మత్స్యకారులు (Fishermen) సముద్రం (Sea)పైనే ఆధారపడి జీవిస్తారు. గంగమ్మతల్లి ఇచ్చిన సంపదతోనే జీవనోపాధి పొందుతారు. వలకు చేప చిక్కితేనే వారి కడుపు నిండుతుంది. ఇలాంటి సందర్భంగాల్లో సముద్రంలో వేటకు వెళ్లాలంటే మత్స్యకారులకు ఏదో తెలియని నైరాస్యం నెలకొంటుంది. ఒక్కోసారి వారం రోజులు నడిసంద్రంలో వేటాడినా రోజుకూలికి సరిపడా డబ్బులు కూడా దక్కవు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని గుంటూరు జిల్లా (Guntur District)లోని మత్స్యకారులకు రెండు నెలలుగా అదృష్టం కలసివస్తోంది. మత్స్యకారులకు ఆదాయం తెచ్చెలా వలకు రొయ్యలు (Prawns) చిక్కుతున్నాయి. వారం రోజుల్లో వచ్చే ఆదాయం రెండు రోజుల్లోనే దక్కుతోంది. దీంతో వారి కళ్లలో ఆనందం కనిపిస్తోంది. వరుసగా మూడేళ్లపాటు తుఫాన్ల కారణంగా వేట సక్రమంగా సాగకపోవడంతో మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయారు. ప్రస్తుతం వారి జీవితాల్లో క్రమంగా మార్పు వస్తోంది
రొయ్యల వేటతో భారీగా ఆదాయం సమకూరుతోంది. ఇన్నాళ్లూ వేటకు వెళ్తే కోనమ్, మొయ్య, సందువాలు, పండుగప్ప వంటి చేపలు మాత్రమే వలకు చిక్కేవి. ఇప్పుడు చేపలతో పాటు రొయ్యలు కూడా చిక్కుతుండటంతో మత్స్యకారుల పంట పండుతోంది. ఆక్వా సాగు చేసే రైతులకు కిలోకు 40 నుంచి 25 కౌంట్ చూడాలంటే కష్టమే. అలాంటి దిగుబడి రావాలంటే భారీగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి. కొన్నాళ్లుగా సంద్రంలో 20 కౌంట్ రొయ్యలు కూడా చిక్కుతుండటంతో మత్స్యకారుల ఆనందానికి అవధుల్లేవు.
గుంటూరు జిల్లా బాపట్ల మండలంలోని అడవి పల్లెపాలెం, కృపానగర్, దాన్వాయిపేట, ఓడరేవు వంటి తీర ప్రాంత గ్రామాల్లో రొయ్యల వేట బాగా సాగుతోంది. బాపట్ల తీరప్రాంతంలో 3 వేల మత్స్యకార కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడి నుంచి దాదాపు 800 బోట్లు వేటకు వెళ్తాయి. చేపల వేటకు వినియోగించే వలలు కాకుండా.. రొయ్యల వేట కోసం ప్రత్యేక వలలను ఉపయోగించడం వల్ల రొయ్యలు బాగానే చిక్కుతున్నాయి.
ఆశాజనకంగా ధరలు..
ఒక్కొబోటులో దాదాపు 10 మంది వరకు వేటకు వెళ్తారు.. ప్రస్తుతం టైగర్, వనామీ రొయ్యలు లభ్యమవుతున్నాయి. ఒక్కోవిడతలో దాదాపు 4వందల కేజీల వనామీ రొయ్యలు, దాదాపు 50కిలోల టైగర్ రొయ్యలు పడుతుండగా.. అవి 20-40 కౌంట్ ఉంటున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో 40 కంట్ రొయ్యలు కిలో రూ.500 వరకు పలుకుండగా.. 20 కౌంట్ టైగర్ రొయ్యలు రూ.500-600 వరకు పలుకుతున్నాయి.
గతంలో వేటకు వెళ్లాలంటే తీరం నుంచి 50-60 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు కేవలం 20-30 కిలోమీటర్ల దూరంలోనే ఖరీదైన రొయ్యలు లభ్యమవుతుండటంతో మత్స్యకారులు అనందపడుతున్నారు. దీనివల్ల ఖర్చు కూడా కలిసొస్తుందని సంబరపడుతున్నారు. గతంలో రూ.30వేల నుంచి రూ.50వేల వరకు అయ్యే ఖర్చు ఇప్పుడు రూ.20వేలే అవుతోంది. దీంతో ఖర్చులు మిగలడంతో పాటు ఆదాయం కూడా వస్తోందని మత్స్యకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.