లాక్‌డౌన్ నియమ నిబంధనలను ఉల్లంఘించినందుకు సీజ్‌చేసిన వాహనాలను విడుదల చేయాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి పోలీసులను ఆదేశించారు. ఈ సందర్భంగా మళ్లీ నియమాలను ఉల్లఘించబోమంటూ వాహనదారుల నుంచి హామీపత్రాన్ని తీసుకోవాలని ఆయన సూచించారు. లాక్‌డౌన్ పరిస్థితులపై అధికారులతో జరిగిన సమావేశంలో సీఎం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు. రూ.100ల జరిమానాకు పరిమితం చేయాలని సీఎం జగన్ అధికారులకు స్పష్టంచేశారు. వాహనాలు వారికి అప్పగించేటప్పుడు కరోనా నివారణ కోవిడ్ జాగ్రత్తలపై అవగాహన కూడా కల్పించాలని పోలీసులు అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు.
అంతకుముందు ఇదే విషయాన్ని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కూడా వెల్లడించారు. వాహనాలకు సంబంధించిన సరైన ధ్రువపత్రాలను సంబంధిత పోలీసు స్టేషన్‌లో సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఆ మేరకు ఇప్పటికే జిల్లా ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసినట్టు పేర్కొన్నారు. వాహన యజమానులు సంబంధిత పోలీసు స్టేషన్‌లో సంప్రదించవచ్చని సూచించారు. అయితే వాహనం తీసుకెళ్లే సమయంలో ఎంత జరిమానా కట్టాలో అని టెన్షన్ పడుతున్న వాహనదారులకు సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం ఊరట కలిగించనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.