హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

అందమైన బొమ్మలకు ప్రాణం పోస్తారు.. వీరి జీవితాలు మాత్రం చీకటి మయం

అందమైన బొమ్మలకు ప్రాణం పోస్తారు.. వీరి జీవితాలు మాత్రం చీకటి మయం

అందమైన బొమ్మలకు ప్రాణం పోస్తారు.. వీరి జీవితాలు మాత్రం చీకటి మయం

అందమైన బొమ్మలకు ప్రాణం పోస్తారు.. వీరి జీవితాలు మాత్రం చీకటి మయం

రోడ్ల పక్కన గుడారాలు వేసుకుని వందల మంది కళాకారులు బొమ్మలకు ప్రాణం పోస్తూ ఉంటారు. వారి జీవితాలు చీకటి మయంగా మారుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఎక్కడో రాజస్థాన్ నుంచి వచ్చి... రోడ్ల వెంట ప్లాస్టిక్ కవర్లతో గుడిసెలు వేసుకొని... నిత్యం బొమ్మల తయారీలో తలమునకలైన కార్మికుల గురించి పట్టించుకుంటున్న ప్రభుత్వాలు లేవు. ఎన్నో ఏళ్లుగా గుంటూరు సమీపంలోని పెదకాకానిలో దేవుడి బొమ్మలు తయారుచేస్తున్న కార్మికుల జీవితాలను ఒకసారి చూద్దాం. (అన్నా రఘు, సీనియర్ కరెస్పాండెంట్, న్యూస్ 18 అమరావతి)

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

సంస్కృతి, సాంప్రదాయాల పేరుతో జరిగే పండుగల్లో వినాయక చవితిది ప్రత్యేక స్థానం. ముఖ్యంగా ఈ పండక్కి వివిధ అలంకారాల్లో, ఆకారాల్లో వాడవాడల్లో వినాయక విగ్రహాలను ప్రతిష్టిస్తారు. అరచేతిలో ఇమిడిపోయే విగ్రహాల నుంచి 10, 15 అడుగులతో మొదలై 50, 60 అడుగులను దాటి మరీ విగ్రహాల ప్రతిష్ట చేయడాన్ని కొందరు స్టేటస్‌ సింబల్‌గా భావిస్తారు. మరి ఆ బొమ్మల తయారీ వెనుక, రంగుల కలబోత వెనుక ఎన్నిచేతులు పనిచేస్తాయి? ఎంతమంది కష్టం కలగలసి ఉంటుందో తెలుసా? గడచిన 20 సంవత్సరాలుగా గుంటూరు సమీపంలోని పెదకాకానిలో బొమ్మలు తయారు చేస్తున్న కృపారాం ఏం చెబుతున్నాడో చూడండి.

గుంటూరు నగర శివారు ప్రాంతం పెదకాకాని హైవే పక్కన గుడారాలు వేసుకుని జీవిస్తున్న అనేక కుటుంబాలు బొమ్మల తయారీపైనే జీవిస్తున్నాయి. రాజస్థాన్‌ నుంచి వలస వచ్చిన కృపారాం అమ్మానాన్న 20 ఏళ్లుగా పెదకాకానిలోనే ఉండిపోయారు. కృపారాం ఇక్కడే బీటెక్ కూడా పూర్తి చేశాడు. వినాయక చవితికి ఐదునెలల ముందు నుంచే బొమ్మల పని మొదలవుతుంది. రాజస్థాన్‌... బికనీర్‌ నుంచి ముడిసరుకులు తెచ్చుకుంటారు. హైద్రాబాద్‌ వెళ్లి రంగులు, ఇతర రసాయనాలు తీసుకువస్తారు. కరోనా తరవాత ముడి సరుకుల ధరలు విపరీతంగా పెరిగాయి. బొమ్మల తయారీ ద్వారా ఆదాయం తగ్గిపోయిందని కృపారాం ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

