వైఎస్సార్ ఉచిత పంటల బీమా పరిహారం (ysr crop insurance) కింద 2021 ఖరీఫ్‌లో ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడల వల్ల పంట నష్టపోయిన రైతుల ఖాతాల్లోకి ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి (AP CM Jagan) నిధులు విడుదల చేశారు. శ్రీసత్యసాయి జిల్లా (Sri Satya sai District) చెన్నే కొత్తపల్లి కేంద్రంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్రం మొత్తం మీద ఉన్న 15.61 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.2,977.82 కోట్ల బీమా పరిహారాన్ని సీఎం జగన్ బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేశారు. అయితే, బీమా సొమ్ము తమకు పడలేదంటూ కొందరు రాయలసీమ రైతులు సచివాలయానికి (Grama Sachivalayam) తాళాలు వేసి హడావుడి చేశారు.
అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం నింబగల్లు గ్రామ రైతుల్లో చాలా మందికి బీమా సొమ్ము జమ కాలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయ పరిధిలోని 1,100 మంది రైతుల్లో కేవలం 63 మందికే బీమా వచ్చిందంటూ అక్కడి రైతులు ఆరోపిస్తున్నారు. తామందరం పంట నష్టపోయినా కేవలం 63 మందికే రావడం ఏంటంటూ ఆగ్రహించిన రైతులు సచివాలయానికి తాళాలు వేసి తమ నిరసన తెలిపారు. అదే సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అనంతపురం జిల్లా సమీపంలోని శ్రీసత్యసాయి జిల్లా పర్యటనలో ఉండటం గమనార్హం.
సచివాలయాలకు తాళాలు వేయడం ఇదేం తొలిసారి కాదు. పెన్షన్ సొమ్ము రానప్పుడు, రేషన్ కార్డుల్లో పేర్లు తొలగించారని.. సమస్య పరిష్కరించడం లేదంటూ ఆగ్రహించిన కొందరు బాధితులు గతంలోనూ ఇలానే సచివాలయాలకు తాళాలు వేస్తూ నిరసన తెలిపారు. ఇటీవల కాలంలో మే నెలలో సీఎం సొంత జిల్లా కడపలోనూ ఓ మహిళ ఇలానే సచివాలయానికి తాళాలు వేసింది. అద్దె భవనంలో నిర్వహిస్తున్న సచివాలయానికి గత పది నెలలుగా అద్దె చెల్లించడం లేదన్న కారణంతో.. సచివాలయానికి తాళాలు వేసింది. ఈ విషయమై అధికారులకు చెబుతున్నా పట్టించుకోవడం లేదని దాంతో విసిగి చెంది ఇలా చేశానంటూ ఆమె చెప్పుకొచ్చారు.
అదేవిధంగా, నూతన సచివాలయ భవనం నిర్మించి రెండేళ్లు అవుతున్నా అధికారులు బిల్లులు చెల్లించలేదన్న కారణంతో కడప జిల్లా ఖాజీపేట మండలం అప్పన్నపల్లి పంచాయతీలోని సచివాలయానికి ఏప్రిల్‌లో ఓ కాంట్రాక్టర్ తాళం వేశాడు. అధికారులకు ఇవ్వాల్సిన కమిషన్ ఇచ్చినా స్పందించడం లేదని దాంతో చేసేదేమీ లేక ఇలా సచివాలయానికి తాళాలు వేసినట్లు ఆ కాంట్రాక్టర్ చెప్పాడు. ఇలా ఏ చిన్న సమస్య వచ్చినా ప్రజలకు సచివాలయాలకు తాళాలు వేయడం అలవాటైపోయింది. సచివాలయ సిబ్బంది కూడా చేసేదేమీ లేక ఉన్నతాధికారులకు తమ గోడు వెల్లబోసుకోవడం పరిపాటిగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anantapuram, Andhrapradesh, Ap grama sachivalayam, Ys jagan