ఓ ఆటో డ్రైవర్ పాడుపనికి యత్నించాడు. అతని స్నేహితుడితో కలిసి ఓ యువతిపై లైంగిక దాడికి యత్నించాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. మంగళగిరిలో నివాసం ఉంటున్న ఓ యువతి గుంటూరులోని ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తోంది. శుక్రవారం ఆస్పత్రిలో నైట్ డ్యూటీ ఉండటంతో.. రాత్రి 7 గంటల సమయంలో మంగళగిరి నుంచి తాను పనిచేస్తున్న ఆస్పత్రికి బయలుదేరింది. ఇందుకోసం ఓ ఆటోను ఆశ్రయించింది. ఆ ఆటోలో ఉన్న వ్యక్తి.. పట్టణంలో ఆటోనగర్‌లో దిగిపోయాడు. దీంతో ఆటోలో డ్రైవర్‌తో పాటు యువతి మాత్రమే ఉన్నారు. అక్కడే ఆటో డ్రైవర్ తనలోని పాడుబుద్దిని బయటపెట్టాడు. యువతిపై లైంగిక దాడి చేసేందుకు ప్లాన్ వేశాడు.
ఆటో చినకాకాని గ్రామం వద్దకు చేరేసరికి.. సర్వీస్ రోడ్డులో చీకట్లో ఆటోను ఆపాడు. దీంతో యువతి ఇక్కడేందుకు ఆటో ఆపావని డ్రైవర్‌ను అడిగింది. అందుకు ఆటో డ్రైవర్ వెనకాల ప్రయాణికులు వస్తున్నారని చెప్పాడు. కాసేపటికే అక్కడ నిలిపి ఉన్న ఆటో వద్దకు మరో యువకుడు చేరుకున్నారు. దీంతో అనుమానపడిన.. యువతి ఏదో తేడాగా ఉందని కేకలు వేసింది. యువతి కేకలు వేయడంతో.. ఆటో డ్రైవర్, అతడి స్నేహితుడు ఆమె నోరు నొక్కి, కాళ్లు చేతులు పట్టుకుని ఆటోలోకి నెట్టారు. యువతి మెడలోని బంగారు గొలుసును లాగిపడేసి.. యువతిపై లైంగిక దాడికి యత్నించారు.
దీంతో వారిని ప్రతిఘటించిన యువతి.. మరింత గట్టిగా కేకలు వేయడం ప్రారంభించింది. దీంతో అటుగా బైక్‌పై వెళ్తున్న ఇద్దరికి అనుమానం వచ్చి.. ఆటో వద్దకు రావడంతో డ్రైవర్‌తో పాటు, అతని స్నేహితుడు పరారయ్యారు. అనంతరం బాధిత యువతి నేరుగా మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుంది. ఇందుకు ఆటో వద్దకు వచ్చినవారు సహాయం చేశారు. ఇక, బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.