Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati
సీఎం జగన్ (AP CM YS Jagan) పై టీడీపీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) మండిపడ్డారు. అబద్ధానికి ప్యాంటు షర్టు వేస్తే జగన్ లా ఉంటారని ఎద్దేవా చేశారు. మంగళగిరి మాజీమున్సిపల్ ఛైర్మన్ కాండ్రు శ్రీనివాసరావుతో పాటు పలువురు నేతలను పార్టీలోకి ఆహ్వానించిన లోకేష్.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ వారసునిగా ఈ రోజు తెలుగుదేశం పార్టీలో భాగస్వామిని కావడం తన అదృష్టమన్నారు. తాత ఎన్టీఆర్ అంత మంచి పేరు తెచ్చుకోలేకపోవచ్చు కానీ ఆయనకు చెడ్డపేరు మాత్ర తీసుకురానన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత శ్రీనివాసరావులాగే వైఎస్ అభిమానులు అందరినీ వైసీపీ నుంచి తరిమేస్తున్నారని ఆరోపించారు. తెలుగుదేశంపార్టీలో కార్యకర్తలు, నాయకులను గౌరవంగా పలకరిస్తామని, ఒక కార్యకర్తకు ఇబ్బంది వస్తే పార్టీ మొత్తం అండగా నిలిచే పార్టీ టిడిపి అని పేర్కొన్నారు.
సీఎం జగన్ నోరు తెరిస్తే అబద్దాలు ఆడుతున్నాడు కాబట్టి అబద్దాల రెడ్డి అని జగన్ కి పేరు పెట్టానన్నారు. జగన్ చెప్పిన మద్యపాన నిషేధం అబద్దం, రూ.3 వేల పెన్షన్ అబద్దం, జాబ్ క్యాలెండర్ అబద్దం, ప్రత్యేక హోదా అబద్దం, మూడు ముక్కల రాజధాని అబద్దం...ఇలా జగన్ చెప్పేవన్నీ అబద్దాలేనన్నారు. జగన్ సంక్షేమం పథకాలు పెంచుతూ పోతానని హామీ ఇచ్చి... కరెంట్, ఆర్టీసి చార్జీలు, ఇంటి, నీటి, చెత్త పన్నులు, పెట్రోల్ డీజిల్, నిత్యావసరాల ధరలు పెంచాడని ఆరోపించారు. చివరికి మద్యం ధరలు కూడా పెంచేశాడని ఎద్దేవ చేశారు.
మంగళగిరి ఎమ్మెల్యే నటన, వేషాలు చూసి కరకట్ట కమల్ హాసన్ అని పేరుపెట్టామన్నారు. ఆర్.ఆర్.ఆర్ సినిమా ఆస్కార్ అవార్డు కోసం వెళ్లింది కానీ మన కరకట్ట కమల్ హాసన్ ను పంపితే ఖచ్చితంగా ఆస్కార్ వస్తుందని ఎమ్మెల్యే ఆర్కే అతి వేషాల గురించి వివరించారు. బర్రెలు, గొర్రెలతో ఫోటోలు దిగే ఎమ్మెల్యే నియోజకవర్గంలో పెన్షన్ లు తొలగించిన 5 వేల మందితో ఫోటోలు దిగాలని సూచించారు. మంగళగిరి నియోజకవర్గానికి వివిధ బడ్జెట్లలో సీఎం జగన్ రెడ్డి ఇస్తున్నట్టు ప్రకటించిన రూ.2600 కోట్లలో ఒక్క రూపాయి అయినా ఖర్చు చేశారా అని ఎమ్మెల్యేని నిలదీశారు. నేను వస్తే ఇళ్లు పడగొడతానని ప్రచారంచేసిన కరకట్ట కమల్ ప్రతీ ఊరిలో ఇళ్లు ఎందుకు కూలగొడుతున్నారో సమాధానం చెప్పాలన్నారు.
నియోజవర్గంలో అక్రమంగా గ్రావెల్ తవ్వుతూ ఎన్ని కోట్లు కొల్లగొట్టారో ఎమ్మెల్యే వెల్లడించాలన్నారు. ఓడిపోయినా నియోజకవర్గాన్ని వదిలిపెట్టలేదని, 13 సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నానని చెప్పారు. అన్నా క్యాంటీన్లతో ఆకలి తీర్చానని, ఎన్టీఆర్ సంజీవని పేరుతో ప్రజలకు వైద్యం అందిస్తున్నామని, స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించామని, యువ కార్యక్రమంలో భాగంగా యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇప్పిస్తున్నామని తెలిపారు. తాను ఎక్కడ ఉన్నా నా మనసు మంగళగిరిపైనే ఉంటుందని, ఎవరికి ఏ సాయం కావాలన్నా వారికి అందుతుందని నారా లోకేష్ భరోసా ఇచ్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Guntur, Local News, Nara Lokesh