Home /News /andhra-pradesh /

GUNTUR HISTORY OF GUTTHIKONDA BILAM AND SECRET 101 TUNNEL WAYS EVEN TO KAASI GSU NJ ABH

Guntur: గుహ నిండా రహస్యాలే..! అడ్వెంచరస్ ట్రిప్‌లు వేసేవాళ్లకు చక్కని ప్రాంతం..! ఎక్కడుందంటే?..!

గుహ

గుహ నిండా రహస్యాలే..!

చుట్టూ పర్వతాల నడుమ సహజంగా ఏర్పడిన రహస్యాల బిలం.. ఆ బిలం లోపలకు వెళ్తున్న కొద్ది చీకటి కమ్మేస్తుంటే.. బుర్రలో భయంతో పాటు ఆలోచనలు ఊపందుకుంటాయి. ఈ అడ్వెంతురౌస్ గుహను చూడాలంటే గుత్తికొండ వెళ్లాల్సిందే..!

  (Sumanth jangam, News 18, Guntur)

  చుట్టూ పర్వతాలు, చక్కని ఆహ్లాదకర వాతావరణం, మధ్యలో సహజంగా ఏర్పడిన బిల సముదాయం. ఆ బిలం లో అడుగుపెడితే చుట్టూ చీకటే. బిలం లోపలికి వెళ్తే.. స్వచ్ఛమైన నీటితో నిండిన కొలను మనకు తారసపడుతుంది. ఆ నీరు ఎక్కడ నుంచి వస్తుందో.. ఎలా వస్తుందో ఎవ్వరికి తెలియదు. ఈ నీటిలో భక్తులు పుణ్యస్నానమాచరిస్తారు. చారిత్రక ఆనవాళ్లకు.. ప్రకృతి శోభాయమానానికి ప్రతీకగా నిలుస్తోన్న గుత్తికొండబిలం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.

  గుత్తికొండ గుహలు: పల్నాడు జిల్లా నరసరావుపేటకు 28 కి.మీ. దూరంలో కారంపూడి గ్రామానికి దగ్గరలో ఉన్న దట్టమైన అడవుల్లో ఉన్న ప్రకృతి సహజమైన గుహలు. ఇది 13వ శతాబ్దం నాటి భారతీయ సంస్కృతికి చిహ్నంగా ఈ పుణ్యక్షేత్రం నెలకొంది. క్రీ.శ 1754వ సంవత్సరంలో స్వయం ప్రకాశ అవధూత స్వాములు, చీకటి మల్లయ్యగా పూజలందు కుంటున్న శివలింగాన్ని ప్రతిష్ఠించారని అక్కడి శాసనాలు చెబుతున్నాయి.

  చారిత్రక గాథలు..!

  ద్వాపారయుగంలో శ్రీకృష్ణడు కాలయవనుని అంతమొందించేందుకు ఈ గుహలో ప్రవేశిస్తాడు. అప్పటికే అక్కడ ప్రశాంతంగా నిద్రిస్తున్న ముచికుందుడనే మహర్షిపై తన ఉత్తరీయాన్ని కప్పుతాడు శ్రీకృష్ణుడు. అయితే అలా ముసుగు ఉండటం వల్ల ఆ మహర్షిని చూసి శ్రీకృష్ణుడు అనుకుని నిద్రాభంగం కలిగిస్తాడు కాలయవనుడు. అలా నిద్రనుండి మేల్కొన్న ముచికుందుని చూపుకు కాలయవనుడు భస్మమవుతాడట. ముచికుందుడికి ఈ వరాన్ని దేవతల నుండి పొందుతాడు.

  అంతేకాదు పురాణకాలంలో ఈ ప్రాంతంలో మహర్షులు తపస్సు చేసుకోనేవారట. పల్నాటి యుద్ధం ముగిసిన తరువాత బ్రహ్మనాయుడు సైతం తన చివరి రోజుల్లో ఈ గుహలోకి వెళ్లిపోయాడని అక్కడి స్థానికులు చెబుతున్నారు. అప్పట్లో పురావస్తు శాఖ అన్వేషణలో… బ్రహ్మనాయుడు ఉపయోగించిన ఆయుధం లభించగా దాన్ని హైదరాబాద్‌ పురావస్తుశాలలో భద్రపరిచారు.

  రహస్యాల సొరంగాలు..!
  ఈ గుత్తికొండ బిలం లోపల నుంచి 101 సొరంగాలు ఉన్నాయంటారు. ఒక్కొక్క సొరంగం ఒక్కొక్క పుణ్యక్షేత్రానికి దారితీస్తుందని స్థానికులు చెబుతున్నారు. బిలంలో 101 సొరంగాలు ఉండగా ప్రస్తుతం వెళ్లటానికి వీలుగా ఉన్న కేవలం ఏడు గుహలు మాత్రమే ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ బిలం నుంచి అమరావతి, శ్రీశైలం, కాశీ, చేజర్ల, అహోబిలం, తిరుమల ఇలా రకరకాల దైవక్షేత్రాలకు మార్గాలున్నాయని భక్తుల నమ్మకం.

