Gangadhar, News18, Guntur
పల్నాడు జిల్లా (Palnadu District) చిలకలూరిపేటలో 104 వాహనాలను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని ప్రారంభించారు. చిలకలూరిపేట ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో 104 వాహనాలని కొబ్బరికాయలు కొట్టి జండా ఊపి పల్నాడు జిల్లా కలెక్టర్ తోటి శివశంకర్ .డిఎంహెచ్వో శోభారాణి తో కలిసిప్రారంభించారు. సీఎం జగన్ ఆరోగ్యశ్రీ ద్వారా ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని.. ఎన్నో ఏరియా ఆసుపత్రులు వైద్య సిబ్బందిని 108, 104 వాహనాలని ప్రజలకు అందుబాటులో విధంగా ప్రారంభించామన్నారు.
కొనుగోలు రాజకీయాలు బాబుకు కొత్తేం కాదన్నారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన వైనం అందరికీ తెలుసని రజని విమర్శించారు. ఎమ్మెల్యేల కొనుగోలు బాబుకు వెన్నతో పెట్టిన విద్యని దుయ్యబట్టారు. క్రాస్ ఓటింగ్ ఎమ్మెల్యేలు ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు.ఉండవల్లి శ్రీదేవికి జగనన్న ఎంతో అండగా ఉన్నారని..ఆమె విమర్శలు అర్థం లేనివని విడదల రజిని అన్నారు. తమ పార్టీ గుర్తుతో, జగనన్న ఇచ్చిన అమూల్యమైన అవకాశంతో ఉండవల్లి శ్రీదేవి ఎమ్మెల్యేగా గెలిచారని తెలిపారు. ఆమెతోపాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారనే ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చాకే వారిని పార్టీ నుంచి బహిష్కరించారని చెప్పారు.
ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తాజాగా పార్టీ గురించి చేస్తున్న వ్యాఖ్యలు సహేతుకం కాదన్నారు. ఆమె కరోనాతో తీవ్ర ఆరోగ్య సమస్యను ఎదుర్కొన్న సమయంలో ముఖ్యమంత్రి జగనన్న స్వయంగా ఆమె ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించారని గుర్తు చేశారు. ఆ సమయంలో సీఎంవో అధికారులు, ముఖ్యమంత్రి వైద్యులతో నిరంతరం పర్యవేక్షించారని, జగనన్న చొరవ వల్ల ఆమె క్షేమంగా ఇంటికి రాగలిగారని చెప్పారు. అలాంటి పార్టీపై ఇప్పుడు నిందలు వేసేలా మాట్లాడటం ఎంతరకు సబబో ఆమె ఆత్మ విమర్శ చేసుకోవాలని హితవు పలికారు.
బాబు డ్రామాలు అందరికీ తెలుసు
గతంలో తమ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మల్యేలను చంద్రబాబానాయుడు కొనుగోలు చేశారని, వారిలో కొందరికి మంత్రి పదవులు కూడా ఇచ్చారని మంత్రి గుర్తు చేశారు. గతంలో సొంత మామ ఎన్టీ రామారావును కూడా వెన్నుపోటు పొడిచారని తెలిపారు. అప్పట్లో ఎమ్మెల్యేలంతా తన వైపు వచ్చేలా బేరసారాలు ఆడి ఎన్టీ ఆర్ ప్రభుత్వాన్ని కూలదోశారని మండిపడ్డారు. తెలంగాణలో కూడా ఓటుకు నోటు కేసు ఆయన కొనుగోలు స్వభావానికి నిదర్శనం అని దుయ్యబట్టారు. ఇలాంటి చరిత్ర ఉన్న చంద్రబాబు తాజా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేల కొనుగోలుకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదంతా చంద్రబాబు డ్రామా అని చెప్పారు. గతంలోనూ బాబు ఇలాంటి నాటకాలే ఆడారని, అయినా సరే ప్రజల ముందు ఆయన పప్పులు ఉడకలేదని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, జగనన్నకు పట్టం కట్టారని గుర్తుచేశారు. ఎంతో గొప్ప సంక్షేమ పాలన అందిస్తున్న జగనన్నకు ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రజలందరి మద్దతు ఉందని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు జగనన్నను పెద్ద ఎత్తున దీవించబోతున్నారని తెలిపారు. సరైన సమయంలో చంద్రబాబునాయుడికి మరోసారి ప్రజలే బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Guntur, Local News