ఇటీవల హైదరాబాద్ (Hyderabad) నడిబొడ్డున జరిగిన అగ్నిప్రమాదం అందరినీ భయపెట్టిన విషయం తెలిసిందే. సికింద్రాబాద్‌లోని దక్కన్ మాల్ (Deccan Mall Fire accident)లో మంటలు చెలరేగి.. ముగ్గురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. భారీగా ఆస్తి నష్టం జరిగింది. ఇప్పుడు అలాంటి ఘటనే.. ప్రకాశం (Prakasam) జిల్లా మార్కాపురంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పట్టణంలోని శివాలయం సమీపంలో ఉన్న శ్రీనివాస హార్డ్ వేర్ దుకాణంలో మంటలు చెలరేగాయి. ఇది ఆరంతస్తుల భవనం. మొదట హార్డ్ వేర్ దుకాణంలో మంటలు వచ్చాయి. లోపల ఉన్న పెయింట్ డబ్బాలు తగలబడ్డాయి. అక్కడి నుంచి ప్లైవుడ్ గోడౌన్‌కు మంటలు వ్యాపించాయి. అలా చూస్తుండగానే.. భవనం మొత్తం అగ్ని కీలల్లో చిక్కుకుపోయింది. కింది నుంచి పై వరకూ... ఉవ్వెత్తున మంటలు ఎగిసిపడ్డాయి.
పెయింటింగ్‌తో పాటు ఇతర హార్డ్ వేర్ సామాగ్రి భారీ మొత్తంలో ఉండడం.. అదంతా కాలిపోవడంతో... మంటలను అదుపు చేయడం అగ్నిమాపక సిబ్బందికి కష్టమైంది. మొదట ఒకే ఫైరింజన్‌తో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత యర్రగొండపాలెం, పెద్ద దోర్నాల, కంభం నుంచి కూడా అగ్నిమాపక శకటాలను రప్పించి.. నీళ్లు చల్లారు. చివరకు అతి కష్టం మీద..తెల్లవారుఝామున మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో భవనం లోపల ఉన్న వస్తువులన్నీ కాలిబూడిదయ్యాయి.
భారీ అగ్నిప్రమాదం నేపథ్యంలో.. ముందుజాగ్రత్తగా చుట్టుపక్కల వారిని అధికారులు ఖాళీ చేయించారు. చాలా మంది తమ బంధువుల ఇళ్లకు వెళ్లిపోయారు. మంటలు అదుపులోకి వచ్చే వరకు.. అధికారులు విద్యుత్ సరఫరాను కూడా నిలిపివేశారు.దాంతో రాత్రంతా స్థానికులు ఇబ్బందులు పడ్డారు. ఈ ప్రమాదంలో కోటి రూపాయలు విలువ చేసే.. సామాగ్రి కాలిబూడిదయిందని షాప్ యజమాని సుబ్రమణ్యం తెలిపారు. రాత్రి వేళ ఎవరూ లేని సమయంలో ఈ ప్రమాదం జరిగిందని..ఉదయం పూట జరిగిఉంటే.. ప్రాణనష్టం కూడా జరిగి ఉండేదని స్థానికులు అభిప్రాయపడ్డారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Fire Accident, Local News