GOOD NEW TO TIRUMALA DEVOTEES AFTER SIX MONTHS WORKS SRIVARI STEPS WAY RE OPEN TO DAY NGS TPT
Tirumala Temple: శ్రీవారి భక్తులకు శుభవార్త.. నేటి నుంచి ఆ భక్తులకు అనుమతి
శ్రీవారి భక్తులకు శుభవార్త
Tirumala Temple: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఆరు నెలలుగా ఇబ్బందులు పడుతున్న భక్తులకు టీటీడీ నేటి నుంచి అవకాశం కల్పిస్తోంది. దీంతో నేటి నుంచి స్వామి వారి దర్శనానికి వెళ్లే భక్తుల సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశం ఉంది.. టీటీడీ నిర్ణయంపై భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Tirumala Tirupati News: కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanam). కొండపై కొలువుతీరిన అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడైన ఆ శ్రీనివాసుడిని దర్శించుకోవడానికి దేశ, విదేశాల నుంచి భక్తులు భారీగా తరలి వస్తుంటారు. వాహనాల్లో వెళ్లే వారు ఘాట్ రోడ్డు (Ghat road) ద్వారా తిరుమల (Tirumala)కు చేరుకుంటుండగా, నడక మార్గం భక్తులు అలిపిరి (Alipiri), శ్రీవారి మెట్లు (Sri Vari Metlu) ద్వారా శ్రీవారిని దర్శించుకుంటారు. అయితే వీటన్నింటిలో అత్యంత త ప్రాచీనమైనది. శ్రీవారి మెట్టు మార్గం.. అత్యంత ఎక్కువమంది భక్తులు ఈ దారి గుండానే స్వామి వారి దర్శనానికి వెళ్తారు. తిరుమల చేరుకోవడానికి ఉన్నవి రెండు నడకమార్గాలే. ఒకటి అలిపిరి మార్గం, మరోకటి శ్రీవారి మెట్ల మార్గం. తిరుపతి నగరానికి 15 కిలోమీటర్ల దూరంలో చంద్రగిరి పట్టణానికి సమీపంలో ఉండేది ఈ శ్రీవారి మెట్టు నడకమార్గం, పద్మావతి (Padmavati) అమ్మవారిని కళ్యాణం చేసుకున్న తరువాత సాక్షాత్తు ఆ స్వామి అమ్మవార్లు కొండపైకి నడిచివెళ్లిన మార్గం కాబట్టే.. దీన్ని శ్రీవారి మెట్టు అని పిలుస్తారు. కానీ గత ఆరు నెలలుగా ఇది మూతపడింది.
గతేడాది నవంబర్లో కురిసిన భారీ వర్షాలకు నడక మార్గం పూర్తిగా ధ్వంసం అయింది. 800 మెట్టు వద్దనున్న కల్వర్టు వరదల్లో కొట్టుకుపోగా..మార్గం మొత్తం బండారాళ్లు, ఇసుక మేటలు ఏర్పడి నడిచేందుకు వీలు లేకుండా పోయింది. నడక మార్గం ద్వారా వచ్చే భక్తులకు దివ్యదర్శనం టికెట్లు ఇచ్చే కౌంటర్లు కూడా వరదల ధాటికి కొట్టుకుపోయాయి. దీంతో శ్రీవారి మెట్టు మార్గాన్ని మూసివేసిన టీటీడీ ఆరు నెలల పాటు మరమ్మతులు నిర్వహించి.. శ్రీవారి మెట్టు మార్గాన్ని అందుబాటులోకి తెచ్చింది టీటీడీ.
పూర్తిగా రోడ్డు పాడవ్వడంతో గతేడాది.. నవంబర్ 19వ తేదీన శ్రీవారి మెట్టు నడకమార్గాన్ని టీటీడీ మూసివేసింది. శ్రీవారి మెట్టు మార్గంలో రోజూ టీటీడీ 6వేల సర్వదర్శనం టోకెన్లు మంజూరు చెసేది. ప్రస్తుతం ఆ మార్గాన్ని మూసి వేయడంతో కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి పాదయాత్రగా వచ్చే గోవింద మాలధారణ భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ మెట్ల మార్గం అందుబాటులో లేకపోవడంతో అదనంగా 15 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. శ్రీవారి మెట్లు నేడు ప్రారంభం అవుతుండడంతో ఇక మూడు పక్క రాష్ట్రాల నుంచి భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. నేటి నుంచి నడక మార్గం ద్వారా భక్తులను అనుమతించనున్నారు.
అయితే గతంలో కంటే ఇప్పుడు సరికొత్త హంగులతో పటిష్టంగా మెట్టు మార్గాన్ని తీర్చిదిద్దింది టీటీడీ. వరంగల్ ఎన్ఐటీ ప్రొఫెసర్లతో మెట్టు మార్గాన్ని అధ్యయనం చేయించిన అనంతరం వారి సూచనల మేరకు ఎంతో పటిష్టంగా నిర్మాణం చేపట్టారు. మరో వందేళ్లలో ఎంత పెద్ద వరద వచ్చినా మెట్టు మార్గం చెక్కు చెదరకుండా ఉండేలా నిర్మాణం చేపట్టినట్లు టీటీడీ అధికారులు పేర్కొన్నారు. మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వరుసగా సెలవులు రావడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా తిరుమల కొండ భక్తులతో పోటెత్తుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.