కృపారాం లాంటి ఎన్నో కుటుంబాలు బొమ్మలు తయారుచేస్తూ జీవనం సాగించడం శివారు ప్రాంతాల్లో అనేక చోట్ల కనబడుతుంటుంది. బతుకుదెరువు కోసం రాష్ట్రం కాని రాష్ట్రం వచ్చి కుటుంబాలకు కుటుంబాలుగా బతుకుతున్న వీరికి, దశాబ్దాలు దాటుతున్నా ప్రభుత్వ పథకమేదీ వర్తించదు. "నాకు ఓటరు కార్డు ఉంది. ఆధార్‌ కార్డు ఉంది. అయినా మాకూ, మా పిల్లలకి సంక్షేమ పథకాలేవి అందడం లేదు" అని కృపారాం ఆవేదన చెందుతున్నారు. కనీసం ఇళ్లు వేసుకునేందుకు జాగా కూడా ఇవ్వలేదని కృపారాం తెలిపాడు.

"హైవే పక్కన ఖాళీగా ఉన్న స్థలంలో తాత్కాలికంగా టెంట్లు వేసుకుని ఉంటున్నా ఇక్కడి నుంచి ఖాళీ చేయమని రోజూ ఎవరో ఒకరు వస్తుంటారు. ఎప్పుడు వెళ్లిపొమ్మంటారోనని భయంభయంగా ఉంటుంది. సీజన్‌లో సంపాదించిన డబ్బుతోనే తిండి, బట్ట, బొమ్మలకు పెట్టుబడి చూసుకోవాలి" అని కృపారాం గుర్తుచేశారు. కష్టం పోను మిగిలేది చాలా తక్కువ. బొమ్మల పని తప్ప వేరే ఏ పనీ చేయడం వీరికి తెలియదు. అందుకే ఎన్ని కష్టాలు, నష్టాలు వచ్చినా బొమ్మల తయారీని మాత్రం వదల్లేకపోతున్నారు.

శివారు ప్రాంతాల్లో వేలసంఖ్యలో వినాయక బొమ్మలు తయారవుతున్నాయి. కోట్లలో వ్యాపారం జరుగుతోంది. వందల సంఖ్యలో కార్మికులు పనిచేస్తున్నారు. వారిలో అత్యధికులు 15 నుంచి 25 ఏళ్లు కూడా లేని యువకులు. రాజస్థాన్ నుంచి ఇక్కడికి పనిచేయడానికి వస్తున్నారు. కాంట్రాక్టు పనికి, రోజుకూలీకి చేసే వారిలో మహిళలు ఎక్కువగా రోజుకూలీకి వస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బొమ్మలకు రంగులు వేస్తూ మెరుగులు దిద్దుతున్న వీరంతా అసంఘటిత రంగ కార్మికులుగా చాలా తక్కువ వేతనాలకే పనిచేస్తున్నారు.

రాజస్థాన్ నుంచి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మెటీరియల్ తెప్పించుకుంటారు. "కరోనా కారణంగా టన్ను పీవోపీ 4 వేల నుంచి ఏకంగా 16వేల రూపాయలకు పెరిగిపోయింది. ఇక రంగుల ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో బొమ్మల తయారీలో లాభాలు తగ్గిపోయాయి. పూటగడవడమే కష్టంగా ఉంటోంది" అని కృపారాం లాంటి కళాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బొమ్మల తయారీ కార్మికులు పనిచేయడానికి వీలులేని పరిస్థితుల్లో ఆరోగ్యాలని పణంగా పెట్టి మరీ పనిచేస్తున్నారు. మనకు ఇటువంటి అసంఘటిత రంగ కార్మికులు నిత్యం ఎంతోమంది తారసపడుతుంటారు. గుప్పెడు మెతుకుల కోసం వేల కిలోమీటర్లు ప్రయాణించి వచ్చి, నగరంలో జీవిస్తున్నా జనజీవనంలో కలవలేక, పలకరించే వారు కరువై, బిక్కుబిక్కుమంటూ బతుకుతున్న వలసదారులనూ చూస్తుంటాం. ఇలాంటి కళాకారులకు ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు, ఇంటి స్థలాలు ఇచ్చి ఆదుకోవాలని కోరుకుందాం.

First published:

Tags: Andhra Pradesh, Guntur

ఉత్తమ కథలు