ఆంధ్రుల చరిత్రలో 'కొండవీడు కోట'కు ప్రత్యేక స్థానం ఉంది. గుంటూరు నగరానికి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రదేశానికి చక్కటి రోడ్డు మార్గం అందుబాటులో ఉంది. 14వ శతాబ్దంలో రెడ్డి రాజుల పాలనలో ఈ చారిత్రక కట్టడాన్ని నిర్మించారు. ఈ కోటలో మొత్తం 21 నిర్మాణాలున్నాయి. ఈ నిర్మాణాలు చాలా వరకు శిథిలమైనప్పటికీ.. ఈ కోట రహస్యాలను మాత్రం సాక్షాత్కరిస్తాయి. కొండవీడు కోట నిర్మాణశైలి, ఇక్కడి అందాలను చూడటానికి చాలా మంది పర్యాటకులు వస్తారు.
ఈ ప్రదేశం ట్రెక్కింగ్, హైకింగ్ చేయడానికి కూడా అనువుగా ఉండటం వల్ల నిత్యం ఇక్కడ పర్యాటకుల రద్దీ ఉంటుంది. ముఖ్యంగా సెలవురోజుల్లోనైతే చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచ పర్యాటక కేంద్రంగా కొండవీడు కోట ఇప్పుడిప్పుడే గుర్తింపు పొందుతోంది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి.. ముఖ్యంగా గుంటూరు ఘనకీర్తికి 'కొండవీడు కోట' తలమానికంగా నిలుస్తోంది.
కొండవీడు కోటరెడ్డిరాజుల వైభవం ప్రాచీన చరిత్ర, సంపదలకు నిలువెత్తు సాక్ష్యం కొండవీడు కోట. 1700 అడుగుల ఈ గిరిదుర్గం శత్రు దుర్భేద్యంగా ప్రసిద్ధి చెందింది. కొండవీడును శత్రుదుర్బేధ్య రాజ్యంగా తీర్చిదిద్దడమే కాకుండా, ప్రజారంజక పాలనను కొనసాగించిన ఘనత రెడ్డిరాజులది. వారు కొండవీడుకోటను రాజధానిగా చేసుకుని క్రీ.శ. 1325 నుంచి 1420 వరకు పరిపాలించారు. రాజ్యాన్ని ఉదయగిరి నుంచి ఒడిశాలోని కటక్ వరకు విస్తరింపజేసిన పరాక్రమ ధీరులు. రెడ్డిరాజుల పాలనాకాలం వ్యాపార, సంగీత, సాహిత్య, నాట్యాలకు సువర్ణయుగంగా భాసిల్లింది.
ఈ కోట నిర్మాణశైలి అద్భుతంగా ఉంటుంది. గిరి దుర్గం చుట్టూ ఉన్న ప్రాకారం పొడవు 20 కిలోమీటర్లు. ప్రతి కొండ శిఖరాన్నుండి మరో కొండ శిఖరాన్ని తాకుతూ కొండవీడు కోటలోని అన్ని శిఖరాలనూ.. మధ్యలో వచ్చే బురుజులను కలుపుతూ ప్రాకారం ఉంది. కొండ దిగువన చుట్టూ భారీ కందకాలను ఏర్పాటు చేసి వాటి నిండా నీటిని నింపి మొసళ్ళను వదిలి అగడ్తగా రూపొందించారు. ప్రాకారం మధ్యలో అనేక నిర్మాణాలను రెడ్డిరాజులు అద్భుతంగా తీర్చిదిద్దారు. కొండలపైనే రాజు, రాణిల కోటలు, ధాన్యాగారం, వజ్రాగారం, కారాగారం, అశ్వ, గజ శాలలు, నేతి కొట్టు, తీర్పుల మందిరాలను ఏర్పాటు చేశారు.
అద్భుత కోట నిర్మాణం: కొండలపై రాజప్రాసాదాలలో నివసించే వారికి, సైనికులకు నీటి ఇబ్బందులు తలెత్తకుండా ముత్యాలమ్మ, పుట్టాలమ్మ, వెదుళ్ళ చెరువులు తవ్వించారు. వర్షాలు కురిసినప్పుడు ఒక దాని తరువాత ఒకటి నిండేలా వాటిని మలచడం, ఎక్కువైన నీటిని బయటకు పంపేందుకు మత్తిడిని (తూము) నిర్మించడం విశేషం. కొండవీడులో అన్నిటికన్నా ఆసక్తిని కలిగించేవి ఇక్కడి బావులు... ఇంత ఎత్తైన కొండపై ఇంతింత లోతు బావుల్ని ఎలా తవ్వించారన్నది ఊహకందదు... వీటి నుంచి నీళ్లు తోడేందుకు చాలా పొడవైన చాంతాళ్లు వాడేవారు. అందుకే 'కొండవీటి చాంతాళ్లు' అన్న నానుడి వచ్చింది.
