AP Corona News: ఆ జిల్లాలో లాక్ డౌన్ తప్పదా..? చాపకింద నీరులా కరోనా..

ప్రతీకాత్మకచిత్రం

పట్టణ ప్రాంతాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతున్నా.. గ్రామీణప్రాంతాల్లో మాత్రం పెరుగుతుండటం టెన్షన్ పెడుతోంది.

  • Share this:
    అన్నా రఘు, గుంటూరు ప్రతినిధి, న్యూస్18

    ఆంధ్రప్రదేశ్ లో కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతోంది. రోజువారీ కేసుల సంఖ్య 25వేల నుంచి క్రమంగా తగ్గుతూ 3వేలకు దిగివచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో 32వేల యాక్టివ్ కేసులున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూ సడలింపులిస్తూ వస్తోంది. గురువారం నుంచి రాష్ట్రంలోని 11 జిల్లాల్లో ఉదయం 6గంటల నుంచి రాత్రి 10గంటల వరకు సడలింపులివ్వగా.. ఉభయగోదావరి జిల్లాల్లో మాత్రం సాయంత్రం 6గంటల వరకే అనుమతిచ్చారు. ఐతే కర్ఫ్యూ సడలింపులిచ్చిన కొన్ని జిల్లాల్లో కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. పట్టణ ప్రాంతాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతున్నా.. గ్రామీణప్రాంతాల్లో మాత్రం పెరుగుతుండటం టెన్షన్ పెడుతోంది. ముఖ్యంగా గుంటూరు జిల్లాలోని పలు మండలాల్లో పాజిటివిటీ రేటు పెరుగుతోంది. ఇప్పటికే పల్నాడు ప్రాంతంలోని కొన్ని గ్రామాల్లో మధ్యాహ్నం 2గంటల తర్వాత కర్ఫ్యూ విధిస్తున్నట్లు స్థానిక అధికారులు ప్రకటించారు. ఇప్పుడు మరిన్ని ప్రాంతాల్లోనూ ఇదే రకమైన ఆంక్షలు విధించేలా అధికారులు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

    ముఖ్యంగా రాజధాని గ్రామాల్లో కరోనా వైరస్ చాపకింద నీరుగా వ్యాపిస్తోంది. ముఖ్యంగా తుళ్లూరు మండల కేంద్రంలో పెరుగుతున్న కేసుల సంఖ్య ప్రజలను టెన్షన్ కు గురిచేస్తోంది. గత నాలుగు రోజుల్లో తుళ్లూరులో 21, అబ్బరాజుపాలెంలో 14 కేసులు నమోదయ్యాయి. అలాగే దొండపాడు, మందడం, వెంకటాయపాలెం గ్రామాల్లోనూ కరోనా కేసులు కనిపిస్తున్నాయి. తక్కువ రోజుల్లో ఎక్కువ కేసులు నమోదవుతుండటంతో డెల్టా ప్లస్ వచ్చిందంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

    సెకండ్ వేవ్ ప్రారంభమైనప్పటి నుంచి రాజధాని ప్రాంతంలో వందల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. మార్చి, ఏప్రిల్ నెలల్లో ఒక్కరాయపూడి గ్రామంలోనే దాదాపు 200 మంది వరకు పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అంతేకాదు ఒకే కుటుంబంలో ఇద్దరు ముగ్గురు మృతి చెందిన ఘటనలు కూడా స్థానికంగా చోటు చేసుకున్నాయి. కరోనా విషయంలో నిర్లక్ష్యం, పెళ్లిళ్లు ఇతర ఫంక్షన్లు భారీస్థాయిలో చేసి వందలాది మందిని ఆహ్వానించడం, మాస్కులు వాడకపోవడమే కరోనా వ్యాప్తికి కారణమని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

    ఇటు తెనాలి మండలం నందివెలుగు గ్రామంలో ఒకే కుటుంబం లో ఐదుగురు కు కరోనా పాజిటివ్ అని తేలటం తో ప్రజలు నిబంధనలు సరిగా పాటించటం లేదని అవసరం ఐతే కంటోన్మెంట్ జోన్ లు ఏర్పాటు చేయటానికి కూడా వెనుకాడబోమని మండల తసీల్ధార్ కే రవికుమార్ తెలిపారు. ఇప్పటికే పల్నాడుతో పాటు చిలకలూరిపేటలోనూ అధికారులు పాక్షిక లాక్ డౌన్ విధించారు. ప్రజలు జాగ్రత్తలు తీసుకోకుంటే కఠిన ఆంక్షలు అమలు చేయాల్సి వస్తుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
    Published by:Purna Chandra
    First published: