GUNTUR MAN CREATED DEATH CERTIFICATE FOR ALIVE PERSON AND TRANSFERRED HER PROPERTIES ILLEGALLY IN GUNTUR DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN GNT
Land Scam: బ్రతికున్న వృద్ధురాలికి డెత్ సర్టిఫికెట్.. రూ.20కోట్ల ఆస్తి హాంఫట్.. స్కెచ్ మాములుగా లేదుగా..
అధికారులకు ఫిర్యాదు చేస్తున్న వెంకాయమ్మ
ఈ రోజుల్లో కుటుంబ బంధాలకంటే ఆస్తులు, డబ్బులకే ఎక్కువ ప్రాధాన్యనిస్తున్నారు. ఆస్తికోసం హత్యలు, దాడులు, కొట్లాటలు జరిగిన సందర్భాలు చాలానే ఉన్నాయి.
ఈ రోజుల్లో కుటుంబ బంధాలకంటే ఆస్తులు, డబ్బులకే ఎక్కువ ప్రాధాన్యనిస్తున్నారు. ఆస్తికోసం హత్యలు, దాడులు, కొట్లాటలు జరిగిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలాగే ఆస్తిరాయాలంటూ వృద్ధులను వేధించేవారూ ఉన్నారు. తల్లిదండ్రులను హింసించి ఆస్తులు రాయించుకునే పిల్లలున్నారు. కానీ ఓ వ్యక్తి మాత్రం ఇవేమీ లేకుండా... దెబ్బపడకుండా.. మాట మాట్లాడకుండా చాలా సైలెంట్ గా పక్కా స్కెచ్ తో ఆస్తిని కాజేశాడు. అతడు ఆస్తిని దోచేసిన విధానానికి అధికారులే షాక్ తిన్నారు. అసలు ఓనర్లకు ప్రాణం పోయినంత పనైంది. తమకు తెలియకుండానే ఆస్తంతా రిజిస్టర్ చేయించుకున్నట్లు తెలుసుకొని అధికారులను ఆశ్రయించారు. ఈ వ్యవహారంలో మోసం చేసిన వ్యక్తితో పాటు అధికారులు, సిబ్బంది పాత్ర కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వారి సహకారం లేకుండా ఇంతటి స్కామ్ జరిగే అవకాశమే లేదు.
వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని గుంటూరు జిల్లా (Guntur District) నరసరావుపేట మండలం ఇసప్పాలెం గ్రామానికి చెందిన బండ్లమూడి వెంకాయమ్మ అనే వృద్ధురాలిపేరిట తొమ్మిదెకరాల భూమి ఉంది. బహిరంగ మార్కెట్లో ఆ భూమిధర రూ.20కోట్లపైనే ఉందట. ప్రస్తుతం ఆమె వృద్ధాప్యంలో ఉన్నారు. ఐతే ఆమెకు మనవడయ్యే కోటయ్య అనే వ్యక్తి ఆస్తిపై కన్నేశాడు.
బండ్లమూడి వెంకాయమ్మ బ్రతికుండగానే ఆమె చనిపోయినట్లు డెత్ సర్టిఫికెట్ సృష్టించాడు. ఆ తర్వాత ఫ్యామిలీ సర్టిఫిక్ పొందాడు. వెంకాయమ్మ ఆస్తికి తానే వారసుడినని నమ్మించి ఆస్తంతా తనపేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు ఆమె ఆధికారలకు ఫిర్యాదు చేశారు. వెంకాయమ్మకు సంతానం లేకపోవడంతో మిగిలిన బంధువులందరికీ ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందనే కోటయ్య ఇలా చేసినట్లు తెలుస్తోంది.
తాను బ్రతికుండగానే డెత్ సర్టిఫికెట్ సృష్టించి ఆస్తిని కాజేసి న కోటయ్యపై చర్యలు తీసుకొని, తన ఆస్తి తనకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని వెంకాయమ్మ నరసరావుపేట తహసీల్దార్ కు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంలో ఇసప్పాలెంలో పంచాయితీ సెక్రటరీగా పనిచేసిన శ్రీనివాసరావు పాత్ర ఉందని, అతనిపైనా చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ స్కామ్ లో తహసీల్దార్ కార్యాలయ అధికారులు, స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అధికారుల పాత్ర ఉందని వారికి భారీగా ముడుపులు అందినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అసలు బ్రతికున్న వృద్ధురాలికి పరిశీలన లేకుండానే డెత్ సర్టిఫికెట్ జారీ చేసిందెవరు..?.. విచారణ లేకుండానే ఆస్తి రిజిస్ట్రేషన్ చేసిందెవరనేది చర్చనీయాంశంగా మారింది. దాదాపు రూ.20కోట్ల విలువైన ఆస్తిని కాజేసిన కోటయ్య ప్రస్తుతం అందుబాటులో లేరు.
గతంలో గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోనూ ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది. రాజధాని రావడంతో భూముల రేట్లు పెరగడంతో ఓ వృద్ధురాలు బ్రతికుండదానే డెత్ సర్టిఫికెట్ సృష్టించి ఆమె పేరిట ఉన్న ఆస్తులను ఆమె కుటుంబ సభ్యులు విక్రయించారు. తీరా తన పొలం అమ్మేశారని తెలియడంతో సదరు వృద్ధురాలు అధికారులను ఆశ్రయించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.