Guntur: కూతురిని ప్రేమిస్తున్న కుర్రాడికి ఫోన్ చేసి.. ఊరి చివర పొలాల్లోకి రప్పించి మరీ దారుణం.. కాళ్లు, చేతులు నరికేసి..

ప్రతీకాత్మక చిత్రం

ఓ యువకుడు అదే గ్రామానికి చెందిన ఓ ఇంటర్మీడియట్ యువతితో కొన్నాళ్లుగా ప్రేమాయణం నడుపుతున్నాడు. ఈ విషయం కాస్తా యువతి ఇంట్లో తెలిసింది. దీంతో తమ కుమార్తెకు దూరంగా ఉండాలంటూ యువతి కుటుంబ సభ్యులు మందలించినా వినకపోవడంతో..

  • Share this:
    ఇంటర్మీడియట్ చదువుతున్న తమ కుమార్తెను అదే గ్రామానికి చెందిన ఓ కుర్రాడు ప్రేమిస్తున్నాడని ఆ కుటుంబ సభ్యులకు తెలిసింది. ఆ కుర్రాడికి ఎంత చెప్పినా వినకపోవడంతో పెద్దమనుషుల మధ్య పంచాయితీ పెట్టించారు. పంచాయితీలో ఇచ్చిన తీర్పు మేరకు ఆ కుర్రాడు ఆ ఊరు వదిలి వేరే గ్రామంలో బంధువుల ఇంట్లో ఉంటున్నాడు. ఊరినయితే వదిలేసి వెళ్లిపోయాడు కానీ, తమ కుమార్తెతో బంధాన్ని మాత్రం తెంచుకోలేదని ఆ కుటుంబ సభ్యులకు అర్థమయింది. కూతురితో ఫోన్లో తరచూ మాట్లాడుతున్నాడని వారికి తెలిసింది. దీంతో మాట్లాడుకుందామని నమ్మించి ఊరి చివర పొలాల్లోకి రప్పించారు. ఆ తర్వాత అక్కడే కాళ్లు చేతులు నరికేసి చంపేశారు. గుంటూరు జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    గుంటూరు జిల్లా పెదకాకాని మండలం కొప్పురావూరు గ్రామానికి చెందిన వెంకటేష్ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన ఓ ఇంటర్మీడియట్ యువతిని ప్రేమిస్తున్నాడు. కొన్నాళ్లుగా వారిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తోంది. ఈ విషయం కాస్తా యువతి ఇంట్లో తెలిసింది. దీంతో తమ కుమార్తెకు దూరంగా ఉండాలంటూ యువతి కుటుంబ సభ్యులు వెంకటేష్ ను మందలించారు. అయినప్పటికీ వినకపోవడంతో ఊళ్లో పంచాయితీ పెట్టించారు. పంచాయితీ తీర్పు ప్రకారం వెంకటేష్ పక్క ఊళ్లో బంధువుల ఇంట్లో ఉంటున్నాడు. అమ్మాయితో మాట్లాడొద్దని కూడా చెప్పారు. అయితే ఊరిని అయితే వదిలేసి వెళ్లిన వెంకటేష్, తన ప్రేయసితో మాట్లాడకుండా మాత్రం ఉండలేకపోయాడు. రోజూ రాత్రిళ్లు ఆ యువతితో ఫోన్లో మాట్లాడేవాడు. కొద్ది రోజుల్లోనే ఈ విషయం యువతి తల్లిదండ్రులకు తెలిసింది.

    దీంతో వెంకటేష్ కు బాగా సన్నిహితంగా ఉండే వాళ్లతో మాట్లాడారు. వెంకటేష్ తో మాట్లాడాలని నమ్మబలికారు. దీంతో వాళ్లు వెంకటేష్ కు ఫోన్ చేసి ఊరి చివర ఉన్న పొలాల్లోకి రప్పించారు. అప్పటికే ఊరి చివర యువతి తండ్రి భాస్కర్ రావు, మరో అయిదుగురు వ్యక్తులు మాటు వేసి ఉన్నారు. వెంకటేష్ రాగానే మారణాయుధాలతో దాడి చేశారు. అతడి కాళ్లు, చేతులు నరికేశారు. పలుమార్లు కత్తులతో పొడిచారు. ఆ తర్వాత అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని స్థానికులు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి అతడిని ఆసుపత్రికి తరలించారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూనే అతడు కన్నుమూశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఈ ఘటనకు తామే పాల్పడ్డామంటూ ఆరుగురు నిందితులు పొలీస్ స్టేషన్లో లొంగిపోవడం గమనార్హం.
    Published by:Hasaan Kandula
    First published: