GUNTUR BANK EMPLOYEES THEFT GOLD BELONGS TO CUSTOMERS IN BANK OF BARODA BRANCH BAPATLA GUNTUR DISTRICT FULL DETAILS HERE PRN GNT
Bank Fraud: బ్యాంకులో బంగారం తాకట్టు పెడుతున్నారా..? అయితే జాగ్రత్త..
ప్రతీకాత్మకచిత్రం
Bank of Baroda: బ్యాంక్ లో బంగారం (Gold Loan) తాకట్టుపెట్టిన కస్టమర్లకు అదే బ్యాంకు ఉద్యోగులు షాకిచ్చారు. సిబ్బంది కుమ్మక్కై బంగారాన్ని పక్కదారి పట్టించారు.
Bank of Baroda: కరోనా కారణంగా అన్ని రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వైరస్ కారణంగా ఉద్యోగాలు పోవడం, వ్యాపారాల్లో నష్టాలు రావడంతో మధ్య తరగతి ప్రజలు కష్టాల్లో కూరుకుపోయారు. చాలా మంది అప్పులపాలయ్యారు. ఇదే సమయంలో తమ దగ్గరున్న బంగారాన్ని బ్యాంకుల్లో తాకట్టుపెట్టి డబ్బులు తీసుకున్నారు కొందరు. బ్యాంకుల్లో బంగారం పెడితే తమ సొత్తుకు భరోసా ఉంటుందని ప్రతి ఒక్కరూ భావిస్తారు. ప్రైవేట్ వ్యక్తులకంటే బ్యాంకులే సేఫ్ అని నమ్ముతారు. కానీ ఓ బ్యాంక్ లో బంగారం తాకట్టుపెట్టిన కస్టమర్లకు అదే బ్యాంకు ఉద్యోగులు షాకిచ్చారు. సిబ్బంది కుమ్మక్కై బంగారాన్ని పక్కదారి పట్టించారు. ఖాతాదారుల నమ్మకాన్ని వమ్ము చేస్తూ వారిని ముంచడమే కాకుండా బ్యాంక్ పరువును పోలీస్ స్టేషన్ పాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని గుంటూరు జిల్లా (Guntur District) బాపట్లలో జరిగిందీ గోల్డ్ స్కామ్.
వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లా బాపట్ల బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroa) బ్రాంచ్ లో చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన కొంతమంది తమ బంగారాన్ని తాకట్టుపెట్టి రుణం తీసుకున్నారు. కొంతకాలం తర్వాత గోల్డ్ లోన్ (Gold Loan) తిరిగి చెల్లించి తమ బంగారాన్ని విడిపించుకునేందుకు వచ్చారు. కానీ వారికి ఊహించని షాక్ తగిలింది. బ్యాంకులో పెట్టిన బంగారం మాయమైంది. లక్షకాదు రెండు లక్షలు కాదు ఏకంగా రెండు కోట్ల రూపాయలు విలువ చేసే బంగారానికి రెక్కలొచ్చాయి. బ్యాంకులో దొంగల దోపిడీ జరగకుండానే బంగారం మాయమైంది. బంగారం మాయంపై ఆరా తీయగా... ఇది ఇంటి దొంగలపనేని తేలింది.
బ్యాంకులో పనిచేసే అటెండర్ ఈ మొత్తం వ్యవహారానికి సూత్రధారిగా తెలుస్తోంది. అతడే విడతల వారీగా బంగారాన్ని బ్యాంకు దాటించినట్లు ప్రాధమిక విచారణలో తేలింది. అతడికి బ్యాంకులో పనిచేసే ఇద్దరు ఉద్యోగులు సహకరించినట్లు సమాచారం. బంగారు ఆభరణాలు మాయమైన వ్యవహారంపై బ్యాంక్ ఆఫ్ బరోడా రీజనల్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడికి సహకరించిన వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. ప్రస్తుతం అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితుడు క్రికెట్ బెట్టింగులో డబ్బులు పొగొట్టుకొని అప్పులపాలయ్యాడని.. వాటి నుంచి బయటపడేందుకు బంగారాన్ని దొంగిలించినట్లు అనుమానిస్తున్నారు. దొంగిలించిన బంగారాన్ని బంగారంపై రుణాలిచ్చే ప్రైవేట్ సంస్థల్లో తాకట్టుపెట్టినట్లు తెలుస్తోంది.
ఇటీవల చిత్తూరు జిల్లా కలికిరి బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్ లోనూ గోల్ మాల్ వ్యవహారం వెలుగు చూసింది. డ్వాక్రా గ్రూపులకు చెందిన డిపాజిట్లను బ్యాంకులో మెసెంజర్ గా పనిచేసే వ్యక్తి స్వాహా చేశాడు. కొన్నేళ్లుగా బ్యాంకులో పనిచేస్తున్న అతడు.. బ్యాంక్ లావాదేవీలకు సంబంధించిన ఐడీ, పాస్ వర్డ్ సంపాదించి నిధులను స్వాహా చేశాడు. ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఉన్నతాధికారుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఇందులో ఇతర సిబ్బంది పాత్రకూడా ఉన్నట్లు నిర్ధారించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.