంటే పట్టించుకోని ముఖ్యమంత్రిని మొట్టమొదటిసారి చూస్తున్నామన్నారు. వరదలతో రాయలసీమ, నెల్లూరు జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే జగన్ రెడ్డి గాల్లో ఒక రౌండ్ కొట్టొచ్చి ఇంట్లో పడుకున్నారని ఎద్దేవ చేశారు.
హుద్ హుద్, తిత్లీ తుఫాన్లు వచ్చినప్పుడు సీఎంగా చంద్రబాబు ప్రభావితప్రాంతాలకు వెళ్లి సాధారణ పరిస్థితులు నెలకొనే వరకూ అక్కడే ఉండి వచ్చారని లోకేష్ గుర్తు చేశారు. తిత్లీ వచ్చినప్పుడు 21 రోజుల్లో వెయ్యి కోట్ల నష్ట పరిహారాన్ని రైతులకు అందజేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదన్నారు. ఇప్పుడు కనీసం నష్ట పరిహారం అంచనా వేసే నాధుడు కూడా ముంపుప్రాంతాలకు రాలేదంటే, ప్రజలపట్ల ఎంత నిర్లక్ష్యంగా వుంటున్నారో అర్థమవుతోందన్నారు. పంటలు నష్టపోయిన రైతాంగానికి తక్షణమే పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. జగన్ రెడ్డి అధికారంలోకొచ్చిన నుంచీ ఇసుక దగ్గర నుండి నిరుద్యోగం వరకూ ప్రజలు ఎదుర్కోని సమస్యలేదన్నారు.
రాష్ట్రానికి ఒక్క కొత్త పరిశ్రమా రాలేదని, తమిళనాడు లో ఇండస్ట్రియల్ సమ్మిట్ పెడితే రూ.25 వేల కోట్ల పెట్టుబడులు ఆ రాష్ట్రానికి వెళ్లాయంటే పాలన ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు , విద్యుత్ ఛార్జీలు, ఇంటి పన్ను, చెత్త పన్ను ,ఆర్టీసీ చార్జీలు, నిత్యావసర సరుకుల ధరలు చాలవన్నట్టు ఇప్పుడు మళ్లీ వాహన రిజిస్ట్రేషన్ మీద పన్నుపెంచి ప్రజలపై రోజురోజుకీ భారాలని పెంచుకుంటూ పోతున్నారని ఆరోపించారు.
ఎన్నికలకి ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని సీఎం జగన్ సక్రమంగా అమలు చెయ్యలేదన్నారు. సీఎంకు ఏ సబ్జెక్ట్ మీదా అవగాహన లేదని, మూడురాజధానులు-సీఆర్డీఏ రద్దు-శాసనమండలిని రద్దు చేసి తిరిగి అవే చట్టాలను మళ్లీ రద్దు చేయడం తుగ్లక్ చర్యలు కాకపోతే ఇంకేంటని ప్రశ్నించారు. దక్షిణాఫ్రికా లెక్క అన్నారని, మూడు రాజధానులతో అభివృద్ధి అన్నారని, తీరా చట్టాలనే వెనక్కి తీసుకోవడం జగన్ ఇచ్చిన మాట తప్పడం, మడమ తిప్పడానికి బ్రాండ్ అంబాసిడర్ అని స్పష్టమైందన్నారు. ముఖ్యమంత్రి నివాసం ఉండే నియోజకవర్గమైనా మంగళగిరి అభివృద్ధికి దూరం కావడం విచారకరమన్నారు. సీఎం ఇచ్చే ప్రకటనల అభివృద్ధి అంతా పేపర్లకే పరిమితమైందన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Mangalagiri, Nara Lokesh, TDP