Vizianagaram Collector: ఆమె జిల్లాలో అత్యున్నత అధికారి.. ఆమెకు ఉండే హోదా గుర్తింపు వేరు.. జిల్లా ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను చేరవేయడం, సుపరిపాలన అందించడం ద్వారా ఉన్నతాధికారిగా మన్ననలు పొందారు. అంతేకాదు ఇప్పుడు మానవత్వం ఉన్న మహిళగా ముద్ర వేసుకున్నారు. నతకెందుకులే అనుకోకుండా మానవత్వంతో సాటి మనిషికి సకాలంలో సహాయం అందించడంతో ఓ వ్యక్తి ప్రాణం నిలబడింది. జిల్లా కలెక్టర్ సూర్యకుమారి అధికారిక పనిపై బయటకు వెళ్తున్న సమయంలో రోడ్డు ప్రమాదానికి గురై.. పక్కనే రక్తపు మడుగులో పడి వున్న ఓ వ్యక్తిని తన వెంట వున్న అధికారి వాహనంలో జిల్లా ఆసుపత్రికి పంపించి, ఆ వ్యక్తికి తక్షణ వైద్య సహాయం అందించి ఆ వ్యక్తి ప్రాణాన్ని కాపాడారు జిల్లా కలెక్టర్ సూర్యకుమారి.
జిల్లా కలెక్టర్ ఆదేశాలతో తక్షణం రంగంలోకి దిగి ఆ వ్యక్తికి అన్ని వైద్య పరీక్షలు జరిపి ప్రాథమిక చికిత్స అందించడంతో పాటు మెరుగైన వైద్య సహాయం కోసం విశాఖలోని కేజీహెచ్ కు పంపించారు జిల్లా ఆసుపత్రి వైద్యులు. దీంతో ఆ వ్యక్తి ప్రస్తుతం కోలుకోని ఆదివారం మధ్యాహ్నానికి ప్రాణాపాయ స్థితి నుంచి ఆహరం తీసుకొనే పరిస్థితికి చేరుకున్నాడు. దీంతో వైద్యులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.
నెల్లిమర్ల మండలం వేణుగోపాలపురం గ్రామానికి చెందిన 30 ఏళ్ల బి.అప్పారావు అనే వ్యక్తి.. తన ద్విచక్ర వాహనంపై వెళ్తూ నెల్లిమర్ల నుంచి గాజులరేగ, జె.ఎన్.టి.యు. జంక్షన్‌కు వెళ్లే మార్గంలో ప్రమాదానికి గురయ్యారు. అదే రోజు మధ్యాహ్నం చీపురుపల్లిలో ఫించనుల పంపిణీ కార్యక్రమానికి హాజరై తిరిగి విజయనగరం వస్తున్న జిల్లా కలెక్టర్ సూర్యకుమారి రోడ్డు పక్కన ఓ వ్యక్తి రక్తపు మడుగులో పడి వుండటాన్ని గుర్తించారు.
వెంటనే తన కారు ఆపి 108 వాహనంలో ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించేందుకు ఫోన్ చేశారు. అయితే ఆ వాహనం వచ్చేందుకు కొంత ఆలస్యమవుతుందని గుర్తించి తన వెనకే వస్తున్న విజయనగరం ఆర్డీఓ భవానీ శంకర్ అధికారిక వాహనంలో ఆ వ్యక్తిని జిల్లా కేంద్ర ఆసుపత్రికి మధ్యాహ్నం 2-15 గంటల ప్రాంతంలో తరలించారు. వెంటనే జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డా.నాగభూషణరావుకు ఫోన్ చేసి ఒక వ్యక్తిని కారులో ఆసుపత్రికి పంపిస్తున్న విషయాన్ని తెలియజేసి ఆ వ్యక్తికి అత్యవసర చికిత్స అందించాల్సిందిగా కలెక్టర్ తెలిపారు.
ఆ సమయానికి ఆసుపత్రిలోనే వున్న డీసీహెచ్‌ఎస్ డా.నాగభూషణరావు ఇతర వైద్యులను, సిబ్బందిని సిద్దం చేసి ఆసుపత్రిలో ఆ వ్యక్తిని చేర్పించిన వెంటనే అవసరమైన వైద్య పరీక్షలు చేసి, చికిత్స అందించారు పల్స్ సాధారణంగానే ఉన్నప్పటికీ అపస్మారక స్థితిలో వుండటంతో బ్రెయిన్ కు సంబంధించిన చికిత్స కోసం తక్షణం కేజీహెచ్ కు తరలించారు.
కేజీహెచ్ కు తరలించి అక్కడి వైద్యులతో మాట్లాడారు. సాయంత్రానికి ఆ వ్యక్తిని విశాఖకు తరలించి చికిత్స అందించగా ఆ వ్యక్తి ప్రస్తుతం అపస్మారక స్థితి నుంచి బయటపడి ఆహారం తీసుకుంటున్నాడు. ఆ వ్యక్తికి ప్రమాదంలో దవడ ఎముక విరిగినట్లు కేజీహెచ్ వైద్యులు గుర్తించారని, త్వరలోనే చికిత్స చేస్తారని తెలిపారు. ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారని, కేవలం గోల్డెన్ అవర్‌లో చికిత్స అందించడం వల్లే రక్తస్రావాన్ని నివారించి సకాలంలో చికిత్స అందించి ఆ వ్యక్తి ప్రాణాన్ని కాపాడగలిగామని డి.సి.హెచ్.ఎస్. పేర్కొన్నారు.
సమాజంలో బాధ్యతగల ఓ వ్యక్తిగా తోటి మనిషికి సహాయం అందించాలనే ప్రయత్నం చేయడంతోపాటు, ప్రభుత్వ ఉన్నతాధికారిగా తనకున్న అధికారాలను వినియోగించి ఒక పౌరుని ప్రాణాన్ని కాపాడటంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి సూర్యకుమారి చూపిన చొరవను వైద్య వర్గాలు, ఇతరులు అభినందిస్తున్నారు. బాధిత కుటుంబ సభ్యులు బందువుల, గ్రామస్థులు మీరు సూపర్ కలెక్టరమ్మ అని పొగడత్తలు కురిపిస్తన్నారు..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Road accident, Vizianagaram