Andhra Pradesh: వైద్య శాస్త్రంలో ఇదో అద్భుతం... మూడుకాళ్ల శిశువుకు పునర్జన్మ ప్రసాదించిన డాక్టర్లు...

ప్రతీకాత్మక చిత్రం

Andhra Pradesh: మూడు కాళ్లతో వింత శిశువు జన్మించడమే కాకుండా.. మూడో కాలు భాగంగా పురుష జననాంగాలను డాక్టర్లు గుర్తించారు.

 • Share this:
  డాక్టర్లు కనిపించే దేవుళ్లు. ప్రాణాపాయస్థితిలో ఉన్నవారికి ప్రాణం పోస్తారు. అంతుబట్టని రోగాలను నయం చేస్తారు. అంతేకాదు శారీరక లోపాలను కూడా సరిచేసి పునర్జన్మను ప్రసాదిస్తారు. మూడు కాళ్లతో జన్మించిన ఆడ శిశువుకు డాక్టర్లు మరోసారి ప్రాణం పోశారు. అత్యంత క్లిష్టమైన ఆపరేష్ ను విజయవంతంగా నిర్వహించి చిన్నారితో పాటు తల్లిదండ్రుల జీవితాల్లో సంతోషాన్ని నింపారు. వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం శెట్టివారిపాలెం గ్రామానికి చెందిన మోహనరావు, వెంకటేశ్వరమ్మ దంపతులు. వీరికి తొలికాన్పులో ఆడబిడ్డ జన్మించింది. మార్చి 4వ తేదీన రెండో కాన్పు కోసం నూజివీడు ఏరియా ఆస్పత్రిలో చేరింది. ఐతే పాప మూడు కాళ్లతో జన్మించడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. మూడోకాలు వెన్నుముక బాగం నుంచి బయటకు ఉండటంతో డాక్టర్లు విజయవాడ ప్రభుత్వాస్పత్రికి రిఫర్ చేశారు. అక్కడ పరీక్షించిన వైద్యులు గుంటూరు జీజీహెచ్ కు తీసుకెళ్లాలని సూచించారు. అక్కడ పాపను పరీక్షించిన న్యూరో విభాగం వైద్యులు ఆపరేషన్ కు ఏర్పాట్లు చేశారు.

  న్యూరో సర్జరీ విభాగం అధిపతి ప్రొఫెసర్ డి.శేషాద్రి శేఖర్ ఆధ్వర్యంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ హనుమ శ్రీనివాసరెడ్డి, పీజీ డాక్టర్లు ధీరజ్, సత్య, విజయ్ తో కూడిన బృందం విజయవంతంగా ఆపరేషన్ చేసి మూడోకాలును తొలగించారు. నడుం భాగంలో మిగిలిన రెండు కాళ్లకు సంబంధించిన నరాలు కాలుకు అతుక్కుని పోవడంతో వాటిని ఆధునిక చికిత్స ద్వారా వేరు చేసినట్లు డాక్టర్లు తెలిపారు. ఐతే నడుం నుంచి వచ్చిన మూడో కాలుకు పురుష జన నంగాలు ఉండటం గమనార్హం. దీనిని వైద్య భాష లో లంబర్ మైలో మీనింగ్ సీల్ విత్ ట్రైపీడస్ డిఫార్మటి గా పిలుస్తారని వెల్లడించారు. ఇప్పటివరకు గుంటూరు జీజీహెచ్ లో ఇలాంటివే 21 కేసులు నమోదయ్యాయని.. ఇది 22వ కేసు అని డాక్టర్లు తెలిపారు. ఈ కేసును అంతర్జాతీయ వైద్య సదస్సులో ప్రచురిస్తామన్నారు.

  గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్స


  డాక్టర్లకు కృతజ్ఞతలు
  తన బిడ్డకు గుంటూరు ప్రభుత్వ వైద్యులు ప్రాణం పోయడం ఆనందంగా ఉందని పాప తల్లి వెంకటేశ్వరమ్మ తెలిపారు. పుట్టగానే శిశువు ఆకారంలో మార్పులు ఉండటం గమనించి మొదట భయపడ్డామని.., గుంటూరు ఆసుపత్రికి వచ్చిన తర్వాత డాక్టర్లు మెరుగైన చికిత్స అందించి తమ పాపకు పునర్జన్మను ప్రసాదించారని ఆమె అన్నారు.

  ఇలాంటివి చాలా అరుదు
  తెలుగురాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు చాలా అరుదుగానే చోటు చేసుకుంటున్నాయి. 2017లో జనగామకు చెందిన ఓ దంపతులకు మూడు కాళ్లతో కూడిన బాబు జన్మించాడు. అప్పట్లో ఈ వార్త వైరల్ అయింది. ఇలాంటి జన్యులోపాలతో పుట్టిన పిల్లలకు ఆపరేషన్లు చేసి అదనపు అవయవాలను తొలగించడం చాలా కష్టం. హైదరాబాద్ కు అవిభక్త కవలలు చెందిన వీణ-వాణిని విడదీసే ప్రక్రియ ఏళ్లుగా సాగుతోంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన డాక్టర్లు కూడా వీరి విషయంలో చేతులెత్తేశారు.
  Published by:Purna Chandra
  First published: