ఈ మధ్య ఏంటో.. చిన్న చిన్న కారణాలకే పెద్ద పెద్ద గొడవలు అయిపోతున్నాయి. మనోభావాలు దెబ్బతిని ఊరికే మనస్థాపానికి కూడా గురవుతుంటారు. కాస్తంత సహనంతో ఉంటే సర్దుకునే సమస్యలకు రక్తపాతాలు జరుగుతున్నాయి. ఇక్కడ చూడండీ పునుగుల్లోకి చట్నీ చాల్లేదని గొంతు కోశారంటే ఎవరైనా నమ్మగలరా..? కానీ నమ్మాల్సిందే..! చట్నీ వేయని యజమానినే కాదు అడ్డొచ్చిన ఆయన కొడుకును కూడా చావ బాదారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ప్రకాశం జిల్లా (Prakasham District) లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బాపట్ల జిల్లా (Bapatla District) ఇంకొల్లు మండలం పెదనక్కలపాలేనికి చెందిన చిలిపూరి రంగారావు గ్రోత్‌సెంటర్ వద్ద నేషనల్ హైవే పై టిఫిన్ సెంటర్ పెట్టుకుని జీవిస్తున్నారు. రోజూ మాదిరిగానే ఆదివారం కూడా షాప్ ఓపెన్ చేసి వ్యాపారం చేస్తున్నాడు.
అదే సమయంలో గ్రోత్ సెంటర్‌కు చెందిన కొండారెడ్డి అనే వ్యక్తి అక్కడకు వచ్చి ప్లేట్ పునుగులు కావాలని అడిగాడు. రంగారావు పునుగులను కొండారెడ్డికి ఇచ్చాడు. అయితే, చట్నీ చాల్లేదని.. పునుగులు కూడా బాగాలేవని రంగారావుతో కొండారెడ్డి గొడవ పడ్డాడు.
గొడవ తర్వాత అక్కడ నుంచి వెళ్లిన కొండారెడ్డి కాసేపటి తర్వాత తన బావ అయిన కాశిరెడ్డిని వెంటబెట్టుకుని వచ్చి నానా వీరంగం సృష్టించాడు. వాళ్లిద్దరూ కలిసి రంగారావును చితకబాదారు. ఆ తర్వాత పక్కనే ఉన్న కూరగాయల కత్తి తీసుకుని రంగారావు గొంతు కోశారు. ఆపేందుకు ప్రయత్నించిన రంగారావు కొడుకు మనోహర్‌పైన కూడా తీవ్రంగా దాడి చేసి అక్కడ నుంచి పరారయ్యారు. ఈ సంఘటనతో రోడ్డుపై ఉన్న వారు, టిఫిన్ సెంటర్‌లో ఉన్నవారు అక్కడ నుంచి పరుగులు పెట్టారు. సమాచారం అందుకున్న హైవే పోలీసులు అక్కడకు చేరుకుని.. క్షతగాత్రులను ఒంగోలు రిమ్స్‌కు తరలించారు.
అయితే రంగారావుపై దాడి చేసిన కాశిరెడ్డి అనే వ్యక్తికి గ్రోత్ సెంటర్‌లోనే టిఫిన్ దుకాణం ఉండటం విశేషం. వీరిద్దరూ విడివిడిగా హోటళ్లు నడపడం.. వీరిద్దరి మధ్య పోటీ ఉండటంతో కాశిరెడ్డి బావమరిది కొండారెడ్డి టిఫిన్ చేసే సాకుతోనే రంగారావు టిఫిన్ సెంటర్‌కు వెళ్లి గొడవ చేశాడని స్థానికులు చెబుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన మద్దిపాడు పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. గతంలో గుంటూరు జిల్లాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ యాచకుడికి ఓ వ్యక్తి ఇడ్లీ పెట్టిస్తే తినలేదన్న కోపంతో కొంతమంది అతడ్ని చావబాదారు. దెబ్బలకు తాళలేక అతడు మృతి చెందడంతో ఆలస్యంగా విషయం వెలుగులోకి వచ్చింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Prakasham dist