ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య పీఆర్సీ యుద్ధం (PRC Issue) కొనసాగుతోంది. ఉద్యమ కార్యాచరణలో భాగంగా గురివారం ఉద్యోగులు చేపట్టిన చలో విజయవాడ (Chalo Vijayawada) విజయవంతమైంది. విజయవాడకు వేలాదిగా చేరుకున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతేకాదు ప్రభుత్వం తమను మోసం చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఉద్యోగుల ఆందోళనపై ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Rama Krishna Reddy) స్పందించారు. పిఆర్సీ విషయంలో ఉద్యోగుల తో చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మరోసారి ఆయన స్పష్టం చేశారు. సమస్యని జటిలం చేసుకునే దానికి బల ప్రదర్శనలు పనికి వస్తాయన్నారు. పీఆర్సీ సంబంధించి సీఎం తో సహా మేము ఎప్పటికప్పుడు ఉద్యోగ సంఘాలకు వివరించామని స్పష్టం చేశారు.
కోవిడ్, ఒమైక్రోన్ నేపధ్యంలో చేయాలిసిన అంతా ఉద్యోగులకు చేశామని సజ్జల వెల్లడించారు. ఉద్యోగులు పీఆర్సీ పై వ్యక్తం చేస్తున్న అసంతృప్తిని అర్ధం చేసుకున్నామని.. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగస్వాములు అనే ఉద్దేశ్యంతోనే కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు టైం ప్రకారం జీతాలు ఇచ్చామన్నారు. ఉద్యోగుల సమస్య ఏది సీఎం దృష్టికి వచ్చినా వాటికీ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 14.29 ఫిట్మెంట్ మాత్రమే ఇవ్వాలని అధికారులు నివేదిక ఇస్తే.. ఈ ప్రభుత్వం మాత్రం 23 శాతం ఫిట్మెంట్ పెంచి ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు.
ఉద్యోగులు అడగకుండానే ప్రభుత్వం పదవి విరమణ వయసు 62 కి పెంచిందని.., ఆర్టీసీ ఉద్యోగులని ప్రభుత్వం లో విలీనం చేశామమన్నారు. చర్చలకు రాకుండా సమ్మెతో ఏమి సాధిస్తారని ఆయన ప్రశ్నించారు. కొందరు రాజకీయ లబ్ధికోసం ప్రయత్నిస్తున్నారని.. ఉద్యోగులకు అది అవసరమా..? అని సజ్జల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగులకు రాజకీయాలు అవసరమా.. సామరస్యంగా చర్చించి పరిష్కరించుకోవడం అవసరమో తేల్చుకోవాలన్నారు. సమ్మె కి వెళ్ళితే ప్రజా జీవనానికి ఇబ్బంది రాకూడదని.. అలా జరిగిన పక్షంలో క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మేము ఒక్కొక్కరం ఐదు ఓట్లు వేయిస్తాం అంటే బ్లాక్ మెయిల్ చేయడమే కదా? అని సజ్జల ప్రశ్నించారు.
ఇదిలా ఉంటే ఉద్యోగుల ఉద్యమంపై ప్రతిపక్ష నేత చంద్రబాబు స్పందించిన సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వం ఉద్యోగులను ఉగ్రవాదుల్లా చూస్తోందంటూ ఆయన సంచలన ఆరోపణలు చేశారు. విద్యార్థుల ముందే ఉపాధ్యాయులను అరెస్ట్ చేస్తూ అవమానిస్తున్నారన్నారు. తాము 43 శాతం ఫిట్ మెంట్ ఇస్తే.. జగన్ మాత్రం 23శాతం ఇచ్చి వారిని మోసం చేశారని బాబు ఆరోపించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap government, Employees, Sajjala ramakrishna reddy