YCP Politics: వచ్చే ఎన్నికల్లో 175కి 175 సీట్లు సాధించడమే తన లక్ష్యం అంటున్నారు వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy).. ఆ దిశగానే నేతలకు కీలక సూచనలు కూడా చేస్తున్నారు. కానీ క్షేత్రం స్థాయిలో పరిస్థితి సవ్యంగా ఉందా అంటే లేదనే సమాధానం వస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా.. ప్రస్తుతం బాపట్ల జిల్లాలోని చీరాల, పర్చూరు నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్దులు కరణం బలరాం.. ఏలూరి సాంబశివరావులు గెలిచారు. తర్వాత కరణం బలరాం వైసీపీకి మద్దతుగా నిలిచారు. ఆయన కుమారుడు కరణం వెంకటేష్ వైసీపీలో చేరారు. చీరాల వైసీపీ ఇంచార్జ్ గా కరణం వెంకటేష్ కు భాద్యతలు అప్పగించారు.. నియోజకవర్గంలో ఆయనే గడప గడపకు కార్యక్రమాన్ని నిర్వహించాలని సీఎం జగన్ స్పష్టం చేయటంతో వచ్చే ఎన్నికల్లో వెంకటేష్ చీరాల నుంచి పోటీ చేస్తారని ప్రచారం నడుస్తోంది.
ఇక 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున చీరాలలో పోటీ చేసిన ఆమంచి కృష్ణమోహన్ టీడీపీ అభ్యర్ది కరణం బలరాంపై ఓడారు. అయినా.. అధికారంలోకి రావటంతో చీరాలలో అన్నీ తానై నడిపించారు. కరణం చేరికతో పర్చూరులో పోటీ చేసేందుకు ఆమంచి సిద్ధంగా ఉండాలని అధినేత సంకేతాలు ఇచ్చారని తెలుస్తోంది. రాష్ర్టంలో ఎన్నికల వేడి మొదలు కావటంతో.. పర్చూరులో ఎమ్మెల్యే ఏలూరిను ఢీకొనాలంటే.. అందుకు ఆమంచే కరెక్ట్ అని భావిస్తున్నారట.
ఎందుకంటే పర్చూరు నియోజకవర్గంలోని చిన్నగంజాం, ఇంకొల్లు, పర్చూరు మండలాలతోపాటు మార్టూరు మండలంలో ఇప్పటికే ఆమంచికి అనుచరగణం ఉంది. ఇప్పటి వరకూ పర్చూరు ఇంచార్జ్ గా ఉన్న రావి రామనాధంబాబు అధిష్టానం ఏదో ఒక నిర్ణయం తీసుకునే వరకూ తన పని తాను చేసుకుపోదామన్న ఆలోచనలో ఉన్నారట. గత ఎన్నికల్లో కప్పదాటు వైఖరితో రావి చర్చల్లో ఉంటూ వచ్చారు. ఇటీవల వైసీపీ సీనియర్ నేత సజ్జలతో కూడా ఆమంచి భేటీ అయినట్టు తెలుస్తోంది.
ఇదీ చదవండి : ముంచుకొస్తున్న మరో తుఫాను భయం.. మూడు రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ
ఆ వెంటనే స్థానిక కేడర్, తన అనుచరులతో చర్చలు జరిపిన తరువాత.. పోటీకిసి సిద్ధమైనట్టు సమాచారం. దీంతో నేరుగా సీఎం జగన్‌ను కలిసి మాట్లాడారట. తాను పర్చూరు వెళ్లాలంటే బాలినేని శ్రీనివాసరెడ్డి తన సెగ్మెంట్‌లో వేలు పెట్టకూడదని కోరారట. ఏ విషయం ఉన్నా పార్టీ హైకమాండ్‌తో తాను నేరుగా టచ్‌లో ఉంటానని చెప్పారట ఆమంచి. ఇప్పటికే చీరాల వైసీపీలోకి కరణం బలరాంను తీసుకువచ్చి తనకు ఇబ్బందికర పరిణమాలను బాలినేనే సృష్టించారనే ఫీలింగ్‌లో ఆమంచి ఉన్నారట. అదే బాలినేని కనుసన్నలలో పనిచేయాలంటే భవిష్యత్‌పై భరోసా ఉండబోదనే అభిప్రాయం వ్యక్తం చేశారట. ఆ విషయంలో అధిష్టానం నుంచి సానుకూలంగానే స్పందన వచ్చినట్టు సమాచారం.
ఆ తరువాతే.. బాలినేని శ్రీనివాసరెడ్డికి ప్రకాశం , బాపట్ల జిల్లాల భాద్యతలు తొలగించి తిరుపతి , కడప కేటాయించటంతో ఆమంచి పర్చూరు నియోజకవర్గ బాధ్యతలు తీసుకోవడం లాంచన ప్రాయమేనని తెలుస్తోంది. అయితే ఆమంచి పర్చూరుకు వెళితే బలరాం సహకారం.. ఆమంచి చాణక్యంతో రెండు నియోజకవర్గాల్లో పార్టీ పట్టు పెంచుకోవచ్చునని అంచనా వేస్తుందట వైసీపీ అధిష్టానం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, AP Politics