Gangadhar, News18, Guntur
ఉమ్మడి గుంటూరు జిల్లా (Guntur District) టీడీపీ (TDP) నేతలతో కన్నా లక్ష్మీనారాయణ (Lakshi Narayana) ఆత్మీయ సమావేశం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇటీవలే టీడీపీలో చేరిన సీనియర్ రాజకీయ నేత మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ.. గుంటూరు (Guntur District) లోని తన నివాసంలో జిల్లా ముఖ్య నేతలతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మాజీమంత్రులు, శాసనసభ్యులు, టీడీపీ ఆఫీస్ బేరర్లు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ సమావేశంలో కన్నా ఆగర్భ శతృవు మాజీ యం.పి రాయపాటి సాంబశివరావు సోదరుడు మాజీ మండలి సభ్యుడు రాయపాటి శ్రీనివాసరావు పాల్గొని అందరినీ ఆశ్ఛర్యానికి గురిచేశారు. రాజకీయాలలో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఎవరూ ఉండరు అనేది నిజం చేస్తూ ఇన్నాళ్ళుగా ఒకే పార్టీలో ఉంటూ ఉప్పూ నిప్పువలె ఉంటూ వస్తున్న కన్నా-రాయపాటి కుటుంబాల కలయికతో గుంటూరు జిల్లా రాజకీయాలలో పెనుమార్పులు చోటు చేసుకోనున్నాయి అంటున్నారు విశ్లేషకులు.
తెలుగు దేశం పార్టీలో కన్నా చేరికపై రాయపాటి ఒకింత సానుకూలంగానే స్పందించారు.గతంలో ఒకరిపై ఒకరు అనేక కేసులు పెట్టుకుని ఏళ్ళ తరబడి కోర్టుల చుట్టూ తిరిగిన వీరు కొన్నాళ్ళ క్రితం రాజీపడ్డారు.ఐతే ఇప్పుడు కన్నా.లక్ష్మీనారాయణ ఇంటికి సైతం వచ్చేంతగా రాయపాటి కుటుంబం పాత వైరాన్ని మర్చిపోవడంపై జిల్లాలో జోరుగా చర్చ జరుగుతోంది.
కన్నా పార్టీలోకి వచ్చింది మొదలు జిల్లా తెదేపా రాజకీయాలలో అనేక మార్పులు కనిపిస్తున్నాయంటున్నారు విశ్లేషకులు. ఓ వైపు కాపు సంఘాల నాయకులతో వరుస భేటీలు నిర్వహిస్తూనే మరో వైపు పార్టీ సీనియర్ నాయకులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు.ఆదివారం కన్నా.లక్ష్మీనారాయణ ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి జిల్లాలోని దాదాపు అందరు తెదేపా నాయకులు హాజరవడం పట్ల ఆ పార్టీ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Guntur, Local News