Anna Raghu, News18, Amaravati
1965లో భారత్-పాకిస్తాన్‌ల మధ్య జరిగిన యుద్ధం సందర్భంగా అప్పటి ప్రధానిగా ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి ఓ నినాదం ఇచ్చారు. అదే జై జవాన్ జై కిసాన్. భారతదేశ ఆహార ఉత్పత్తిని పెంచాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పిన శాస్త్రి 1965 లో భారతదేశంలో హరిత విప్లవాన్ని ప్రోత్సహించారు. ఇది ముఖ్యంగా పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరగడానికి దారితీసింది. ఆకలి చావుల దుర్భర స్థితి నుంచి హరిత విప్లవం దేశాన్ని రక్షించింది. ఆహార ధాన్యాలకు కొరత లేని భరోసానిచ్చింది. అయితే, వేలాది ఏళ్లుగా కొనసాగిన రైతు స్వావలంబన ప్రపంచీకరణ నేపథ్యంలో సడలిపోయింది. పత్తి తదితర వాణిజ్య పంటల రసాయనిక సాగుకు అధిక పెట్టుబడులు అవసరం కావడం, ఆదాయంపై కచ్చితమైన హామీ లేకపోవడంతో రైతులు ఆర్థిక స్థిరత్వానికి లోనయ్యారు.
దేశంలో సాగు రంగం కుదేలవుతోంది రైతుకు పెట్టుబడి కూడా రాని పరిస్థితి దీంతో నష్టాలే పలకరిస్తున్నాయి. ఈనేపథ్యంలో రైతు నిరంతరం దిగులు చెందుతున్నాడు కలిసిరాని కాలంతో వేగలేక సాగుకు స్వస్తి చెప్పాలనుకుంటున్నాడు. చేసిన కష్టానికి ప్రతిఫలం లేకపోవడంతో ఇక లాభం లేదనుకుని అస్త్ర సన్యాసం చేస్తున్నాడు వ్వవసాయంలో సాయం లేక ఇక ఆ పని చేయడానికి సైతం వెనకాడుతున్నాడు. ఇన్నాళ్లు అల్లు అద్దెకు ఇవ్వబడును అనే బోర్డులు చూశాం. కానీ రాబోయే రోజుల్లో పొలం కూడా అద్దెకు ఇవ్వబడును అనే బోర్డులు వస్తాయని స్పష్టమవుతోంది.
వ్యవసాయంలో రైతులకు లాభం లేకపోగా నష్టాలే పలకరిస్తున్నాయి. గతంలో వ్యవసాయం లాభసాటిగానే ఉన్నా రానురాను పరిస్థితి మారిపోయింది. అన్ని ఖర్చులు పెరిగాయి. పెట్టుబడి పెరిగింది. కానీ దిగుబడి మాత్రం అలాగే ఉంది ధరలు సైతం గిట్టుబాటు కావడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు కౌలురైతులను పట్టించుకోవడం లేదు. దీంతో వారి గతి అగమ్యగోచరమే. కౌలు రైతుకు కనీసం గుర్తింపు కూడా లేదు. ఈక్రమంలో కౌలు రైతుల కష్టాలు వర్ణనాతీతం.
గుంటూరు జిల్లా (Guntur District) లో ఓరైతు వినూత్న ప్రయోగం చేశాడు. తన పొలంలో పొలం కౌలుకు ఇవ్వబడును అని బ్యానర్ ప్రదర్శించాడు. జిల్లాలోని నారాకోడూరుకు చెందిన వెంకటేశ్వరావుకు 5.20 ఎకరాల పొలం ఉంది. కానీ ఆయన కాలుకు గాయం కావడంతో వ్యవసాయం చేయలేని పరిస్థితిలో పొలం కౌలుకు ఇస్తానని అందరికి చెప్పినా ఎవరు ముందుకు రాలేదు. దీంతో ఇలా వినూత్నంగా ఆలోచించి పొలంలో బ్యానర్ పెట్టాడు విచిత్రం ఏమిటంటే అందరు ఆశ్చర్యకరంగా తిలకిస్తున్నారే తప్ప ఎవరు కూడా సేద్యం చేయడానికి ముందుకు రాకపోవడం గమనార్హం. వ్యవసాయమంటేనే అందరు భయపడుతున్నారు. అందులో కౌలు అంటే పెట్టుబడి పెరిగిన సందర్భంలో ఎక్కడి నుంచి తెచ్చేదనే ఆలోచనతోనే ముందుకు రావడం లేదని దీనినిబట్టి తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Farmers, Guntur