ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో గోదావరి వరద (Godavari Floods) ఉధృతి క్రమంగా తగ్గుతోంది. ఆదివారంతో పోలిస్తే వరద కాస్త తగ్గుముఖం పట్టింది. ప్రస్తతం ధవళేశ్వరం వద్ద గోదావరి ప్రవాహం నిలకడగా సాగుతోంది. ధవళేశ్వరం బ్యారేజి వద్ద గోదావరి ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 23.30 లక్షల క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయిలో వరద తగ్గే వరకు గోదావరి పరివాహాక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది. స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని ప్రభుత్వం పర్యవేక్షిస్తోంది. సహాయక చర్యల్లో మొత్తం 10 ఎన్డీఆర్ఎఫ్, 10 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొంటున్నాయి. ఆరు జిల్లాల్లోని 62 మండలాల్లో మొత్తం 385 గ్రామాలు వరద ప్రభావానికి గురయ్యాయి. మరో 241 గ్రామల్లోకి వరదనీరు చేరింది.
ఇప్పటివరకు 97,205 మందిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ప్రభుత్వం తెలిపింది. 84,734మందిని 191 పునరావాస కేంద్రాలకు తరలించారు. 256 మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేయడంతో పాటు 1,25,015 ఆహార ప్యాకెట్లు పంపిణీ చేసినట్లు విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. మరో 48గంటల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
ఇదిలా ఉంటే వరదల కారణంగా గోదావరి జిల్లాలో తీవ్ర పంట, ఆస్తి నష్టం సంభవించింది. అలాగే రోడ్లు, విద్యుత్ స్తంభాల వంటి మౌలిక సదుపాయలు కూడా దెబ్బతిన్నాయి. అధికారులిచ్చిన ప్రాథమిక సమాచారం మేరకు మొత్తం ఆరు జిల్లాల్లో దాదాపు 11వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. మూడు వేల ఎకరాలకు పైగా వ్యవయా పంటలు, 7వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
ముఖ్యంగా కోనసీమ జిల్లా (Konaseema District) లో భారీగా పంట నష్టం సంభవించింది. ఈ ఒక్క జిల్లాలోనే 5,253 ఎకరాలు, తూర్పు గోదావరి జిల్లా (East Godavari District) లో దాదాపు 2వేల ఎకరాల మేర ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా కొబ్బరి, అరటి తోటలకు బాగా తెబ్బతిన్నాయి. తోటలన్ని రోజుల తరబడి వరదనీటిలోనే ఉండటంతో నష్టం మరింత పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.
మౌలిక సదుపాయల విషయానికి వస్త వెయ్యి కిలోమీటర్ల మేర రోడ్లు ధ్వంసం కాగా, 156 చోట్ల రోడ్లు పూర్తిగా కోతకు గురయ్యాయి. 35 రోడ్లపై వరదనీరు ప్రవహించింది. విద్యుత్ శాఖకు సంబంధించి 34,749 ట్రాన్స్ ఫార్మర్లు ధ్వంసమయ్యాయి. ఇవన్నీ ప్రాథమిక అంచనాలు మాత్రమేనని అధికారులు తెలిపారు. వరద పూర్తిగా తగ్గుముఖం పట్టిన తర్వాత నష్టం అంచనా వేయనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP Floods, Godavari river