  స్వచ్ఛమైన కోనేరు..!
  ఈ బిలంలోపలకు వెళ్లాక మనకు స్వచ్ఛమైన కోనేరు కనిపిస్తుంది. అందులోని నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ఆ కోనేరులోని రాళ్లు కూడా స్పష్టంగా కనిపిస్తాయి. ఈ బిలంలో మొదటిగా చీకటి మల్లయ్యస్వామి మనకు దర్శనమిస్తారు. ఆ తర్వాత బ్రహ్మనాయుడు బిలం, రేణుకా బిలం వస్తుంది. ఈ బిలాలలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఇక్కడి జలాలలో స్నానం ఆచరిస్తే కాశీలో గంగ స్నానం చేసినంత పుణ్యం వస్తుందని భక్తుల విశ్వాసం.

  తొలి ఏకాదశి తిరునాళ్లు..!
  ప్రతి ఏడాది తొలి ఏకాదశి నాడు వైభవోపేతంగా తిరునాళ్ళు జరుగుతుంది. ఆషాడ శుద్ధ ఏకాదశిరోజు బిలమహోత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. కార్తీకమాసంలో జిల్లా నలుమూలల నుండి భక్తులు ఇక్కడకు తరలి వస్తారు. కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి చీకటి మల్లయ్యకు ప్రత్యేకపూజలు నిర్వహిస్తారు.

  ఈ బిలానికి మరో ప్రత్యేకత..!
  ఈ బిలంలోని కోనేటి నీరు చలికాలంలో వెచ్చగాను, వేసవికాలంలో చల్లగాను ఉంటుంది. ఈ కోనేరులోని నీళ్లు ఎక్కడనుంచి వస్తాయో ..ఎలా వస్తాయో ఇప్పటికీ ఎవ్వరికి తెలియదు. అంతేకాదు ఈ నీరు ఎప్పుడూ ఓకే పరిమాణంలో ఉంటాయి. ఈ బిలం ముఖద్వారం వద్ద మనకు వినాయక, రాజరాజేశ్వరి, బాలమల్లేశ్వర దేవాలయాలు ఉన్నాయి. పల్నాటి బాలచంద్రుడే బాలమల్లేశ్వరుడుగా వెలిశాడని ఇక్కడి భక్తులు విశ్వసిస్తారు.

  ఈ సాహసయాత్ర చేయాలంటే...!

  బిలంలోపలకి వెళ్లాలంటే దేవునిపై నమ్మకంతో పాటు ధైర్యం కూడా ఉండాలి. ఎందుకంటే ఆ గుహలోకి వెళ్తున్న కొద్ది చీకటి ఆవరిస్తుంది. దీపాల వెలుగులోనో, విద్యుత్ కాంతుల మధ్యనో… లోపలకి వెళ్తూ ఉంటారు. ఇంకా లోపలికి వెళ్లే కొద్ది గుడ్లగూబల అరుపులు భయపెట్టేస్తాయి. లోపలకు వెళ్లే కొద్ది శ్వాస ఆడటం కూడా కష్టంగా అనిపిస్తుంది. అందుకే శ్వాస ఇబ్బందులు ఉన్నవాళ్లు ఈ సాహసయాత్ర చేయాలంటే వైద్యుని పర్యవేక్షణ తప్పనిసరి. ఆదివారాలు, సెలవు రోజులు, పర్వదినాలలో వెళ్లటం మంచిది. ఎందుకంటే ఆ సమయంలో పర్యాటకులు ఎక్కువగా ఉంటారు.  అడ్రస్‌: గుత్తికొండ, పిడుగురాళ్ల మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్‌-522614

  ఎలా వెళ్లాలి?: హైదరాబాద్ నుండి వచ్చేవారు మాచర్ల మార్గం నుంచి వెళ్లొచ్చు. లేదంటే నరసరావుపేటలో బస్సు ఎక్కి గుత్తికొండలో దిగాలి. ఆ తరువాత అక్కడ అందుబాటులో ఉంటే ఆటో మాట్లాడుకొని ఈ బిలానికి చేరుకోవాలి. రైలు మార్గం ద్వారా అయితే పిడుగురాళ్లలో దిగాల్సి ఉంటుంది. అక్కడ నుంచి గుత్తికొండకు బస్సు సౌకర్యం ఉంటుంది.
  Published by:Abhiram Rathod
  First published:

  Tags: Andhrapradesh, Guntur, Local News, Tourist place

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు