YCP Pleanary 2022: పండగలా రెండు రోజుల పాటు సాగిన వైసీపీ ప్లీనరీ (YCP Plenary) వైభంగా ముగిసింది. మొత్తం తొమ్మిది తీర్మానాలు చేశారు.. నవరత్నాలు అమలు తీరుపై పూసగుచ్చినట్టు క్లారిటీ ఇచ్చారు.. అయితే ఈ రెండు రోజుల ప్లీనరీలో.. రెండు కీలక ఘట్టాలు ప్రత్యేకంగా నిలిచాయి.. ఒకటి తొలిరోజు గౌరవ అధ్యక్షురాలి పదవికి తల్లి విజయమ్మ (YS Vijayamma) రాజీనామా చేశారు. ఇక రెండోది రెండో రోజు.. అధినేత జగన్ ను.. జీవిత కాల అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. సీఎం జగన్ (CM Jagan) నుంచి మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యే అంతా టార్గెట్ 175 అంటూ పిలుపు ఇచ్చారు.. వచ్చే ఎన్నికలను క్లీన్ స్వీప్ చేస్తామంటూ ధీమా వ్యక్తం చేశారు. అయితే రెండో రోజు సమావేశంలో మాజీ మంత్రులు కొడాలి నాని (Kodali Nani), పేర్ని నాని (Perni Nani) ల ప్రసంగాలు ప్రత్యేకంగా నిలిచాయి. చంద్రబాబు (Chandrababu) సీఎంగా ఉంటే రాష్ట్రాన్ని దోచుకోవచ్చన్నది కొందరి ఆలోచన అంటూ ఆరోపించారు కొడాలి నాని. ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పిస్తుంటే విమర్శలు చేయడం సమంజసమా అని ప్రశ్నించారు. పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవొద్దా?. ఆరోపణలు చేస్తున్న వారి పిల్లలు ఏ మీడియంలో చదివారని ఆయన ప్రశ్నించారు. పేద పిల్లల కోసం తండ్రి స్థాయిలో సీఎం జగన్ ఆలోచించారా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఏనాడైనా ఇలాంటి పథకాలు అమలు చేశారా అని నిలదీశారు. సీఎం జగన్ భగభగమండే సూర్యుడిలాంటోడన్నారు.
అసలు దేశంలోనే.. చంద్రబాబు లాంటి చవట దద్దమ్మ ఎవరూ లేరన్నారు. పుట్టిపెరిగిన చంద్రగిరిలో చంద్రబాబు ఎప్పుడైనా గెలిచారా అని ప్రశ్నించారు. చంద్రబాబు మతిస్థిమితం తప్పి మాట్లాడుతున్నారని విమర్శశించారు. గౌరవ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేస్తే.. తల్లి పాత్ర పోతుందా?. తల్లిని మించిన హోదా ఉంటుందా చంద్రబాబు వ్యాఖ్యలను కొడాలి నాని ఖండించారు.? వచ్చే ఎన్నికల తరువాత చంద్రబాబుకు రాజకీయ సమాధే అంటూ హెచ్చరించారు కొడాలి నాని.
మరో మాజీ మంత్రి పేర్ని నాని సైతం.. పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ నింపే ప్రయత్నం చేసారు. మూడేళ్లుగా తమను పట్టించుకోవటం లేదంటూ పార్టీ కార్యకర్తల నుంచి అక్కడక్కడా వినిపిస్తోందని.. అయితే అలాంటి వారంతా ఎమ్మెల్యేల కోసమో.. మంత్రుల కోసమో పని చేయవద్దని.. జగన్ కోసం పని చేయాలని కోరారు. తన లాంటి వాళ్లు వస్తుంటారు.. పోతుంటారని.. కానీ పార్టీకి జెండా మోసే కార్యకర్తలే శాశ్వతం అని అభిప్రాయపడ్డారు. తన లాంటి వాళ్లంతా రాజకీయం కోసం ..పదవుల కోసం వచ్చే వాళ్లమని. జగన్ - పార్టీ - కార్యకర్తలు శాశ్వతమని పేర్కొన్నారు. మీరంతా ఎమ్మెల్యేల కోసం పని చేయలేదని..జగన్ కోసం పని చేసారని.. జగన్ పైన అభిమానంతో ముందకొచ్చారని చెప్పుకొచ్చారు.
ఇదీ చదవండి : మళ్లీ కరోనా ప్రమాద ఘంటికలు.. మూడు రోజుల్లో వందకుపైగా కేసులు
ఇంటింటికీ వెళ్లి పథకాల అమలు తీరు సమీక్షించటానికి ఎనిమిది నెలల సమయం ఇచ్చారని చెప్పారు. ఎమ్మెల్యే గ్రాఫ్ పెరగకపోతే ఎమ్మెల్యేలకు టిక్కెట్లు లేవని స్పష్టం చేశారన్నారు. తాను మూడేళ్లు మంత్రిగా పని చేశానని..తనను పక్కకు తప్పించారని గుర్తు చేసారు. వైసీపీ లోనూ కొందరు చంద్రబాబును సింగిల్ గా రమ్మని సవాల్ చేస్తున్నారని..వాళ్లు సింగిల్ గా రారని.. కలిసి కట్టుగానే వస్తారని తేల్చి చెప్పారు. అయితే వారు ఒక్కొక్కరుగా వస్తే జగన్ పచ్చడి చేసేస్తారని వాళ్లకు బాగా తెలుసన్నారు. అందరూ కలిసి వచ్చినా... జగన్ అంటే తగ్గేదే లే అని పేర్ని నాని అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Kodali Nani, Perni nani, Ycp