Andhra Pradesh: ప్రైవేట్ ఆస్పత్రులపై ప్రభుత్వం పట్టుకోల్పోతోందా..? కరోనా పేరుతో బ్లాక్ మెయిలింగ్ దందా..

ప్రతీకాత్మక చిత్రం

ఏపీలో కరోనా వైరస్ (Corona Virus) విజృంభిస్తున్న వేళ.. రాష్ట్రంలో ప్రైవేట్ ఆస్పత్రుల (Private Hospitals) ఆగడాలు శ్రుతిమించిపోతున్నాయి. దీంతో ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి.

 • Share this:
  ఆంధ్రప్రదేశ్ ను కరోనా మహమ్మారి వణికిస్తోంది. ఓ వైపు కఠిన కర్ఫ్యూ అమలు చేస్తున్నా వైరస్ వ్యాప్తి ఏ మాత్రం కంట్రోల్ కావడం లేదు. రోజు రోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. రోజువారీ కేసుల సంఖ్య 20వేలకు తగ్గడం లేదు. అలాగే మరణాలు సైతం ప్రతి రోజూ 100 దాటడం కలవరపడేలా చేస్తోంది. కరోనా సోకిన తర్వాత బెడ్లు దొరకని పరిస్థితి చాలా చోట్ల నెలకొంది. రాష్ట్రంలో బెడ్ల కొరతను నివారించటానికి ప్రభుత్వం ప్రవేట్ హాస్పిటలస్ కు తాత్కాలిక ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ అనుమతితో పాటు కరోనా చికిత్స కు అనుమతిస్తున్నారు. అనుమతి పొందిన వైద్యశాలలకు ప్రాణవాయువుతో పాటు రెమిడీసెవెర్ ఇంజెక్షన్స్ వారి వద్ద ఉన్న బెడ్ల సంఖ్యను బట్టి సరఫరా చేస్తున్నారు. అయినా కొన్ని ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు కాసుల కక్కుర్తితో రెమిడీసెవిర్ ను బ్లాక్ మార్కెట్లో భారీ ధరలకు విక్రయిస్తూ సొమ్ముచేసుకుంటున్నారు. అంతే కాకుండా ఆరోగ్యశ్రీలో వైద్యం చేయమంటే చేయలేమంటూ రోగులను కాసులకు వేధిస్తున్న ఘటనలు కోకొల్లలు.

  ఐతే గుంటూరు జిల్లాలోని ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కరోనా వైద్య సేవలు అందించని ఆసుపత్రులకు కరోనా ట్రీట్మెంట్ అనుమతులను రద్దు చేస్తున్నట్లు ఇటీవల జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ ఉత్తర్వులు జారీ చేశారు. గుంటూరు జిల్లాలోని మహాత్మాగాంధీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ (నరసరావుపేట), వికాస్ హాస్పిటల్ (పిడుగురాళ్ల), లైఫ్ లైన్ హాస్పిటల్(నరసరావుపేట) షోరెడ్డి మెమోరియల్ హాస్పిటల్ (వినుకొండ), రాజరాజేశ్వరి హాస్పిటల్ (గుంటూరు) ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ అనుమతులు ఉన్నప్పటికీ కరోనా వైద్య సేవలందించిన కుండా బాధితులను ఆర్థికంగా ఇబ్బందులు పెడుతున్నారని సమాచారం మేరకు చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ హాస్పిటల్స్ లో కరోనా ట్రీట్మెంట్ అనుమతులను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ స్పష్టం చేశారు.

  రద్దు ఉత్తర్వులు జారీ చేసిన రోజే తాత్కాలిక అనుమతులు పొందిన గుంటూరు జిల్లాలోని కొన్ని ఆస్పత్రులు తాము కరోనా వైద్యం చేయలేమని మా వద్ద సరైన సౌకర్యాలు, వైద్య పరికరాలు లేవని అలాగే అనుభవజ్ఞులైన వైద్య సిబ్బంది లేరనే సాకుతో మా అనుమతులు రద్దు చేయమని కోరటం విస్మయానికి గురిచేస్తోంది. అసలు ఈ ఘటనతో ప్రవేటు వైద్యశాలలు ప్రభుత్వానికి అల్టిమేటమ్ పంపాయనుకోవాలా..? లేక మా కాసుల దాహానికి అడ్డుపడుతున్నారని బెదిరిస్తున్నాయా..? అనేది చర్చనీయాంశమైంది.

  పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలోని ప్రవేటు వైద్యశాలలపై ప్రభుత్వము పట్టు కోల్పోయిందంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. పక్క రాష్ట్రమైన తమిళనాడులో అధికారం చేపట్టిన సీఎం స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కరోనా నియంత్రణకు ప్రవేట్ వైద్యశాలలను ప్రభుత్వ అధికారంలోకి తీసుకొని బాధితులకు బెడ్లు కేటాయించారు. ఏపీలో కూడా ఇదే విధంగా ప్రభుత్వం ముందడుగేసి ప్రైవేట్ ఆస్పత్రుల ఆగడాలను అరికట్టాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.

  Anna Raghu, Guntur Correspondent, News18
  Published by:Nagesh Paina
  First published: