GOVERNMENT MADE SMALL CHANGES IN NEW DISTRICTS NAMES AS PER GEOGRAPHICAL BOUNDARIES FULL DETAILS HERE PRN
AP District Names Changed: ఏపీ కొత్త జిల్లాల పేర్లలో మార్పులు.. పూర్తి వివరాలు ఇవే..!
ప్రతీకాత్మకచిత్రం
ఏపీ ప్రభుత్వం (AP Government) 26 కొత్త జిల్లాలకు (New Districts) సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసేం. ఐతే కేబినెట్ సమావేశంలో ప్రవేశపెట్టిన వివరాలకు.. తర్వాత జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్లలో స్వల్ప తేడాలున్నాయి. ముఖ్యంగా జిల్లాల పేర్లలో చిన్నచిన్న మార్పులు చేశారు.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం కొత్త జిల్లాలను (AP New District) ఏర్పాటు చేస్తూ మంగళవారం అర్ధరాత్రి గెజిట్ నోటిఫికేషన్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 26 కొత్త జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ అయింది. ఐతే కేబినెట్ సమావేశంలో ప్రవేశపెట్టిన వివరాలకు.. తర్వాత జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్లలో స్వల్ప తేడాలున్నాయి. ముఖ్యంగా జిల్లాల పేర్లలో చిన్నచిన్న మార్పులు చేశారు. తొలుత కాకినాడ కేంద్రంగా ఏర్పాటు చేస్తున్న జిల్లాకు తూర్పుగోదావరి జిల్లా అని.. రాజమహేంద్రవరం కేంద్రంగా ఏర్పాటు చేస్తున్న జిల్లాకు రాజమహేంద్రవరం జిల్లాగా పేరు పెట్టినట్లు మంత్రివర్గం ఎదుట మెమోరో పొందుపరిచారు. ఐతే రాజమండ్రి జిల్లా పరిధిలోనే గోదావరి నది ఎక్కువ పరిధిలో ఉందని.. మంత్రులు చెప్పడంతో ఈ జిల్లాకు తూర్పుగోదావరి జిల్లాగా.. కాకినాడకు కాకినాడ జిల్లాగా గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
ఇక పశ్చిమగోదావరి జిల్లా విషయంలోనూ ఇదే జరిగింది. తొలుత ఏలూరు కేంద్రంగా ఏర్పటయ్యే జిల్లాకు పశ్చిమగోదావరి జిల్లాగా.. భీమవరం కేంద్రంగా ఏర్పాటయ్యే జిల్లాకు నరసాపురం జిల్లాగా నామకణం చేశారు. ఆ తర్వాత ఏలూరుకు ఏలూరు జిల్లాగా.. భీమవరంకు పశ్చిమగోదావరి జిల్లాగా పేరు మార్చారు.
కొత్త జిల్లాలతో పాటు రెవెన్యూ డివిజన్లలో కూడా స్వల్పమార్పులు చేశారు. ప్రకాశం జిల్లాలో కొత్తగా కనిగిరి డివిజన్ ఏర్పాటు చేస్తున్నట్లు తొలుత పేర్కొనగా.. గెజిట్ నోటిఫికేషన్లో మాత్రం కనిగిరి పేరు తొలగించారు. కొత్తగా పొదిలి డివిజన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. అలాగే పుట్టపర్తి కేంద్రంగా ఏర్పాటయ్యే శ్రీసత్యసాయి జిల్లాలో కదిరి, పెనుగొండ, పుట్టపర్తి రెవెన్యూ డివిజన్లు ఉంటాయని తొలుత చెప్పిన ప్రభుత్వం.. ఆ తర్వాత పెనుగొండ, పుట్టపర్తి, ధర్మవరం రెవెన్యూ డివిజన్లుగా పేర్కొంది.
జిల్లాలు, రెవెన్యూ డివిజన్లతో పాటు జిల్లాల పేర్లలో అక్షరాలను కూడా ప్రభుత్వం సవరించింది. కొన్నింటిలో తప్పులు దొర్లగా.. మరికొన్నింటిని మార్చింది. తిరుపతి అర్బన్ జిల్లా పేరులో Tirupathi కి బదులు Tirupati గా మార్చింది. ఇలా దాదాపు వంద పదాల్లో స్పెల్గింగులు సరిచేసింది. అర్ధం మారకపోయినా లోకల్ గా వాడుకలో ఉన్న పదాలతో ఉండేలా సవరించినట్లు అధికారులు తెలిపారు.
ఉదాహరణకు తొలుత ఎస్పీఎస్ నెల్లూరు జిల్లాగా తొలుత పేర్కొన్న అధికారులు.. ఆతర్వాత శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా మార్చారు. అలాగే వైఎస్ఆర్ కడప అని తొలుత పేర్కొనగా దానిని వైఎస్సార్ జిల్లాగా సవరించారు. ఇలాగే మండలం పేరును బీఎన్ కండ్రిగ అని పేర్కొనగా దానిని బుచ్చినాయుడు కండ్రిగగా మార్చారు. ఉత్తర్వుల్లో డ్రాఫ్ట్ ఫార్మ్-1 అన్న పదాలు తొలగించి, ఫార్మ్-1గా గుర్తించాలని సవరించిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.