కొండవీడు రెడ్డి రాజులు నిర్మించిన గోపీనాథస్వామి దేవాలయాన్నే కత్తులబావి, చీకటి కోనేరు అని పిలుస్తారు. వెన్నముద్దల బాలకృష్ణుని విగ్రహం తొలిగా ప్రతిష్టించింది గోపీనాథస్వామి ఆలయంలోనే. కొండవీడు ప్రాంతంలో ఉన్న అపార శిల్ప సంపద నాటి అద్భుత కళలకు ప్రతీకలు. ఎక్కడ చూసినా రాతి శిల్పాలు, దేవతామూర్తుల విగ్రహాలు, విశిష్ట కట్టడాలు ఆకట్టుకుంటాయి. గ్రామాల్లో, పంట పొలాల్లో దేవతా, నంది విగ్రహాలు ఇప్పటికీ వెలుగు చూస్తూనే ఉన్నాయి.
దేవాలయాలు : కొండవీడు కొండలపై, దిగువన రెడ్డిరాజులు ఎన్నో ఆలయాలను నిర్మించారు. కొండలపై లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, బొల్లుమోర వెంకటేశ్వరస్వామి ఆలయం, మశీదు, దర్గాకొండ, దిగువన కొత్తపాలెంలోని వీరభద్రస్వామి ఆలయం, కొండవీడులోని రామలింగేశ్వరస్వామి ఆలయం, కోట గ్రామం పరిధిలోని గోపీనాథస్వామి దేవాలయం, ఫిరంగిపురం మండలం అమీనాబాద్ కొండపై ఉన్న మూలాంకురేశ్వరి అమ్మవారి ఆలయాలు ప్రధానమైనవి.
కొండవీడు కోట... గుంటూరు జిల్లా.. యడ్లపాడు మండలం పరిధిలో ఉంది. ఈ కోటను చేరుకోవడానికి రెండు ప్రధాన మార్గాలు ఉన్నాయి. చిలకలూరిపేట - గుంటూరు మధ్య జాతీయ రహదారి నెం.5 నుంచి బోయపాలెం, చెంఘీజ్‌ఖాన్ పేట మీదుగా కొండవీడుకు చేరుకోవచ్చు. గుంటూరు - నరసరావుపేట మార్గంలో ఫిరంగిపురం నుంచి కొండవీడు చేరేందుకు మరో మార్గం ఉంది. ప్రస్తుతం చిలకలూరిపేట నుంచి కొండవీడు మీదుగా ఫిరంగిపురంకు పల్లెవెలుగు ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. కొండవీడుకు ప్రైవేటు వాహనాల ద్వారా వెళ్లి మెట్లమార్గం ద్వారా కొండపైకి ఎక్కేందుకు ప్రస్తుతం అవకాశం ఉంది. జాతీయ రహదారి నెం.5కు సుమారు పది కిలోమీటర్ల దూరంలో కొండవీడుకోట ఉంది.
కొండవీడు కోటను రాష్ట్ర ప్రభుత్వం రక్షిత కట్టడంగా గుర్తించింది. కొండవీడు కోట అంటే 2500 అడుగుల ఎత్తు కొండపై 37 ఎకరాల విస్తీర్ణంలో 3 భారీ చెరువులు ఉన్నాయి. ఒక చెరువు నిండితే మరో చెరువులోకి వర్షపు నీరు చేరుతుంది. వేసవికాలంలోనూ ఇక్కడ నీటి కొరత ఉండదు. ఈ చెరువులోకి చేరిన నీటిని కొండవీడు పరిసరాల్లోని ఐదు గ్రామాల రైతులు పంటలకు వినియోగించు కుంటున్నారు. చాలా కాలంగా సరైన మరమ్మతులు లేకపోవటంతో చెరువుకూడా అడవి మాదిరిగా తయారైంది.
కొండవీటి కోట పరిరక్షణకు ప్రభుత్వాలు శ్రద్శ వహించడం లేదు. ఇక్కడ శిథిలమైన కోటలను పునరుద్ధరిస్తే ఏటా వేల మంది పర్యాటకులు వచ్చే అవకాశం ఉంది. కోటపైకి చేరుకోవడానికి ఎట్టకేలకు ఘాట్ రోడ్డు నిర్మించారు. ఇక్కడ పర్యాటకులు ఉండటానికి విడిది గృహాలు కూడా నిర్మిస్తే బాగుంటుంది. దీని ద్వారా ప్రభుత్వానికి కూడా ఆదాయం పెరుగుతుంది. అయితే ఏ ప్రభుత్వం వచ్చినా కొండవీటి కోట రక్షణ విషయంలో హడావుడి చేయడం తప్ప, పెద్దగా అభివృద్ధి చేయలేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు.. కొండవీటి కోటను వారసత్వ సంపదగా గుర్తించి అభివృద్ధి చేయాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Guntur