• HOME
  • »
  • NEWS
  • »
  • ANDHRA-PRADESH
  • »
  • GUNTUR AP HIGH COURT ORDER TO CID POLICE TO DONT TAKE ANY ACTIONS CHANDRA BABU NAIDU ON AMARAVATHI LANDS CASE NGS

Andhra Pradesh: తిరుపతి ఉప ఎన్నికకు ముందు చంద్రబాబుకు బిగ్ రిలీఫ్

Andhra Pradesh: తిరుపతి ఉప ఎన్నికకు ముందు చంద్రబాబుకు బిగ్ రిలీఫ్

చంద్రబాబునాయుడు కు బిగ్ రిలీఫ్

వరుస షాక్ లతోతీవ్ర ఒత్తిడిలో ఉన్న టీడీపీకి.. తిరుపతి ఉప ఎన్నిక ముందు టీడీపీకి బిగ్ రిలీఫ్ లభించింది. చంద్రబాబుపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ పోలీసులను ఏపీ హైకోర్టు ఆదేశించింది.

  • Share this:
    తిరుపతి ఉప ఎన్నిక ముందు చంద్రబాబు నాయుడుకు భారీ ఊరట లభించింది. అమరావతి భూముల వ్యవహారంలో చంద్రబాబుపై గతంలోనే సీఐడీ విచారణపై హైకోర్టు స్టే విధించింది. సీఐడీ తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ ఏపీ హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా.. విచారణ జరిపిన హైకోర్టు అసైన్డ్ భూముల వ్యవహారంలో స్పష్టమైన ఆధారాలు ఉంటే చూపాలని సీఐడీని న్యాయమూర్తి కోరారు. ప్రాథమిక విచారణలో ఏం గుర్తించారని సీఐడీ అధికారులను హైకోర్టు ప్రశ్నించింది. విచారణ తొలిదశలోనే వివరాలు చెప్పలేమని సీఐడీ తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. పూర్తిస్థాయి విచారణకు అనుమతి ఇస్తే అన్ని విషయాలు తెలుస్తాయని అన్నారు. వారి వాధనతో ఏకీభవించని హైకోర్టు నాలుగు వారాల పాటు స్టే విధించింది.

    తాజాగా మరోసారి విచారణ చేసిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణపై దాఖలైన కేసులో ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సీఐడీ పోలీసులకు ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరో మూడు వారాల పాటు ఈ ఆదేశాలను పొడిగిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులపై వెంటనే కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ సీఐడీని హైకోర్ట్ ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు. దీంతో ఇప్పట్లో ఇటు చంద్రబాబుపై కానీ, అటు నారాయణపై కాని సీఐడీ విచారణ ప్రారంభించే అవకాశం లేదు.

    ఎస్సీ, ఎస్టీల దగ్గర బలవంతంగా భూములు లాక్కున్నారని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్ కే ఫిర్యాదుపై సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. చంద్రబాబుపై ఐపీసీ సెక్షన్ 166, 167, 217, 120 (బీ) రెడ్‌ విత్‌ 34, 35, 36, 37, ఎస్సీ, ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టంలోని సెక్షన్‌ 3(1), (ఎఫ్‌), (జీ), ఏపీ అసైన్డ్‌ భూముల బదిలీ నిరోధక చట్టంలోని సెక్షన్‌ 7 ప్రకారం కేసులు నమోదు చేశారు. ఈ కేసులో చంద్రబాబును ఏ1గా పేర్కొన్న సీఐడీ.. మాజీ మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణను ఏ2గా పేర్కొన్నారు. అలాగే కొంత మంది అధికారులు కూడా ఇందులో ఉన్నట్లు పొందుపరిచింది సీఐడీ.

    ప్రభుత్వం కావాలనే తమపై కక్ష కట్టిందని.. రాజకీయంగా వేధించాలనే కారణంతోనే అక్రమ కేసులు పెడుతోందని టీడీపీ నేతలు మండిపడ్డారు. దీంతో న్యాయ నిపుణులను సంప్రందిచిన చంద్రబాబు వెంటనే హైకోర్టులో క్వాష్  పిటిషన్ వేశారు. తాజాగా దానిపై మరోసారి విచారణ చేపట్టిన కోర్టు.. చంద్రబాబు, నారాయణలపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ సీఐడీ పోలీసులకు స్పష్టం చేసింది. దీంతో విచారణ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. సీఐడీ అధికారులు ఇచ్చే కౌంటర్ సమాధానం బట్టి కేసులో కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందన్నది ఆధారపడి ఉంటుంది. అయితే తిరుపతి ఉప ఎన్నిక ముందు కోర్టు ఆదేశాలు చంద్రబాబు నాయుడుకు ఊరటే అంటున్నారు ఆ పార్టీ నేతలు.
    Published by:Nagesh Paina
    First published:

    అగ్ర కథనాలు