ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వ ఉద్యోగులకు ( Government Employees) రాష్ట్ర ప్రభుత్వం (AP Government) శుభవార్త చెప్పింది. ఉద్యోగులు ఎంతకాలంగానో ఎదురుచూస్తున్న పీఆర్సీ అమలుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakirshna Reddy) తెలిపారు. బుధవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎంఓ అధికారులు ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపారు. సమావేశంలో ఉద్యోగుల పీఆర్సీ(PRC), హెల్త్ కార్డులు (Health Cards), హెల్త్ ఫీజుల రీయింబర్స్ మెంట్, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ వంటి అంశాలపై చర్చించారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి.. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కరిస్తామన్న ఆయన.. ఈ నెలాఖరుకు పీఆర్సీ అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఉద్యోగుల భద్రత విషయంలో సీఎం జగన్ రెండడుగులు ముందే ఉంటారని సజ్జల అన్నారు
ఉద్యోగులకు అన్ని రకాలుగా అండగా ఉంటామన్న సజ్జల.. వారికి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కచ్చితంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎప్పటినుంచో పెండింగ్ లో ఉన్న ఆర్టీసీ డిమాండ్లను సీఎం జగన్ నెరవేర్చారని ఆయన గుర్తుచేశారు. కొవిడ్ వల్ల ఆర్ధిక ఇబ్బందులు రావడంతో రెండేళ్లుగా సమస్యలు పరిష్కారం కాలేదని సజ్జల అన్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని.. పీఆర్సీ అమలుపై ప్రభుత్వం చర్చిస్తోందన్నారు. అధికారంలోకి రాగానే 27శాతం ఐఆర్ హామీ సీఎం జగన్ నెరవేర్చారని గుర్తుచేశారు. పీఆర్సీ ఈ నెలాఖరులోగా పూర్తి చేస్తామని, మిగిలిన విషయాలను కూడా క్రమ పద్ధతిలో చేస్తామని ఉద్యోగులకు హామీ ఇచ్చారు.
సజ్జల ఏమన్నారంటే ‘ఉద్యోగులు లేకపోతే ప్రభుత్వం లేదు. అపోహలు వద్దు. ఎవరేం చెప్పినా నమ్మొద్దు. జీతాల విషయంలో ఆలస్యం లేకుండా చర్యలు తీసుకుంటాం. ఉద్యోగులను మరింత ఆప్యాయంగా సీఎం చూసుకుంటారు. మిగిలిన సమస్యలు నవంబర్‌లోగా తీరుస్తాం. ఏ ఉద్యోగుల సంఘాలు వచ్చినా, ఉద్యోగులు వచ్చినా మేము స్పందిస్తాం. ఇది ఎంప్లాయ్ ఫ్రెండ్లీ గవర్నమెంట్. ఉద్యోగుల సమస్యలపై చర్చలు జరుగుతూనే ఉంటాయి. దాంట్లో దాపరికం ఏమీ లేదు” అని అన్నారు.
గత కొన్నిరోజులుగా ఉద్యోగులు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. పలుసార్లు ఉద్యోగ సంఘాలు భేటీ అవగా.. ప్రభుత్వ పెద్దలు ఫోన్ చేసి వారిని శాంతింపజేసినట్లు ప్రచారం జరిగింది. ఐతే పెన్షన్లు సకాలంలో రాకపోవడం, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఆలస్యం కావడమే కాకుండా.. ఉద్యోగులకు కూడా కొన్ని నెలలు సమయానికి జీతాలు క్రెడిట్ కాకపోవడంతో కలకలం రేగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభువం ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపింది. ఈ మేరకు పీఆర్సీ అమలుపై హామీ ఇచ్చింది. ప్రభుత్వ తాజా ప్రకటనతో ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap government, Employees, Salaries hike