Anna Raghu, News18, Amaravati
ప్రేమ (Love) ఎంత మధురం.. ప్రియురాలు అంత కఠినం అంటూ అభినందన సినిమాలో భగ్నప్రేమికుడైన హీరో పాడతాడు. చాలా లవ్ స్టోరీలు ఇలానే సాగుతాయి. కొన్ని మాత్రమే సక్సెస్ అవుతాయి. ప్రేమించుకున్నవాళ్లు అంత ఈజీగా విడిపోరు. కొందరు పెద్దలు చెప్పిన మాటలకు తలూపి ప్రేమను వదులుకుంటారు. కానీ మరికొందరు మాత్రం ప్రేమలో ఓడిపోలేక ప్రాణాలు వదులుకుంటున్నారు. యుక్త వయసులో ఏర్పడిన పరిచయం ఓ జంటను ప్రేమ వరకు తీసుకెళ్లింది. ఐతే అభినందన సినిమాలో మాదిరిగా అమ్మాయి అక్క చనిపోవడంతో ఆమె పిల్లలను చూసుకునేందుకు హీరోయిన్ ను బావకు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటారు. అనేక మలుపుల తర్వాత సినిమాలో ప్రేమికులు గెలుస్తారు. కానీ అలాంటి రియల్ స్టోరీలో ప్రేమికులు ప్రాణాలు కోల్పోయారు.
వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణ (Telangana) రాష్ట్రంలోని నల్గొండ జిల్లా పీఏపల్లి మండలం పెద్దగుమ్మడం గ్రామ పంచాయతీ పరిధిలోని సర్లేంగం తండాకు చెందిన రామావత్ లింగా, కైక దంపతులకు ఇద్దరు కుమార్తెలు పెద్ద కుమార్తె అనితను ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని పల్నాడు జిల్లా మాచర్ల మండలం రేగులవారానికి చెందిన బాబురావు కి ఇచ్చి వివాహం జరిపించారు. చిన్న కుమార్తె నందిని తన అక్క బావల వద్దకు వస్తున్న తరుణంలో బావ తమ్ముడు బాలకృష్ణ ప్రేమలో పడింది వీరి ప్రేమ వ్యవహారం పెద్దలకు తెలియకుండా కొనసాగిస్తున్నారు.
ఇంతలో బాబురావు భార్య, నందిని అక్క అనిత అనారోగ్యంతో మృతి చెందింది. అప్పటికే అనితకు ఇద్దరు కుమార్తెలు ఉండటంతో వారి బాగోగులు చూడటానికి నందినిని అక్క ఇంట్లో ఉంచారు. తల్లిలేని పిల్లలకు తల్లిని ఇవ్వాలన్న ఉద్దేశంతో నందినిని ఆమె బావకే ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించారు. ఐతే అప్పటికే బాలకృష్ణతో పీకల్లోతు ప్రేమలో ఉన్న నందిని అందుకు ఒప్పుకోలేదు. తమ పెళ్లికి పెద్దలు అంగీకరించరనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు.
ఈ క్రమంలో మార్చి 21 ఇద్దరూ సాగర్ ఎడమ కాలువలో దూకి ఆత్మహత్యాయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో బాలకృష్ణ మృతి చెందగా.. స్థానికులు నందినిని రక్షించారు. అప్పటి నుంచి ప్రియుడిలేని ఎడబాటును తట్టుకోలేకపోతున్న నందిని.. వారం క్రితం పురుగుల మందు తాగి మరోసారి ఆత్మహత్యకు యత్నించింది. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. పెళ్లికావాల్సిన వారు ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడంతో ఇరు కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Guntur, Lovers