అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో వంటనూనెల ధరలు (Cooking Oil Price) అమాంతం పెరిగిపోయాయి. వినియోగదారులు అమ్మో అనేంతలా ధరల మోత మోగుతోంది. అయితే పెరిగిన వంటనూనెల ధరల సెగ నుంచి ఇప్పుడిప్పుడే సామాన్యులకు ఊరట లభిస్తోంది. వంట నూనెల ధరలను అందుబాటులో ఉంచేలా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం రైతుబజార్లు, మున్సిపల్ మార్కెట్లలో విజయ బ్రాండ్ ఔట్‌లెట్ల పేరుతో చేపట్టిన విక్రయాలకు మంచి ఆదరణ లభిస్తోంది. దీంతో ఫిబ్రవరి 12నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వ ఔట్‌లెట్లలో.. లక్ష లీటర్ల వంట నూనె విక్రయాలు జరగడం విశేషం. మరోవైపు డిమాండ్‌కు అనుగుణంగా మున్సిపల్ కార్పొరేషన్లు, 2వేల జనాభాపైడిన పంచాయతీల్లోనూ స్వయం సహాయక సంఘాల ద్వారా విజయ నూనెల విక్రయానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇదే గనక జరిగితే మరికొన్ని రోజుల పాటు వంటనూనెలు ఎమ్మార్పీ కంటే తక్కువ ధరకే ప్రజలకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది.
అంతర్జాతీయంగా తలెత్తిన పరిణామాల నేపథ్యంలో వంట నూనెల ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో నూనెల దిగుమతులపై తీవ్ర ప్రభావం పడింది. ఈ క్రమంలో వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి డిమాండ్ సొమ్ము చేసుకోకుండా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో ఏర్పాటైన ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఇప్పటి వరకు తనిఖీల్లో నిత్యావసరాల చట్టం ప్రకారం (6ఏ) 76 కేసులు నమోదు చేసింది. 22.59 లక్షల లీటర్ల నూనెను సీజ్ చేసింది. వీటిల్లో కేసులు పరిష్కరించిన వాటిని మార్కెట్‌లోకి విడుదల చేయగా.., మిగిలిన వాటిని ప్రభుత్వ నూనె కేంద్రాల్లో విక్రయానికి అందుబాటులో ఉంచారు.
దీంతో పెరిగిన ధరల నుంచి సామాన్యులకు కాస్త ఊరట లభిస్తోంది. మరోవైపు మార్కెట్‌లో ప్రజల అవసరాలకు అనుగుణంగా సన్‌ఫ్లవర్ స్థానంలో సోయాబీన్, రైస్‌బ్రాన్ నూనె అమ్మకాలను చేపట్టేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. నూనెల ధరల సెగ నుంచి సామాన్యులు, మధ్య తరగతి ప్రజలకు ఊరట కల్పించేలా.., ఆయిల్ రిఫైనరీస్, ఉత్పత్తి, సరఫరాదారులు, చాంబర్ ఆఫ్ కామర్స్ తో సమావేశాలు నిర్వహించి తక్కువ ధరలకు నూనెలు విక్రయించేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలోనే వంట నూనెల ధరలు చాలా వరకు అదుపులోకి వస్తున్నాయి.
వంట నూనెల భారం ప్రజలపై పడకుండా ఉండేందుకు విజయ ఆయిల్ పేరుతో విక్రయాలు చేపట్టినట్లు ఏపీ ఆయిల్ ఫెడ్ ఎండీ చవల బాబూరావు తెలిపారు. మార్కెట్ ధరలతో పోలిస్తే విజయ ఆయిల్స్ ధరలు తక్కువగా ఉండడంతో మంచి ఆదరణ లభిస్తోందని...విక్రయాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు నిల్వలను సిద్ధం చేసుకుంటున్నామని వెల్లడించారు. మరోవైపు వంట నూనెల ఎగుమతులు, దిగుమతులపై తీవ్ర ప్రభావం నెలకొన్న నేపథ్యంలో... మన దగ్గర నిల్వలను సక్రమంగా వినియోగించుకుంటూనే విదేశాల నుంచి దిగుమతయ్యే నూనెల స్థానంలో ప్రత్యామ్నాయాలను ప్రోత్సహిస్తున్నామని ఎప్పటికప్పుడు మార్కెట్ ధరలను సమీక్షిస్తూ అవసరానికి అనుగుణంగా చర్యలు చేపడుతున్నామని పౌరసరఫరాల శాఖ కమిషనర్ గిరిజా శంకర్ పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Cooking oil