ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh) తాను అనుకున్న పనిని విజయవంతంగా పూర్తి చేసింది. ఏపీలో సినిమా టికెట్లను (AP Movie Tickets Issue) ప్రభుత్వం ఆధ్వర్యంలోనే విక్రయించాలన్న నిర్ణయానికి చట్టబద్ధత కల్పించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ సినిమా నియంత్రణ చట్టసవరణ బిల్లు-2021ని అసెంబ్లీ ఆమోదించింది. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM YS Jagan Mohan Reddy) తరపున... రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కొందరు సినిమా షోలను ఇష్టానుసారంగా వేస్తున్నారు. అంతేకాకుండా స్పెషల్ షోల పేరుతో టికెట్ రేట్లు భారీగా పెంచేస్తున్నారని ఇలాంటి వాటిపై నియంత్రణ తీసుకురావడానికే చట్టంలో మార్పులు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
టికెట్ల విక్రయం కోసం ఇండియన్ రైల్వేస్ వినియోగిస్తున్న ఐఆర్సీటీసీ తరహాలోనే సినిమా టికెట్లను ఆన్ లైన్లో విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఆన్ లైన్ మూవీ టికెట్ బుకింగ్ విధానం అందరికీ అందుబాటులో, సౌకర్యవంతంగా ఉంటుందని మంత్రి తెలిపారు. ముబొల్, ఇంటర్నెట్, ఎస్ఎంఎస్ ద్వారా ప్రజలు తమకు నచ్చిన సినిమా టికెట్లు బుక్ చేసుకునే అవకాశమున్నట్లు పేర్ని నాని చెప్పారు. ప్రజలు సినిమా హాళ్ల వద్ద గంటల తరబడి క్యూలో నిలబడే సమయాన్ని ఆదా చేయడానికి ఈ ఆన్ లైన్ టికెటింగ్ సిస్టమ్ ఉపయోగపడుతుందని ప్రభుత్వం చెబుతోంది.
తాము తీసుకొచ్చే ఈ విధంగా బ్లాక్ టికెట్ల దందాకు చెక్ పెడుతుందని.. అలాగే ప్రభుత్వానికి పన్ను ఎగవేసేవారి సంఖ్యను కూడా తగ్గిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే నిర్ణీత గడువులోగా జీఎస్టీ, సర్వీస్ ట్యాక్స్ వంటి పన్నులను వసూలు చేయడం మరింత సులభమవుతుందని ప్రభుత్వం బిల్లులో పేర్కొంది.
ఇక ప్రజల్లో సినిమాలకు ఉన్న క్రేజ్ ను కొందరు సినిమావాళ్లు సొమ్ము చేసుకుంటున్నారని.. టికెట్ రేట్లను అమాంతం పెంచేస్తుండటంతో పేద, మధ్యతరగతి ప్రజలు వినోదానికి దూరమవుతున్నారని మంత్రి అన్నారు. వీటన్నింటినీ అరికట్టాలంటే ఆన్ లైన్ టికెటింగ్ విధానమే సరైందని ప్రభుత్వం నిర్ణయించి అసెంబ్లీలో బిల్లుపెట్టినట్లు వెల్లడించారు.
సినిమాటోగ్రఫీ చట్టానికి సవరణలు చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆన్ లైన్ సినిమా టికెటింగ్ సిస్టమ్ అమలుకానుంది. అసెంబ్లీలో బిల్లు ద్వారా విధివిధానాలు ఖరారు కావడంతో టికెట్ విక్రయాలకు సంబంధించిన వెబ్ సైట్ లేదా యాప్ ను అందుబాటులోకి వచ్చిన వెంటనే కొత్త విధానం అమలుకానుంది. ప్రభుత్వం కూడా వీలైనంత త్వరగా కొత్త పద్ధతిని అమలు చేయాలని భావిస్తోంది.
సినిమా టికెట్ల ఆన్ లైన్ విక్రయంపై సినిమా పెద్దలతో ప్రభుత్వం పలుసార్లు చర్చించింది. దశలవారీగా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో చర్చలు జరిపిన ప్రభుత్వం అందరూ అంగీకరించిన తర్వాత అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టింది. వెబ్ సైట్ ద్వారా టికెట్లు విక్రయించనున్న ప్రభుత్వం.. నిర్మాతలు, థియేటర్ల యజమానులకు సంబంధిత నగదును నేరుగా వారి ఖాతాలకు జమచేయనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP Assembly, Ap cm ys jagan mohan reddy, Ap minister perni nani, Tollywood