గుంటూరు (Guntur) బీటెక్ విద్యార్తిని రమ్య హత్య కేసులో ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఇప్పటికే నేర నిర్ధారణ చేసిన ప్రత్యేక న్యాయమూర్తి.. శుక్రవారం మధ్యాహ్నం నిందితుడికి ఉరి శిక్ష ఖరారు చేస్తూ తీర్పునిచ్చారు.
గుంటూరు (Guntur) బీటెక్ విద్యార్తిని రమ్య హత్య కేసులో ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఇప్పటికే నేర నిర్ధారణ చేసిన ప్రత్యేక న్యాయమూర్తి.. శుక్రవారం మధ్యాహ్నం నిందితుడికి ఉరి శిక్ష ఖరారు చేస్తూ తీర్పునిచ్చారు. సంచలనం సృష్టించిన రమ్య హత్యకేసులో ఎలాంటి తీర్పు వస్తుందోనని అందరూ ఉత్కంఠతో ఎదురు చూడగా.. కోర్టు ఉరిశిక్ష విధించింది. సోషల్ మీడియా ద్వారా రమ్యకు పరిచయమైన శశికృష్ణ.. ప్రేమ పేరుతో ఆమెను వేధించాడు. అతని వేధింపులు భరించలేక రమ్య.. శశికృష్ణ ఫోన్ నెంబర్ ను బ్లాక్ చేసింది. ఇది జీర్ణించుకోలేని శశికృష్ణ కోపంతో గతేడాది ఆగస్టు 15న నడిరోడ్డుపైన అందరూ చూస్తుండగా రమ్యను కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ ఘటనపై రాజకీయ పార్టీలు సైతం ఆందోళనలు చేశాయి.
సీసీ కెమెరాలో నమోదైన హత్య దృశ్యాల ఆధారంగా శశికృష్ణను 24 గంటల్లోనే నరసరావుపేట సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ రవికుమార్ ఆధ్వర్వంలో పోలీసులు 36 మందిని విచారించి 15రోజుల్లోనే ఛార్జిషీట్ దాఖలు చేశారు. ప్రత్యేక కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎన్.శారదామణి 28మందిని విచారించగా.., ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి రాంగోపాల్ వద్ద సాక్షులు వాంగ్మూలం ఇచ్చారు. హత్య కేసులో కీలకమైన సీసీ టీవీ వీడియోను పరిశీలించిన న్యాయమూర్తి.. ఇరువర్గాల వాదనలు విని ఈనెల 26న విచారణ పూర్తి చేశారు. సుమారు 9నెలల విచారణ చేసిన ప్రత్యేక న్యాయస్థానం శుక్రవారం తీర్పు వెలువరించింది.
ఇది చదవండి: కేటీఆర్ కామెంట్స్ కు ఏపీ మంత్రుల కౌంటర్.., మళ్లీ మొదలైన మాటల యుద్ధం..
ఈసందర్బంగా రమ్య తల్లిదండ్రులు మాట్లాడుతూ రమ్యకు జరిగిన ఘోరం ఎవ్వరికీ జరగకూడదు అన్నారు. ఆమె ఆత్మకు శాంతి కలిగింది. దిశ చట్టంతోనే న్యాయం జరిగిందని తెలిపారు . ప్రేమోన్మాదులకు ఇలాంటి శిక్షలు పడాలి. అప్పుడే నేరాలు తగ్గుతాయి. ప్రభుత్వం, పోలీసులకు కృతజ్ఞతలు అని తెలియజేసారు . అసలు వివరాల్లోకి వెళ్లితే గుంటూరు పరమయ్యకుంటకు చెందిన బీటెక్ విద్యార్థిని రమ్య హత్యోదంతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
రమ్య కేసులో కోర్టు తీర్పుపై సీఎం జగన్ (CM Jagan) స్పందించారు. రమ్య కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును స్వాగతిస్తున్నట్లు సీఎం ట్వీట్ చేశారు. కేసులో వేగంగా దర్యాప్తు చేసి శిక్షపడేలా చేసిన పోలీసులకు జగన్ అభినందించారు.
విద్యార్థిని రమ్య హత్య కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును స్వాగతిస్తున్నాను. ఈ కేసు విషయంలో వేగంగా దర్యాప్తు పూర్తిచేసి, నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన పోలీస్ శాఖకు అభినందనలు.
రమ్య హత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష పడటంపై మంత్రి రోజా (Minister Roja) స్పందించారు. రాష్ట్రంలో ఆడపిల్లల జోలికి వస్తే ఇలాంటి శిక్షలు తప్పవని ఆమె హెచ్చరించారు. శశికృష్ణ లాంటి మృగాలను ఏరిపారేస్తామని రోజా అన్నారు. రమ్య కుటుంబానికి సీఎం జగన్ అన్ని విధాలుగా అండగా ఉన్నారని రోజా అన్నారు. రమ్యకు జరిగిన అన్యాయానికి ఆమె ఆత్మ శాంతించేలా ఉరిశిక్ష పడిందన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.