తాడేపల్లి: ఈ తెల్లవారుజామున గంజాయి మత్తులో ముగ్గురు యువకులు దారి దోపిడికి ప్రయత్నించారు. ప్రాణ భయంతో బాధితుడు 100కి డయల్ చేశాడు. సకాలంలో తాడేపల్లి సీఐ శేషగిరి రావు తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకోవడంతో ప్రాణాలతో బయటపడ్డానని బాధితుడు తెలిపాడు. ఉండవల్లికి చెందిన అంజి అనే అతను హోల్‌సేల్ కూరగాయల వ్యాపారం చేస్తుంటాడు. విజయవాడ నుంచి తన నివాసానికి వస్తుండగా ఉండవల్లి ఆంజనేయస్వామి గుడి దగ్గర తెల్లవారుజామున ముగ్గురు యువకులు కారుకు అడ్డు వచ్చి విచక్షణారహితంగా దాడి చేశాడు.
దీంతో.. అంజి భయభ్రాంతులకు గురయ్యాడు. గంజాయి మత్తులో ఉన్న యువకులు పోలీసులను కూడా దుర్భాషలాడుతూ ‘మీకు చేతనైనది చేసుకోండి’ అంటూ పోలీసులపై యువకులు విరుచుకుపడ్డారు. అంతేకాదు.. పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు బాధితుడిని బెదిరించారు. ‘మా మీద పోలీసులకు ఫిర్యాదు చేస్తావా.. నీ అంతు చూస్తాం.. నిన్ను ఏదైనా చేయకుండా మేము ఇక్కడ నుంచి వెళ్ళం’ అని బాధితుడిని నిందితులు బెదిరించారు.
గంజాయి మత్తులో దాడులు చేస్తున్న వారి నుంచి తమను రక్షించాలని పోలీసులని ఉండవల్లి గ్రామస్తులు వేడుకున్నారు. గంజాయికి బానిసైన యువకులుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని గంజాయి నిషేధిత మత్తు పదార్థాలు అమ్ముతున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని పోలీసులకి స్వయంగా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపినా తాడేపల్లి పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఘటన జరిగి ఇంతసేపు అవుతున్న.. నిందితులు అక్కడే ఎదురుగా తిరుగుతున్నా ముగ్గురు యువకులను తాడేపల్లి పోలీసులు అదుపులోకి తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇలాంటి ఘటనలు గతంలో కూడా జరిగాయి. తాడేపల్లి-మంగళగిరి కార్పొరేషన్ పరిధిలోని పీడబ్ల్యూడీ వర్క్‌షాప్ వెనుక ప్రాంతంలో గంజాయి మత్తుకు బానిసైన కొందరు యువతులు అటుగా వెళ్లే మహిళలను వేధించడమే పనిగా పెట్టుకుని ఇబ్బంది పెట్టేవారు.
ఇది కూడా చదవండి: Road accident: పండగ పూట విషాదం.. పశ్చిమ గోదావరిలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
డిసెంబర్ 5, 2021న ఓ యువకుడు ఫుల్‌గా గంజాయి మత్తులో ఉండి బకింగ్‌హామ్ కెనాల్ దగ్గర ఉన్న ఓ ఇంటి తలుపు కొట్టాడు. ఆ ఇంట్లో ఉన్న మహిళ ఎవరోనని తలుపు తీసింది. ఆ యువకుడు ఆమెను చూసి ‘మీ ఇంట్లో పడుకుంటాను.. నన్ను లోపలికి రానివ్వండి’ అంటూ నానా యాగీ చేశాడు. అక్కడి నుంచి వెళ్లిపొమ్మనందుకు దౌర్జన్యానికి దిగి వారితో గొడవ పడ్డాడు. ఆ మహిళ అతనిని బయటకు గెంటేసి భయంతో భర్తకు, ఇరుగుపొరుగు వారికి ఫోన్ చేసింది. బయటకు వెళ్లిన భర్త భార్య ఫోన్‌తో కంగారు పడి వచ్చేసరికి ఆ యువకుడు అప్పటికీ ఇంటి ముందే నిల్చుని రచ్చ చేస్తున్నాడు. ఆ యువకుడిని స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు. ఇలా తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నా పోలీసులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గంజాయికి బానిసైన వాళ్లు ఎవరో ఒకరి ప్రాణం తీసేంత వరకూ ఇలాగే వ్యవహరిస్తుంటారేమో అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా గంజాయి బ్యాచ్ ఆట కట్టించాలని కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amaravathi, Crime news, Guntur, Tadepalli, Vijayawada