ఈ రోజుల్లో ఆస్తికోసం ఎంతకైనా తెగించే వారి సంఖ్య పెరిగిపోతోంది. డబ్బు కోసం అయిన వారినే మట్టుబెడుతున్నారు బంధువులు. ఒక్కసారిగా కోటీశ్వరులవుదామనో.. జల్సాలకు అలవాటుపడో గీతదాటి వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ఎదుటివారితో ఉన్న బంధుత్వం, అభిమానం, అప్యాయతలు ఏమీ గుర్తుకురావడం లేదు. అలా తనను పెంచి పెద్దచేసిన మేనత్త ఆస్తిపై కన్నేసిన ఓ యువకుడు ఆమెను చంపేందుకు కుట్రపన్నాడు. కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేశాడు. సరైన సమయంలో పోలీసులు ఎంట్రీ ఇచ్చి ఆమెను సినిమా స్టైల్లో రక్షించారు. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ప్రకాశం జిల్లా (Prakasham District) సంతమాగలూరు మండల కేంద్రానికి చెందిన అట్లా బాలిరెడ్డి ఫ్యాక్షన్ తగాదాల్లో హత్యకు గురయ్యాడు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. తండ్రి చనిపోవడంతో మేనత్త మందాల బాలేశ్వరి చినవెంకటరెడ్డిని పెంచి పెద్ద చేసింది. అతడి మంచి చెడలు ఆమే చూసుకుంది. కన్నబిడ్డలాగా సాకింది.
ఐతే అమ్మ తర్వాత అమ్మగా భావించాల్సిన మేనత్తను చినవెంకటరెడ్డి గౌరవించడం మానేశాడు. ఆమె ఆస్తిపై కన్నేసి ఎలాగైనా కొట్టేయాలని భావించాడు. ఈ క్రమంలో గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం వేమవరంలో ఉంటున్న మేనత్త స్వగృహానికి వెళ్లాడు. తనతో పాటు రావాలని లేదంటే రాడ్డుతో కొట్టి చంపేస్తానని బెదిరించి ఆమెను సంతమాగలూరు తీసుకెళ్లాడు.
అక్కడి తీసుకెళ్లిన తర్వాత ఆస్తిని తన పేరుమీద రాయాలని బెదిరించాడు. బుధవారం మధ్యాహ్నం రెండుగంటల సమయంలో ఆమెను ఇంట్లో బంధించి ఇనుప గ్రిల్స్, డోర్లకు తాళాలు వేశాడు. తాను చెప్పిన మాట వినకుంటే గ్యాస్ సిలిండర్ పేల్చి చంపేస్తానని బెదిరించాడు. ఐతే ఈ విషయం ఎక్సైజ్ ఎస్సైగా పనిచేస్తున్న బాలేశ్వరి కుమార్తెకు తెలిసింది. వెంటనే ఆమె స్థానిక పోలీసులకు సమాచారం అందించింది.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇంటివద్దకు చేరుకొని అతడితో చర్చలు జరిపారు. బాలేశ్వరిని వదిలేయాలని కోరారు. దాదాపు గంటన్నరపాటు చర్చించినా అతడు వినకపోవడంతో వెంకటరెడ్డిని మాటల్లో పెట్టిన పోలీసులు చాకచక్యంగా ఇంట్లోకి ప్రవేశించారు. ఐతే నిందితుడు వారిపై దాడి చేసేందుకు యత్నించాడు. పోలీసులు అతడ్ని అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు.
ఇటీవల గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో కుటుంబ ఆస్తుల పంపకంలో వివాదం నేపథ్యంలో గుంటూరుకు చెందిన శ్రీనివాస చక్రవర్తి అనే వ్యక్తి.. వరుసకు పిన్ని అయిన కోనూరు పద్మావతి, ఆమె కుమార్తె ప్రత్యూషను హత్య చేశాడు. ఆస్తి పంపకానికి పద్మావతితో పాటు ఆమె కుమార్తె ప్రత్యూష, కుమారుడు లక్ష్మినారాయణ అడ్డుగా ఉన్నారని భావించిన చక్రవర్తి.. గత నెల 28న సత్తెనపల్లిలోని పద్మావతి ఇంటికి వెళ్లి.. ఆమెతో పాటు ప్రత్యూషను కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈనెల 31న పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు. కోర్టులో ప్రవేశపెట్టిన అనంతరం రిమాండుకు తరలించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Crime news, Guntur, Kidnap, Murder attempt, Prakasham dist