అతను ఫంక్షన్లకు ఫ్లవర్ డెకరేషన్ చేసే వ్యక్తి. సొంత భూమి లేదు. అయితేనేమి కౌలుకు భూమి తీసుకున్నాడు. ఓ రైతు గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందాడు. అందరు రైతుల కంటే భిన్నంగా ఆలోచించాడు. ఎన్నో దేశీ వరి వంగడాలను ఏక కాలంలో నాటి తన ప్రత్యేకతను చాటుకున్నాడు ఆ యువ రైతు. అతనే సింగరాయకొండ మండలం పాకల గ్రామానికి చెందిన షేక్.సుభాని.
తండ్రి సూచనతో...యూట్యూబ్ లో శోధన చేశాడు. తన తండ్రి నాయబ్ రసూల్ వయసు రీత్యా వ్యవసాయంలో రాణించలేక పోగా, సుభాని వ్యవసాయంలో రాణించాలని అనుకున్నాడు. అయితే సహజ సిద్ధ ఎరువులను వాడి , పర్యావరణ పరిరక్షణ తో పాటు , రసాయనాలు వాడని ఆహార ధాన్యాలు పండించాలని అతని కోరిక. యూట్యూబ్ ను మార్గదర్శకంగా మార్చుకొని శోధించాడు. ఇక ఏముంది ఎన్నో, ఎన్నెన్నో సేంద్రియ వ్యవసాయ పద్దతులను తెలుసుకున్నాడు. అలాగే పూర్వపు దేశీ వాళి వరి మొక్కల ప్రాముఖ్యతను తెలుసుకొని ఆచరణలో పెట్టాడు.
అమృత గుళికళ్లలాంటి35రకాల దేశివాళి వరి వంగడాలు:
పూర్వపు వరి వంగడాల పై శోధించిన రైతు సుభాని , అమృత గుళికల్లాంటి దేశీవాళి వరి వంగడాలు నాటాలని 2019 లో అనుకున్నాడు. నాలుగున్నర ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని మొదటగా 46 రకాల వరి వంగడాలు నాటాడు. 2020 లో 45 రకాలు, 2021 లో 50 రకాలు, 2022 లో 35 రకాల వరినాటాడు. అయితే ఆయకట్టు భూమి కావడంతో ఏడాదికి ఓ సారి మాత్రమే వరి వంగడాల సాగుకు ఉపక్రమించాడు. అయితే ఈ వరి రకాల విత్తనాలను తంజావూరు, కేరళ , కర్ణాటక , మహారాష్ట్ర , ఉత్తరప్రదేశ్ , పలు రాష్ట్రాల నుండి తీసుకురావడం నాటే పద్ధతిని సీనియర్ రైతుల సలహాలతో ఆచరణలో ఉంచాడు.
సుభాని నాటే కొన్ని దేశీ వాళి వరి వంగడాలు
రైతు సుభాని నాటే ప్రతి వరి రకానికి ఒక ప్రత్యేకత ఉంది. శ్రీ కృష్ణదేవరాయలు స్వతహాగా అత్యంత ఇష్టపడి తినే బహురూపి వరి ధాన్యాన్ని సైతం పండిస్తున్నాడు. 6అడుగుల మొక్కలైన ఈ బహురూపి మొక్కలతో తన పంట కే అందమట. అలాగే నారు పోసే సమయం నుండి కోత వరకు 5రకాల రంగులు మారే పంచరత్న అనే వరి రకాన్ని సైతం సాగు చేస్తున్నాడు. ఇలా ఇతను సాగు చేసే కొన్ని వరి రకాలు ఇవే:నవారా, బహురూపి, కాలబట్టి, బంగారు కడ్డీ, కోతాంబరి, ఖజూర్ చున్నీ, చిన్నార్, గంగా రూబీ రైస్, కర్పూకవని, చిట్టి ముత్యాలు, పంచరత్న, గోదావరి ఇసుకలు, తులసి బాస్మతి, చికిలా కోయిల, గోవింద బోగ్, మైసూర్ మలిక, ఇంద్రాణి, ఇల్లపు సాంబ ఇలా ఎన్నో రకాలు.
ఇంట్లోనే సహజ సిద్ధ ఎరువుల తయారీ
వ్యవసాయంలో సేంద్రీయ ఎరువుల తో రాణించాలనుకున్న సుభాని, తన భార్య మునీరా తో కలిసి ఇంట్లోనే సహజ సిద్ధ ఎరువుల తయారీకి శ్రీకారం చుట్టాడు. 7రకాల ధాన్యాలతో కలిపి సప్త ధాన్యాంకుర కషాయం, సివిఆర్ పద్దతిలో కంకర డస్ట్, పంచగవ్య, ఇలా పలు రకాల ఎరువును సహజ సిద్ధంగా తయారు చేసి పంటకు అందించసాగాడు. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధించవచ్చు అని చెప్పేందుకు సహజ సిద్ధ ఎరువులే ఉదాహరణ అంటూ రైతు సుభాని తెలిపారు.సుభాని ఆయకట్టు భూమిలో వరి వంగడాలు సాగు చేస్తుండగా, ప్రతి ఏడాది అక్టోబర్ లో వరి విత్తనాలతో నారు పోస్తారు. తాను నాటే అన్ని రకాల వరి విత్తనాలు 100 నుండి 140 రోజుల పంటలుగా , తెలిపిన ఈ యువరైతు మార్చి నాటికి పంట కొత్త చేస్తానని తెలిపాడు.
ప్రకృతి వ్యవసాయంలో మక్కువ ఉంటే చాలు ఆదాయం అదే వస్తుంది అని చెప్పేందుకు ఉదాహరణ రైతు సుభాని. కేవలం ఒకటిన్నర ఎకరం భూమిలో 35 రకాల వరి రకాలు సాగు చేసినందుకు తనకు విత్తనాల కొనుగోలు తో కలిపి రూ.20వేల ఖర్చు వస్తుందని, ఏడాదికి రూ.80వేల ఆదాయం వస్తుందని తెలిపారు ఈ యూట్యూబ్ రైతు. తాను పండించిన దేశీవాళి వరి ధాన్యపు కొనుగోళ్లు ఇప్పుడిప్పుడే ఆదరణ దొరుకుతుందన్నారు రైతు సుభాని. అయితే తాను నారు పోసిన సమయంలో కొందరు రైతులు వరి మొక్కలు సైతం తీసుకెళ్తున్నారట. అలాగే పంట చేతికి వచ్చిన కాలంలో ఎక్కువగా యోగ సెంటర్ శిక్షకులు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు తన వద్ద దేశీవాళి రకాల ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారని రైతు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cultivation, Guntur, Local News