Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati
Money Saving Tips: ఇప్పటికే వేసవి తాపం మొదలైంది. మాడు పగిలే ఎండలు భయపెడుతున్నాయి. వేసవి వచ్చింది అంటే.. విద్యుత్ వినియోగం కూడా గరిష్ఠ స్థాయికి పెరుగుతుంది. ముఖ్యంగా పీక్ అవర్స్ లో వినియోగం మరింత ఎక్కువగా ఉంటుంది. అందులోనూ గతంతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో విద్యుత్ బిల్లులు (Electricity Bills) కూడా పెరిగాయి. దీంతో ఇప్పటికే బిల్లులు పెరిగిపోతున్నాయని.. వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వినియోగదారులు కూడా విద్యుత్ పొదుపు చేస్తే పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది. అంతేకాదు విద్యుత్ బిల్లులు తగ్గడమే కాదు, కరెంటు కోతల (Power Cuts) నుంచి కూడా బయట పడొచ్చు అంటున్నారు నిపుణులు. విద్యుత్ ఆదా చేయాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. ఈ సింపిల్ టిప్స్ (Simple Tips) పాటిస్తే.. కచ్చితంగా బిల్లులో సగానికి సగం తగ్గుతుంది అంటున్నారు.
విద్యుత్ పరికరాలను ఇలా వాడుకోవాలి
ఏసీ ఉపయోగించే వారు ఉష్ణోగ్రత 1 డిగ్రీ తగ్గిస్తే కరెంటు వినియోగం 6 శాతం ఆదా చేసుకోవచ్చు. 24 డిగ్రీల వద్ద ఏసీ పెట్టుకుంటే కరెంటు బాగా ఆదా అవుతుంది. దీని వల్ల విద్యుత్ వినియోగం 24 శాతం ఆదా అవుతుంది. ఇంట్లోకి నేరుగా ఎండ రాకుండా కర్టెన్లు, బాల్కనీల్లో మొక్కలు పెంచుకుంటే ఏపీపై భారం తగ్గి, కరెంటు వినియోగం దిగివస్తుంది.
ఇక వాషింగ్ మిషన్ వాడే వారు లోడ్ కు తగ్గట్టుగా... బట్టలు వేయాలి. అందరూ ఎల్ ఈ డీ బల్బులు వినియోగించుకోవాలి. దీని వల్ల కరెంటు వినియోగం బాగా తగ్గుతుంది. అవసరం అయిన గదిలో మాత్రమే లైట్ వేసుకోవాలి. వేసవిలో ఫ్రిజ్ వినియోగం కూడా ఎక్కువగా ఉంటుంది. పదే పదే ఫ్రిజ్ డోర్ తీయడం వల్ల కరెంటు వినియోగం పెరుగుతుంది. సాధ్యమైనన్ని తక్కువసార్లు ఫ్రిజ్ డోర్ ఓపెన్ చేసుకోవాలి.
ఇదీ చదవండి : ఏపీలో వేసవి సెలవులు ఎప్పటి నుంచి.. ఎన్ని రోజులు ఇస్తున్నారో తెలుసా..?
నిపుణుల సూచనలు పాటించండి..
పగటి పూట ఎట్టి పరిస్థితుల్లో లైట్లు వేయవద్దు. వేసవిలో చీకటి పడే సమయం, ఉదయం వెలుతురు వచ్చే సమయాలకు అనుగుణంగా బయట లైట్లు వేసుకోవాలి. ఎక్కడ ఉంటారో అక్కడ లైట్లు, ఫ్యాన్లు మాత్రమే వేసుకోవాలి. కరెంటు కుక్కర్లు పక్కనపెట్టి, ప్రెషర్ కుక్కర్లు వినియోగించుకోవాలి. గీజర్ ఆన్ చేసి ఒకరి తరవాత ఒకరు అందరూ స్నానం చేయాలి. అలా కాకుండా గంటకు ఒకరు స్నానం చేస్తే కరెంటు బిల్లు పెరుగుతుంది.
ఇదీ చదవండి : నవంబర్ లోనే ఏపీ ఎన్నికలు.. సీఎం జగన్ ఢిల్లీ పర్యటన అందుకేనా..?
ఫైవ్ స్టార్ రేటింగ్ తప్పనిసరి..
ఏసీలు తక్కువ ధరకు వస్తున్నాయని ఏవి పడితే అవి కొనుగోలు చేయవద్దు. దీని వల్ల కరెంటు వినియోగం పెరిగిపోతుంది. విద్యుత్ వినియోగం తగ్గించే స్టార్ రేటింగ్ ఉన్న మంచి పేరున్న కంపెనీల ఏసీలు కొనుగోలు చేసుకోవాలి. ఇక ఫ్యాన్లు కూడా నాణ్యమైనవి ఉపయోగించుకోవాలి. తక్కువ ధరకు వచ్చే ఫ్యాన్లు ఎక్కవ కరెంటు వినియోగించుకుంటాయి. పేరున్న కంపెనీల స్టార్ రేటింగ్ ఉన్న ఫ్యాన్లు తీసుకుంటే కరెంటు వినియోగం తగ్గుతుంది. ఇక విండోలకు మ్యాట్లు వేసుకుని తడుపుతూ ఉంటే గాలి చల్లగా వస్తుంది. ఇంటికి ఎర్తింగ్ సరిగా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. దీని వల్ల కూడా విద్యుత్ ఆదా అవుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Current bill