YCP Politics: అధికార పార్టీలో ఓ వైపు అసమ్మతి రాగం పెరుగుతుంటే.. దాన్ని చల్లార్చే ప్రయత్నం చేస్తోంది అధిష్టానం ఇందులో భాగంగా.. ఆ మాజీ ఎమ్మెల్యే లక్కు తిరగబోతోందని సమాచారం. హామీ ఇచ్చినా ఇన్నాళ్లూ పదవి దక్కని ఆ నేతకు ఇప్పుడు డబుల్ ఆఫర్స్ వచ్చాయి అంటున్నారు. అందేంటి అంటే.. ఎమ్మెల్సీ కాకుంటే ఎమ్మెల్యే కావడం గ్యారెంటీ అనే కాన్ఫిడెన్స్‌కు వచ్చాసరనే ప్రచారం ఉంది. మొన్నటి వరకు పదవి లేదని మౌనంగా ఉన్న ఆ మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు స్పీడ్ పెంచారని టాక్.. అటు అధిష్ఠానం కూడా ఆయన్ను పిలిచి మరీ ప్రాధాన్యం ఇస్తోందని సమాచారం. ఒక వేళ ఎమ్మెల్సీ సీటు ఇస్తే ఒకే.. అది కాకుండా ఎమ్మెల్యే సీటు ఇవ్వాలి అనుకుంటే అక్కడి మంత్రి ఫేట్ ఏంటి అని చర్చ జరుగుతోంది.
2004లో చిలకలూరిపేట ఎమ్మెల్యే చిలకలూరిపేటలో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ మద్దతుతో గెలిచిన ఎమ్మెల్యేగా మర్రి రాజశేఖర్‌కు పేరు ఉంది. వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలోనే ఉన్నారు. చిలకలూరిపేట నుంచి మూడుసార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన సోమేపల్లి సాంబయ్యకు రాజశేఖర్ అల్లుడు. సోమేపల్లి రాజకీయ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన మర్రి.. 2004లో చిలకలూరిపేటలో కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేసినా టెక్నికల్ సమస్యతో అది రద్దు కావడంతో.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి 212 ఓట్ల మెజారిటీతో గెలిచారు.
ఇక 2009లో కాంగ్రెస్ నుంచి 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి మర్రి ఓడిపోయారు. ఈ రెండుసార్లు టిడిపి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు విజయం సాధించారు. వరుస రెండు సార్లు ఓడిపోవడంతో.. 2019లో మర్రికి సీట్ రాలేదు. మరోవైపు మొదట టీడీపీలో చేరి.. ఆ తర్వాత వ్యూహాత్మకంగా వైసీపీ కండువా కప్పుకొన్నారు విడదల రజనీ.. ఆ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. బీసీ, మహిళ కావడంతో రజనీకి అన్నీ కలిసి వచ్చాయి.
ఇదీ చదవండి : పార్టీ నేతలపై సంచలన వ్యాఖ్యలు.. వారసత్వంగా ఎదగలేదు..? పోరాటాలు చేసి ఈ స్థాయికి చేరా
రజనీకి సీటు ఇవ్వడంతో.. మర్రి రాజశేఖర్ ను ఎమ్మెల్సీని చేసి మంత్రివర్గంలోకి తీసుకుంటానని ఎన్నికల ప్రచార సభలో బహిరంగంగానే హామీ ఇచ్చారు. అయితే నాలుగేళ్లు గడుస్తున్నా ఇంత వరకు మర్రి ఎమ్మెల్సీ కాలేదు. ఆయన అలకబూనారు. పేటలో ఏ కార్యక్రమం జరిగినా టచ్ మీ నాట్‌గా వ్యవహరించడం.. గతంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా పని చేసిన అనుభవం ఉన్నా పార్టీతో సంబంధం లేనట్టు ఉండేవారు. ఇటీవల వైసీపీ అధిష్ఠానం ఆయనకు ప్రాధాన్యం పెంచింది. వైసీపీ ఉమ్మడి కృష్ణా జిల్లా కోర్డినేటర్‌గా నియమించారు జగన్. పార్టీ పదవితో రాజ్‌శేఖర్ స్పీడ్ పెంచారు. సొంత జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. సమన్వయ కమిటీ సమావేశాలకు ఆయన వస్తున్నారు.
ఇదీ చదవండి : పొత్తులపై క్లారిటీ అప్పుడే.. పవన్ వారాహి యాత్రపై నాగబాబు క్లారిటీ..
ఆయన దూకుడు పెంచడానికి కారణం ఉంది అంటున్నారు. ఈసారి MLC ఖాళీల భర్తీ సమయంలో అవకాశం ఇస్తామని వైసీపీ అధిష్ఠానం మర్రికి చెప్పిందనే ప్రచారం ఉంది. ఒకవేళ ఎమ్మెల్సీగా ఛాన్స్ రాకపోతే రాబోయే ఎన్నికల్లో చిలకలూరిపేట సీటు తిరిగి తనకేనని ఆయన ప్రచారం ప్రారంభించారట. రజనీని గుంటూరు లేదా సత్తెనపల్లిలో పోటీ చేయించే ఆలోచనలో పార్టీ పెద్దలు ఉన్నట్టు మర్రి వర్గం ప్రచారం చేస్తోందట. దీంతో ఈసారి పేటలో పోటీ చేసేది తానే.. గెలిచేది తానే అని మర్రి రాజశేఖర్ ఊహల పల్లకిలో ఊరేగుతున్నారట.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, AP Politics, Guntur, Ycp