Good News To Farmers: రైతులకు శుభవార్త.. అక్టోబర్ లో అకౌంట్లోకి నగదు.. ఖరీఫ్ సమయానికి విడుదల

వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)

రైతులకు మరో శుభవార్త చెప్పింది ఏపీ ప్రభుత్వం.. ఈ అక్టోబర్ లోనే ఖరీఫ్ సీజిన్ కు సంబంధించి సున్నా వడ్డీ రాయితీ జమ చేయాలని నిర్ణయం తీసుకుంది.

  • Share this:
    కరోనా కష్ట కాలంలోనూ సీఎం జగన్ పెద్ద మనసు చాటుకుంటున్నారు. బయట నుంచి అప్పులు రాకపోయినా.. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నా.. చెప్పిన పథకాలను మాత్రం ఆపకుండా కొనసాగిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా రైతుల సంక్షేమమే లక్ష్యంగా సీఎం జగన్ నిధులు విడుదల చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మరో గుడ్ న్యూస్ చెప్పారు రైతులకు. చిన్న, సన్నకారు రైతులతోపాటు వాస్తవ సాగుదారులకు పంట రుణాలపై వడ్డీ భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా సీజన్‌ ముగియకుండానే వడ్డీ రాయితీ జమ చేస్తూ అన్నదాతలకు అండగా నిలుస్తోంది. ఈ పథకం కింద ఖరీఫ్‌–2019 సీజన్‌లో 14.27 లక్షల మంది రైతులకు రూ.289.42 కోట్లు, రబీ 2019–20 సీజన్‌లో 6.28 లక్షల మందికి రూ.128.47 కోట్ల వడ్డీ రాయితీని ప్రభుత్వం జమ చేసింది. దీనికి తోడు గత ప్రభుత్వ హయాంలో 42.32 లక్షల మందికి బకాయిపడిన 784.72 కోట్లను కూడా జగన్ సర్కార్ చెల్లించింది. తాజాగా ఖరీఫ్‌–2020 సీజన్‌కు సంబంధించి అర్హత గల ప్రతి రైతుకు వచ్చే అక్టోబర్‌లో వడ్డీ రాయితీ జమ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఇప్పటికే దీనికి సంబంధించి అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది.

    ఏపీ వ్యాప్తంగా ఖరీఫ్‌–2020 సీజన్‌కు గాను 86.17 లక్షల మంది రైతులకు 1.47 లక్షల కోట్ల రుణాలిచ్చారు. వీరిలో లక్షలోపు రుణాలు తీసుకున్నవారు కనీసం 20 లక్షల మందికి పైగా ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. నిబంధనల ప్రకారం.. పంట రుణాలపై 7 శాతం వడ్డీని బ్యాంకులు వసూలు చేస్తాయి. ఇందులో రైతులు తీసుకున్న పంట రుణాలపై 3 శాతం వడ్డీ రాయితీని కేంద్రం భరిస్తోంది. మిగిలిన 4 శాతం వడ్డీని గతంలో రైతులే చెల్లించేవారు. ప్రస్తుతం దీన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. తీసుకున్న రుణ మొత్తాన్ని వాయిదాలతో సహా ఏడాదిలోపు తిరిగి చెల్లించిన రైతుల పొదుపు ఖాతాలకు ఈ వడ్డీ రాయితీని రాష్ట్ర ప్రభుత్వం నేరుగా జమ చేస్తోంది. లక్ష వరకు పంట రుణాలు తీసుకుని ఏడాదిలోగా తిరిగి చెల్లించిన రైతులందరూ ఈ వడ్డీ రాయితీకి అర్హులు. ఏ పంటపై రుణం తీసుకున్నారో ఆ పంటను మాత్రమే సాగు చేయాల్సి ఉంటుంది. వారు వేసిన పంటను తప్పనిసరిగా ఈ–క్రాప్‌ బుకింగ్‌లో నమోదు చేయించుకుని ఉండాలి.

    వైఎస్సార్‌ సున్నా వడ్డీ రాయితీ పథకంపై రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతుల్లో అవగాహన కల్పిస్తున్నారు. తీసుకున్న పంట రుణాలను సకాలంలో చెల్లించే విధంగా రైతుల్లో చైతన్యం తెస్తున్నారు. అలాగే వారు సాగు చేసిన పంట వివరాలను తప్పనిసరిగా ఈ–క్రాప్‌ బుకింగ్‌ చేయించారో, లేదో పరిశీలించనున్నారు. గడువు తేదీలోగా రుణాలు చెల్లించిన రైతుల జాబితాను సామాజిక తనిఖీ కోసం ఆర్బీకేల వద్ద ప్రదర్శించనున్నారు. అర్హులైన రైతుల వివరాలను వైఎస్సార్‌ఎస్‌వీపీఆర్‌ పోర్టల్‌లో గడువు తేదీలోపు బ్యాంకులు అప్‌లోడ్‌ చేసేలా పర్యవేక్షించనున్నారు.
    Published by:Nagesh Paina
    First published: